Amit Shah: ఆర్టికల్‌ 370 శాశ్వతమంటే.. రాజ్యాంగాన్ని అవమానించినట్లే: అమిత్‌ షా

ఇప్పటికీ ఎవరైనా ఆర్టికల్‌ 370 శాశ్వతమైనదంటే.. వారు భారత రాజ్యాంగాన్ని, పార్లమెంట్‌ను అవమానించినట్లేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు.

Updated : 11 Dec 2023 21:23 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌కు (JammuKashmir) స్వయం ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ‘ఆర్టికల్‌ 370’ని (Article 370) రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైందేనంటూ సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) ఇచ్చిన తీర్పును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా (Amit Shah) స్వాగతించారు. ఇప్పటికీ.. ‘ఆర్టికల్‌ 370 శాశ్వతమైనది’ అని ఎవరైనా అంటే వారు భారత రాజ్యాంగాన్ని, పార్లమెంట్‌ను అవమానించినట్లేనన్నారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు తర్వాత జమ్ముకశ్మీర్‌ రాజ్యాంగానికి ఇకపై ఎలాంటి విలువ ఉండబోదని చెప్పారు. సరైన సమయంలో జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నట్లు అమిత్‌ షా తెలిపారు.

‘‘జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 వేర్పాటువాదానికి దారితీసింది. అది తీవ్రవాదాన్ని ప్రోత్సహించింది. ఆర్టికల్‌ 370 రద్దుపై తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిపక్షాలకు చెంపపెట్టు లాంటిది. కశ్మీరీలకు న్యాయం చేసేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ భారత్‌లో భాగం. దానిని ఎవరూ ఆక్రమించలేరు. కాదని ఎవరైనా ప్రయత్నిస్తే గట్టిగా బుద్ధి చెబుతాం. భారతదేశ అంగుళం భూభాగాన్ని కూడా కోల్పోయే ప్రసక్తే లేదు. అందుకు భాజపా ఎప్పటికీ సిద్ధంగా ఉండదు. ఆర్టికల్‌ 370 ముసుగులో మూడు కుటుంబాలు అధికారాన్ని అనుభవించాయి. గత 75 ఏళ్లుగా స్థానిక ఎస్టీ ప్రజలు అన్ని హక్కుల్నీ కోల్పోయారు’’ అని అమిత్‌ షా రాజ్యసభలో అన్నారు.

రాజ్యసభ వేదికగా భారత మాజీ ప్రధాని నెహ్రూపై అమిత్‌ షా విమర్శలు గుప్పించారు. కేవలం ఒకే వ్యక్తి వల్ల భారత్‌లో జమ్ముకశ్మీర్‌ భాగం కావడం ఆలస్యమైందంటూ ఆయన్ను ఉద్దేశించి అన్నారు. కశ్మీర్‌లో కాల్పుల విరమణ లేకపోయి ఉంటే.. అసలు పీవోకే ఉండేది కాదని చెప్పారు. ఆర్టికల్‌ 370 రద్దుకు ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రివర్గం, భాజపా పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు తెలిపారు. వేర్పాటువాదాన్ని ప్రోత్సహించిన నాయకులను కశ్మీర్‌ ప్రజలు తిరస్కరించారని చెప్పారు. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న వారిని గుర్తించి, ఆ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రయత్నించామని చెప్పారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత భారీ స్థాయిలో దాడులు ఎప్పుడైనా జరిగాయా?పెద్ద సంఖ్యలో ఎవరైనా మరణించారా? అని అమిత్‌ షా ప్రశ్నించారు. ఉరీ, పుల్వామా సెక్టార్లలో మారణహోమం సృష్టించిన వారిని, వాళ్ల ఇంటికి వెళ్లి మరీ హతమార్చామంటూ పాక్‌ భూతలంలో సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు భారతదేశంలో ఒకే రాజ్యాంగం, ఒకే జెండా, ఒకే ప్రధాని ఉన్నారని ఈ సందర్భంగా అమిత్‌ షా వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని