Omicron: జిన్ పింగ్‌కు ఇబ్బంది కలగకూడదని.. ఒమిక్రాన్‌ అని పేరు పెట్టారట..!

దశలవారీగా కరోనా వైరస్ విజృంభణతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రపంచం.. కాస్త ఊపిరి పీల్చుకుంటుంది. ఈ లోపే దక్షిణాఫ్రికా నుంచి ఒమిక్రాన్ (Omicron) రూపంలో మహమ్మారి కొత్త అవతారం ఎత్తింది. వెలుగుచూసిన రెండు రోజుల్లోనే ఆసియా, ఐరోపా ఖండాలకు విస్తరించింది.

Updated : 27 Nov 2021 16:44 IST

కరోనా కొత్త వేరియంట్ పేరుపై సరికొత్త వివరణ

ఇంటర్నెట్ డెస్క్‌: దశలవారీగా కరోనా వైరస్ విజృంభణతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రపంచం.. ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటోంది. ఈ లోపే దక్షిణాఫ్రికా నుంచి ఒమిక్రాన్ (Omicron) రూపంలో మహమ్మారి కొత్త అవతారం ఎత్తింది. వెలుగుచూసిన రెండు రోజుల్లోనే ఆసియా, ఐరోపా ఖండాలకు విస్తరించింది. వేగంగా విస్తరిస్తోన్న ఈ వైరస్‌పై ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. కరోనా వైరస్ మొదట వెలుగుచూసిన రకానికి ఇప్పటికి పలు మార్పులు చోటుచేసుకున్నాయి. అవి కొనసాగుతున్నాయి కూడా. ఆ కొత్త రకాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీక్ వర్ణమాల ప్రకారం పేర్లు పెడుతోంది. అంటే తెలుగులో అ, ఆ, ఇ, ఈ మాదిరిగా.. గ్రీకు భాషలో ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అన్నమాట. అందులో డెల్టా వేరియంట్ సృష్టించిన విలయాన్ని మనం ఇంకా మర్చిపోలేకపోతున్నాం.

కాగా, తాజాగా వెలుగుచూసిన రకంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర సమావేశం నిర్వహించి.. దాన్ని ఆందోళన కలిగించే రకంగా వర్గీకరించింది. అలాగే ఒమిక్రాన్ (Omicron) అంటూ నామకరణం కూడా చేసింది. దీనిపై హార్వర్డ్ మెడికల్‌ కాలేజ్‌కు చెందిన మెడిసిన్ విభాగపు ప్రొఫెసర్ మార్టిన్ కుల్డార్ఫ్‌ సరికొత్త వివరణ ఇచ్చారు.  గ్రీకు వర్ణమాల ప్రకారం కొత్త వేరియంట్‌కు ‘Nu’ అని పేరు పెట్టాల్సి ఉందన్నారు. వర్ణమాలలో ‘Nu’ తర్వాత వచ్చే అక్షరం ‘Xi’. మళ్లీ కొత్త వేరియంట్‌ ఏదైనా వస్తే.. దానికి ‘Xi’ అని పెట్టాల్సి వస్తుంది. కరోనాకు పుట్టినిల్లుగా భావిస్తోన్న చైనా అధ్యక్షుడి పేరు షీ జిన్‌పింగ్ (Xi Jinping). ఆయన పేరులో ‘Xi’ ఉంది. ఆ పరిస్థితిని దాటవేసేందుకే ఆ రెండింటి తర్వాతి అక్షరం ఒమిక్రాన్‌ను పెట్టినట్టు వివరించారు. 

ఇప్పటికే కరోనా వైరస్‌కు మూలం చైనానే అని అంతర్జాతీయంగా పలు దేశాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. మరోవైపు చైనానేమో ఆ వాదనలు కొట్టిపారేస్తోంది. ఆరోగ్య సంస్థ నేతృత్వంలో అంతర్జాతీయ బృందం చేపట్టిన దర్యాప్తునకు ఆ దేశం నుంచి సరైన సహకారం అందలేదు. దాంతో కరోనా అసలు మూలం ఏంటో ఇంతవరకూ స్పష్టత లేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కరోనా వేరియంట్‌కు ‘Xi’ అని పేరు పెడితే ఇబ్బందికర వాతావరణం నెలకొంటుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని