No confidence: మెజార్టీ లేకున్నా ‘అవిశ్వాసం’.. ఇప్పటివరకు ఎన్నిసార్లు..?

లోక్‌సభలో తమకు మెజార్టీ లేదని తెలిసినప్పటికీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేందుకు ‘ఇండియా’ కూటమి ప్రయత్నిస్తోంది.

Updated : 25 Jul 2023 19:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో (Parliament) మణిపుర్‌ అంశాన్నే ప్రధానంగా లేవనెత్తుతొన్న విపక్ష పార్టీలు.. దీనిపై సుదీర్ఘ చర్చకు పట్టుబడుతున్నాయి. ఈ అంశంపై హోంశాఖ మంత్రి ప్రకటన చేస్తారని ప్రభుత్వం చెబుతుండగా.. ఇందుకు విపక్షాలు ససేమిరా అంటున్నాయి. ప్రధాని మోదీ దీనిపై మాట్లాడాలని డిమాండు చేస్తున్న ప్రతిపక్షాలు.. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో చివరి ఆయుధంగా ‘అవిశ్వాసం’ (No Confidence motion) ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నాయి. లోక్‌సభలో తమకు మెజార్టీ లేదని తెలిసినప్పటికీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేందుకు ‘ఇండియా’ కూటమి ఎందుకు ప్రయత్నిస్తోంది..? ఇప్పటివరకు ఎంత మంది ప్రధాన మంత్రులు దీన్ని ఎదుర్కొన్నారు..? వంటి విషయాలను ఓ పరిశీలిస్తే..

ఎందుకీ అవిశ్వాసం..?

ప్రభుత్వాన్ని నియంత్రించే శక్తిమంత రాజ్యాంగ పద్ధతుల్లో అవిశ్వాస తీర్మానం (No Confidence motion) ఒకటి. ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయిన సమయంలో విపక్షాలు ఈ ఆయుధాన్ని తీస్తుంటాయి. దీని ద్వారా సభా అభిప్రాయాలను పరీక్షించే అవకాశం లభిస్తుంది. కొన్ని సమయాల్లో ఏకంగా ప్రభుత్వం దిగిపోయిన సందర్భాలూ ఉన్నాయి. మొత్తం మంత్రిమండలిపై ప్రవేశపెట్టే ఈ తీర్మానానికి కనీసం 50 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇందుకు అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే విషయాన్ని నిర్ణయించే అధికారం స్పీకర్‌కు ఉంటుంది. స్పీకర్ అనుమతినిస్తే, అనుమతించిన పది రోజుల్లోగా స్పీకర్ నిర్ణయించిన తేదీల్లో చర్చ (Discussion), దాని తరువాత ఓటింగ్ (Voting) జరుగుతాయి. ఓటింగ్‌లో ప్రభుత్వం ఓడిపోతే వెంటనే మంత్రిమండలి రాజీనామా చేస్తుంది.

విపక్షాలకు మెజార్టీ లేదని తెలిసినా..!

లోక్‌సభలో మొత్తం సభ్యుల సంఖ్య 543. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ 272. కానీ అధికార ఎన్డీయేకి 300లకుపైగా సభ్యుల మద్దతు ఉంది. దీంతో విపక్ష పార్టీలు అవిశ్వాసం ప్రవేశపెట్టినా అది వీగిపోతుందనే విషయం వారికి స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ ‘ఇండియా’ కూటమి ఇందుకు పావులు కదుపుతోంది. ఎందుకంటే, అవిశ్వాసాన్ని స్పీకర్‌ అనుమతిస్తే సభలో చర్చ, ఓటింగ్‌ జరుగుతుంది. దీంతో అనేక అంశాలపై ప్రభుత్వంపై విరుచుకుపడే అవకాశం దక్కుతుందని వారి ఆలోచన. అందుకే చివరి ప్రయత్నంగా దీన్ని ప్రయోగించేందుకు ‘ఇండియా’ కూటమి సిద్ధమవుతోందని తెలుస్తోంది. చివరిసారిగా 2018లో మోదీ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాసం ప్రవేశపెట్టగా.. అందులో ఎన్డీఏకు 325 ఓట్లు, విపక్షాల తీర్మానానికి 126 సభ్యుల మద్దతు లభించింది.

గతంలో అవిశ్వాస తీర్మానాల క్రమాన్ని చూస్తే..

  • స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు లోక్‌సభలో 27సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు.
  • 1963లో జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు మొదటిసారిగా అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. 1962లో చైనా యుద్ధంలో ఓటమి తర్వాత కాంగ్రెస్‌ నేత జె.బి.కృపలానీ దీన్ని ప్రవేశపెట్టినప్పటికీ అది వీగిపోయింది.
  • ఎక్కువసార్లు ఈ తీర్మానాన్ని ఎదుర్కొన్న ప్రధానిగా ఇంధిరాగాంధీ నిలిచారు. ఆమె ప్రభుత్వం 15సార్లు అవిశ్వాసం ఎదుర్కొన్నప్పటికీ అన్నింటిలోనూ బయటపడ్డారు. అందులో నాలుగుసార్లు పశ్చిమబెంగాల్‌కు చెందిన జ్యోతిర్మయి బసు ప్రవేశపెట్టడం గమనార్హం.
  • పి.వి.నరసింహారావు, లాల్‌ బహదూర్‌ శాస్త్రి మూడుసార్లు, మోరార్జీ దేశాయ్‌ రెండుసార్లు, జవహర్‌లాల్‌ నెహ్రూ, రాజీవ్‌ గాంధీ, అటల్‌ బిహారీ వాజ్‌పేయీ, నరేంద్ర మోదీ ఒక్కోసారి దీన్ని ఎదుర్కొన్నారు.
  • 2003లో వాజ్‌పేయీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ తీర్మానం ప్రవేశపెట్టారు.
  • అవిశ్వాసం సందర్భంగా సుదీర్ఘకాలం చర్చ లాల్‌ బహదూర్‌ శాస్త్రి హయాంలో జరిగింది. దాదాపు 24.34గంటల పాటు చర్చ జరిగింది.
  • అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన మొదటి ప్రధాని మొరార్జీదేశాయ్. 1979 జులై 16న జరిగిన తీర్మానంలో ఓటమి చెందడంతో ఆయన రాజీనామా చేశారు.
  • 1999లో అటల్‌ బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం కేవలం ఒక్క ఓటు తేడాతో నెగ్గింది. దీంతో వాజ్‌పేయీ ప్రభుత్వం అధికారానికి దూరమైంది.
  • 2018లో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విఫలమైంది. ఎన్డీఏకు 325 ఓట్లు రాగా, విపక్షాలకు 126 రావడంతో అది వీగిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని