Updated : 10 May 2021 11:58 IST

DarkSide.. అమెరికాపై ఉచ్చు..!

  తూర్పు తీరంలోని 18 రాష్ట్రాల్లో చమురు అలజడి..!

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

అమెరికా మరో భారీ సైబర్‌ దాడికి లక్ష్యంగా మారింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి లాంటి చమురు పైప్‌లైన్‌ మూతపడింది.  ఫలితంగా ఆ దేశ ఇంధన సరఫరా వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అయింది. తూర్పు తీరంలోని దాదాపు 18 రాష్ట్రాల్లో సమస్యలు మొదలయ్యాయి. కొన్నాళ్ల క్రితమే ఓ భారీ సైబర్‌ దాడికి గురైనా అమెరికా మళ్లీ నెలల వ్యవధిలోనే  మరో హ్యాకింగ్‌కు గురికావడం గమనార్హం.

అసలేం జరిగింది..?

శుక్రవారం అమెరికాలోని తూర్పుతీరంలో కలోనియల్‌ పైప్‌లైన్‌పై భారీ సైబర్‌ దాడి జరిగింది.  ఇది టెక్సాస్‌ నుంచి న్యూజెర్సీ వరకు దాదాపు 5,500 మైళ్లు చమురును సరఫరా చేస్తుంది.  నిత్యం 25 లక్షల బ్యారళ్ల పెట్రోల్‌, డీజిల్‌, వైమానిక ఇంధనాన్ని సరఫరా చేస్తుంటుంది. ఇది తూర్పుతీరం వినియోగించే దానిలో 45శాతానికి సమానం. శుక్రవారం దాడి చేసిన సైబర్‌ క్రిమినల్‌ గ్యాంగ్‌ దీనిని పూర్తిగా మూసివేసింది.

ప్రభావితం అయ్యే రాష్ట్రాలు ఇవే..

మొత్తం 18 రాష్ట్రాలపై దీని ప్రభావం పడనుంది. అలబామా, అర్కాన్సస్‌, డిస్ట్రిక్‌ ఆఫ్‌ కొలంబియా,డెలావేర్‌,ఫ్లోరిడా, జార్జియా,కెంటకీ,లూసియానా,మేరీల్యాండ్‌,మిస్సిసిపీ,న్యూజెర్సీ,న్యూయార్క్‌,నార్త్‌కరోలినా,పెన్సిల్వేనియా,దక్షిణ కరోలినా,టెన్నెస్సీ,టెక్సాస్‌,వర్జీనియా రాష్ట్రాలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. రోడ్డుమార్గంలో అత్యవసరంగా చమురు రవాణా చేయడానికి ది డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ అనుమతులు ఇచ్చింది.  ఈ సైబర్‌ దాడి కారణంగా అమెరికాలో చమురు ధరలు దాదాపు 3శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.


ఈ సమస్యను మంగళవారం నాటికి పరిష్కరించకపోతే అట్లాంటా, టెన్నెస్సీలపై  దీని తొలి ప్రభావం పడుతుంది. ఆ తర్వాత మిగిలిన ప్రాంతాల్లో ఇబ్బందులు మొదలవుతాయి.

కలోనియల్‌ పైప్‌లైన్‌లోని ఒకరి అకౌంట్‌ లాగిన్‌ లేదా టీమ్‌వ్యూయర్‌ వంటి రిమోట్‌ డెస్క్‌టాప్‌ సాఫ్ట్‌వేర్‌ వివరాలను సంపాదించి దాడి చేసినట్లు భావిస్తున్నారు.

ఆ రాన్సామ్‌వేర్‌ ముఠాపైనే అనుమానాలు..

కరుడుగట్టిన సైబర్‌ నేరగాళ్ల ముఠా ‘ది డార్క్‌సైడ్‌’ ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. ఇది రష్యాకు చెందిన సంస్థగా అనుమానిస్తున్నారు. ఇదొక రాన్సమ్‌వేర్‌ ముఠా. అంటే సైబర్‌ దాడి చేసి డబ్బులు వసూలు చేసే గ్యాంగ్‌ అన్నమాట.  తాజా దాడిలో డార్క్‌సైడ్‌ ముఠా కలోనియల్‌ పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌కు చెందిన దాదాపు 100 గిగాబైట్ల డేటాను తన ఆధీనంలోకి తీసుకుంది. దీనిని గుర్తించిన కలోనియల్‌ సంస్థ మిగిలిన డేటా హ్యాకర్లు బారినపడకుండా ఆఫ్‌లైన్‌ చేసింది.

ఇక తమకు దక్కిన  డేటాను  విడుదల చేయడానికి హ్యాకర్లు శుక్రవారం నగదు డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్లు పూర్తి చేయకపోతే ఇంటర్నెట్‌లో ఆ డేటాను ఉంచుతామని బెదిరించారు. ఆదివారం మరికొన్ని చిన్నలైన్లు కూడా మూతపడ్డాయి. ప్రస్తుతం అతి చిన్న లైన్లు మాత్రమే చమురును సరఫరా చేస్తున్నాయి.

డేటా ఆధారాలు చూపి మరీ డిమాండ్‌..

క్రిమినల్‌ ఐటీ వ్యవస్థలో రాన్సమ్‌వేర్ అత్యంత ప్రమాదకరమైంది. ఇది దొంగిలించిన డేటాను ఆన్‌లైన్‌లో ఆటోమేటిక్‌గా పబ్లిష్‌ చేసేందుకు సిద్ధంగా ఉంచి.. ఆధారాలతో ఉన్న ఆ లింక్‌ను బాధితులకు పంపిస్తుంది. బాధితుడి సిస్టమ్‌లోని డేటాను ముందే తొలగించేస్తుంది. తమకు డబ్బు ఇవ్వకపోతే స్వాధీనం చేసుకొన్న డేటా లీక్‌ చేస్తామని చెబుతుంది. 
డార్క్‌సైడ్‌ ముఠా సైబర్‌ నేరాల్లో శిక్షణ కూడా ఇస్తుంటుంది. డేటాను ఎన్‌క్రిప్ట్‌ చేసి తస్కరించేందుకు వీలుగా ఓ సాఫ్ట్‌వేర్‌ను కూడా అభివృద్ధి చేస్తింది. దీంతో దాడులు ఎలా చేయాలి.. డబ్బు ఎలా గుంజాలో అన్న అంశంపై తమ అనుచర బృందాలకు శిక్షణ ఇస్తోంది. శిక్షణ పొందిన బృందాలు సైబర్‌ దాడులు చేసి వసూలు చేసిన సొమ్ములో కొంత డార్క్‌సైడ్‌కు చెల్లిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. మరింత చురుగ్గా దాడులు చేసే ఓ సాఫ్ట్‌వేర్‌ను డార్క్‌సైడ్‌ ముఠా మార్చిలో సిద్ధం చేసింది. దీనిని పరిశీలించడానికి రావాలని జర్నలిస్టులకు ఓ ప్రెస్‌నోట్‌ కూడా విడుదల చేయడం విశేషం.

సన్‌బరస్ట్‌ దెబ్బ మరువక ముందే..

2020 మార్చి-జూన్‌ మధ్యలో హ్యాకర్లు సోలార్‌ విండ్‌ అనే నెట్‌వర్కింగ్‌ సేవల సంస్థకు చెందిన ‘ఓరియన్‌’ సాఫ్ట్‌వేర్‌లోకి ‘సన్‌బరస్ట్‌’ అనే హానికారక వైరస్‌(మాల్‌వేర్‌)ను చొప్పించారు. అక్కడి నుంచి ఓరియన్‌ పంపిన సమాచారం స్వీకరించిన కంప్యూటర్లు హ్యాకర్ల అధీనంలోకి వెళ్లాయి. ఈ తరహా ప్రక్రియలను ‘సప్లై చైన్‌’ దాడులు అంటారు. డిసెంబర్‌ ఎనిమిదో తేదీన ‘ఫైర్‌ ఐ’ అనే సంస్థ తొలిసారి ఈ హ్యాకింగ్‌ను గుర్తించే వరకూ అగ్రరాజ్యానికి దీనిపై స్పృహ లేదు. తాజా దాడి బాధితుల జాబితాలో అమెరికా ఎనర్జీ, కామర్స్‌, ట్రెజరీ, స్టేట్‌ డిపార్ట్‌మెంట్లతో పాటు, ఫార్చ్యూన్‌ 500లోని కీలక సంస్థలతో సహా 18,000కు పైగా నెట్‌వర్క్‌లలోకి వైరస్‌ చొరబడింది.  కొన్ని నెలల పాటు కంప్యూటర్లు హ్యాకర్ల అధీనంలో ఉండటంతో  నష్టాన్ని అంచనా వేయడానికే చాలా సమయం పట్టింది. ఈ దాడి వెనక కూడా రష్యా హస్తం ఉందని అప్పట్లో అమెరికా నిఘావర్గాలు అనుమానించాయి.  ఎందుకంటే 2016లో ఉక్రెయిన్‌పై రష్యా విదేశీ నిఘా విభాగంలోని ‘కోజీబేర్‌’ లేదా ‘ఏపీటీ 29’గా పిలిచే బృందం ఇలాంటి దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని