Viral Video: ఏది గుడ్ టచ్‌..? చిన్నారులకు టీచరమ్మ జీవిత పాఠం: వీడియో వైరల్‌

Good touch vs Bad touch: విద్యార్థులకు పాఠాలు బోధించే ఓ పంతులమ్మ వారికి జీవిత పాఠం కూడా నేర్పించారు. గుడ్‌ టచ్‌, బ్యాడ్ టచ్‌ గురించి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పిన ఆ టీచర్‌ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

Updated : 04 Sep 2023 16:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక నేరాలు నానాటికీ పెరుగుతున్నాయి. చాలా సందర్భాల్లో తెలిసినవారి నుంచే పిల్లలు ఇలాంటి వేధింపులను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుత సమాజ పరిస్థితుల్లో పిల్లలకు శరీర అవయవాల గురించి అవగాహన కల్పించడం చాలా అవసరం. శరీరానికి సంబంధించి సొంతంగా కొన్ని నియమాలు ఉంటాయని పిల్లలకు తెలియాలి. వాటిని ఇతరులు అతిక్రమిస్తున్నప్పుడు స్పందించడమే కాదు, తక్షణం వ్యతిరేకించడమెలాగో నేర్పించాలి. సరిగ్గా ఇదే పనిచేశారు ఓ పంతులమ్మ. గుడ్‌ టచ్‌ - బ్యాడ్ టచ్‌ (good touch vs bad touch) గురించి చిన్నారులకు అర్థమయ్యే భాషలో చెప్పారు.

ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్‌ సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. అందులో ఆ స్కూల్‌ టీచర్‌ (Teacher).. ఏది మంచి టచ్‌, ఏది కాదో? (good touch vs bad touch) విద్యార్థులు స్వయంగా తెలుసుకునేలా నేర్పించారు. ఎదుటి వ్యక్తులు ఛాతిపై తడమటం, గట్టిగా కౌగిలించుకోవడం, శారీరకంగా/మానసికంగా హాని కలిగించేలా అసభ్యంగా తాకడం వంటివి చేసినప్పుడు పిల్లలు ఎలా ప్రతిఘటించాలో ఆమె పిల్లలతో చేసి చూపించారు. ఆప్యాయంగా తాకడం, దురుద్దేశపూరితంగా ముట్టుకోవడం మధ్య తేడాను వారికి అర్థమయ్యేలా చెప్పారు.

మా అమ్మాయి దిగాలుగా ఉంటుంది.. సమస్యేంటో చెప్పదు..!

ఇది ఏ స్కూల్‌లో.. ఎప్పుడు జరిగిందో తెలియదు గానీ.. రోషన్‌ రాయ్‌ అనే నెటిజన్‌ ఈ వీడియోను ఇటీవల ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ (Viral Video)గా మారింది. అద్భుతమైన రీతిలో విద్యార్థులకు జీవితపాఠం నేర్పిన ఆ టీచరమ్మపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో ఇలాంటి విద్యను నేర్పిస్తే లైంగిక వేధింపుల నుంచి భవిష్యత్‌తరాలను రక్షించినట్టు అని కొనియాడుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని