మా హయాంలోనే మహిళల అభ్యున్నతి: నితీశ్‌

బిహార్‌లో ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ సీఎం నితీశ్‌కుమార్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నబినగర, ఔరంగాబాద్‌ తదితర జిల్లాల్లో శనివారం ఆయన ప్రచార ర్యాలీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బిహార్‌లో ఎన్డీయే పాలనకు ముందు, తర్వాత పరిస్థితులను ప్రజలకు వివరించారు. 

Published : 18 Oct 2020 02:49 IST

పట్నా: బిహార్‌లో ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ సీఎం నితీశ్‌కుమార్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నబీనగర, ఔరంగాబాద్‌ తదితర జిల్లాల్లో శనివారం ఆయన ప్రచార ర్యాలీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బిహార్‌లో ఎన్డీయే పాలనకు ముందు, తర్వాత పరిస్థితులను ప్రజలకు వివరించారు. ఆర్జేడీ ప్రస్తుత సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్లను ఉద్దేశిస్తూ పరోక్షంగా విమర్శల జల్లు కురిపించారు. ‘రాజకీయాల్లో ఓనమాలు రాని వాళ్లు కూడా ప్రజల్లో పేరు పొందటం కోసం ఈరోజు మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ల ప్రచారం వాళ్లని చేసుకోనివ్వండి. ఎందుకంటే మేం చేసిన అభివృద్దిని నమ్ముకున్నాం. వారిలా ప్రసంగాలకే పరిమితం కాలేదు. గతంలో వారు 15ఏళ్లు అధికారంలో ఉండి కూడా మహిళల అభివృద్దిపై కనీసం శ్రద్ధ పెట్టలేదు’ అని విమర్శించారు. 

ఎన్డీయే పాలనలో మహిళల అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. ‘మహిళల విద్యకు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నాం. బాలికలకు సైకిల్‌ యోజన, పంచాయతీలో 50శాతం రిజర్వేషన్లు వంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాం. పోలీసు ఉద్యోగాల్లో 35శాతం మహిళలకే కేటాయించాం. ఈ స్థాయిలో ఏ రాష్ట్రం మహిళలకు ఉద్యోగాలు కేటాయించలేదు. జీవిక పథకం ద్వారా మహిళలకు ఆర్థిక సాయం అందిస్తున్నాం. మళ్లీ అధికారంలోకి వస్తే పాఠశాల విద్య పూర్తి చేసిన బాలికలకు ఏటా రూ.10వేలు, కళాశాల విద్య పూర్తి చేసిన వారికి రూ.25వేల నుంచి రూ.50వేల ఆర్థిక సాయం అందిస్తాం’ అని హామీ ఇచ్చారు. 

బిహార్‌లో తమ ప్రభుత్వ హయాంలో నేరాలు గణనీయంగా తగ్గినట్లు తెలిపారు. జాతీయ నేర గణాంకాల జాబితాలో బిహార్‌ 23వ స్థానంలో ఉన్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సైతం బిహార్‌ అభివృద్దిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందన్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని పేద వారిని ఆదుకునేందుకు ప్రధాని మోదీ ఆహారధాన్యాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా రైతులకు సాయంగా రూ.6వేలు అందిస్తున్నట్లు నితీశ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని