CES 2021: కరోనా స్పెషల్‌గా ఇవీ

సీఈఎస్‌ 2021లో వచ్చిన అదిరిపోయే స్మార్ట్‌ (కరోనా) ప్రోడెక్ట్స్‌ ఏంటో చూద్దాం!

Published : 15 Jan 2021 18:40 IST

కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్‌ షో (సీఈఎస్‌)...  ఏటా జరిగే ఈ టెక్‌ ఈవెంట్‌లో రకరకాల టెక్నాలజీలను, సాంకేతిక ఉత్పత్తులను పరిచయం చేస్తుంటారు. భారీ ఎత్తున జరగాల్సిన ఈ కార్యక్రమం ఈసారి కరోనా కారణంగా వర్చువల్‌ పద్ధతిలో జరిగింది. అయితేనేం ఎప్పటిలాగే అదిరిపోయే ప్రోడక్ట్‌లను తీసుకొచ్చింది. అందులో కరోనా స్పెషల్స్‌ కూడా ఉన్నాయి. అవేనండీ.. మాస్క్‌లు, సెన్సార్లు, డిస్‌ఇన్ఫెక్ట్‌ ప్రోడక్ట్‌లు లాంటివన్నమాట. అలా సీఈఎస్‌ 2021లో వచ్చిన ఆసక్తికర స్మార్ట్‌ ప్రోడక్ట్స్‌ ఏంటో చూద్దాం!

కరోనా చాలామంది జీవితాల్ని తలకిందులు చేసేసింది. ఇప్పుడిప్పుడే దాంతో సహజీవనం అలవాటు చేసుకుంటున్నారు. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. దీని కోసమే మాస్క్‌లు, డిస్‌ఇన్ఫెక్టెంట్స్‌, ఎయిర్‌ ప్యూరిఫయర్స్‌ లాంటివి వాడటం మొదలుపెట్టాం. ఇంకా చెప్పాలంటే ఆ ఉత్పత్తులు మనుషుల జీవితంలో భాగమైపోయాయి. సీఈఎస్‌లో వీటి కోసం సరికొత్త ప్రోడక్ట్‌లు వచ్చాయి. 


మాస్క్‌లో ఫోన్‌... పెట్టి

బినాటోన్‌ అనే కంపెనీ ‘మాస్క్ ‌ఫోన్’‌ పేరుతో కొత్త తరహా మాస్క్‌ని రూపొందించింది. ఈ మాస్క్‌లో ఎన్‌ 95 ఫిల్టర్‌తో పాటు వైర్‌లెస్‌ హెడ్‌సెట్, మైక్రోఫోన్‌ ఇస్తున్నారు. ఈ మాస్క్‌ని ధరించి ఫోన్ మాట్లాడుకోవడం, సంగీతం వినడం లాంటివి చెయ్యొచ్చు. ఈ మాస్క్‌ను క్లాత్‌తో తయారు చేశారు. మాస్క్‌ బయట హెడ్‌సెట్‌ సౌండ్‌ కంట్రోల్స్‌, మైక్రోఫోన్‌ని అమర్చారు. ఇందులో హెడ్‌సెట్‌ నీటిలో తడిచినా పాడవకుండా పని చేస్తుంది. ఎన్‌ 95 ఫిల్టర్‌, హెడ్‌ సెట్‌ని తొలగించి అవసరమైనప్పుడు మాస్క్‌ని శుభ్రం చేసుకోవచ్చు. దీనిని ఒక్కసారి ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే 12 గంటల పాటు పనిచేస్తుంది. మాస్క్‌ ప్రారంభ ధర మన కరెన్సీలో సుమారు ₹ 3,600.


ఫిల్టర్‌ మార్చాల్సినప్పుడు...  

మాస్క్‌ అయితే పెట్టుకున్నారు... అది అవసరమైన మేర మీకు స్వచ్ఛమైన గాలినిస్తుందా? ఏమో అనుమానంగా ఉందా.. అయితే ‘ఎయిర్‌పాప్‌ యాక్టివ్ ‌ప్లస్‌’ మాస్క్‌ మీకు పనికొస్తుంది. బయట గాలి నాణ్యతను గమనించి, మాస్క్‌ ఫిల్టర్‌ ఎప్పుడు మార్చాలో చెప్పేయడం ‘ఎయిర్‌ పాప్‌ యాక్టివ్‌ ప్లస్‌’ ప్రత్యేకత. ఇది మీ ఊపిరిని, బయట గాలి నాణ్యతను బేరీజు వేసుకొని గాలి నాణ్యతను తెలియజేస్తుంది. ఈ మాస్క్‌ ధర సుమారు 150 డాలర్లు. 


యూవీ లైట్‌.. ట్రాన్స్‌పరెంట్‌ 

అమేజ్‌ ఫిట్‌ నుంచి ఓ అల్ట్రావైలెట్‌ లైట్‌ ఫీచర్‌ ఉన్న మాస్క్‌ను కూడా షోలో ప్రదర్శించారు. ఈ మాస్క్‌లో ఉండే యూవీ లైట్స్‌... మాస్క్‌ను పది నిమిషాల్లోనే డిస్‌ఇన్‌ఫెక్ట్‌ చేస్తాయి. దీంతోపాటు ‘రేజర్‌’ అనే సంస్థ కూడా ఓ పారదర్శకమైన ఓ మాస్క్‌ను పరిచయం చేసింది. ఇందులో బిల్ట్‌ ఇన్‌ మైక్రోఫోన్‌, లైట్స్‌, స్పీకర్‌ ఉంటాయి. దీనిని ధరించి మాట్లాడితే అవతలి వ్యక్తి సులభంగా తెలుస్తుంది. మాస్క్‌ ట్రాన్స్‌పరెంట్‌ కాబట్టి... మాట్లాడేటప్పుడు మీ ముఖం పూర్తిగా కనిపిస్తుంది.


ఎల్‌జీ ప్యూరిఫయర్‌ వస్తోంది...

ఎయిర్‌ ప్యూరిఫయర్‌ల తరహాలో ‘ప్యూరి కేర్‌ మాస్క్’‌ పేరుతో ఎల్‌జీ కొత్త తరహా‌‌ మాస్క్‌లను సిద్ధం చేస్తోంది. బిల్ట్‌ ఇన్‌ హెపా (HEPA) సాంకేతికతతో ఈ మాస్క్‌లను సిద్ధమవుతున్నాయి. వీటిలో గాలి ప్రసరణ బాగుండటానికి ఫ్యాన్స్, సెన్సార్స్‌ లాంటివి ఉంటాయి. బ్యాటరీతో పని చేసే ఈ మాస్క్‌ ఫుల్‌ ఛార్జీతో ఎనిమిది గంటలపాటు పని చేస్తుంది. మాస్క్‌ ఛార్జ్‌ అవ్వడానికి కనీసం రెండు గంటలు పడుతుంది. దీంతోపాటు యూవీ లైట్స్‌ ఉండే కేస్‌ ఇస్తున్నారు. దాంతో మాస్క్‌ను సులభంగా డిస్‌ ఇన్ఫెక్ట్‌ చేయొచ్చు.


జేబులో పట్టే ప్యూరిఫయర్‌

కరోనా సమయంలో మనం ఎంత క్లీన్‌గా ఉన్నామో... మన చుట్టూ ఉండే గాలి కూడా అంతే శుభ్రంగా ఉండాలి. దీని కోసం లఫ్ట్‌ డ్యుయో అనే సంస్థ చిన్నసైజు ఎయిర్‌ ప్యూరిఫయర్‌ వస్తోంది. జేబులో పట్టేసేంత చిన్నగా ఉండే ఈ ప్యూరిఫయర్‌లో హెపా ఫిల్టర్‌, యూవీ లైట్‌ ఉంటాయి. ఇవి మీ చుట్టూ ఉన్న గాలిని శుభ్రపరుస్తాయి. క్లీన్‌ ఎయిర్‌ జోన్‌ నుంచి కూడా ఓ కొత్త ఫిల్టర్‌ వచ్చింది. ఇది ప్రకృతిలోని సహజసిద్ధ బయోటిక్స్‌, ఎంజైమ్స్‌ను వినియోగించుకుని స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. 


వైరస్‌ వ్యాప్తి తెలిపేలా...

గాలిలోని కార్బన్‌ డయాక్సైడ్‌ ప్రమాణాన్ని ట్రాక్‌ చేసేలా ఎయిర్‌ థింగ్స్‌కు చెందిన వేవ్‌ ప్లస్‌ ప్యూరిఫయర్‌ పని చేస్తుంది. ఉష్ణోగ్రత, తేమ లాంటి వాటిని కూడా ఈ ప్యూరిఫయర్‌ ట్రాక్‌ చేయగలుగుతుంది. వాటి ద్వారా మీరున్న ప్రదేశంలో వైరస్‌ వ్యాప్తి ఎంతవరకు వ్యాప్తి చెందుతుందనే వివరాలు తెలియజేస్తుంది. ఇంటి అవసరాల కోసం వేవ్‌ మినీ, ఆఫీసు అవసరాల కోసం వేవ్‌ ప్లస్‌ రెండు వేరియంట్లు సిద్ధం చేస్తోంది ఎయిర్‌ థింగ్స్‌.


నీళ్లను కూడా కడిగేస్తాయ్‌

అల్ట్రావైలెట్‌ లైట్స్‌తో అన్నింటినీ డిస్‌ ఇన్ఫెక్ట్‌ చేస్తున్నారు సరే... మరి తాగే నీటి సంగతేంటి. అందుకే ఎల్‌జీ నీటిని యూవీతో డిస్‌ ఇన్ఫెక్ట్‌ చేసే ఫ్రిజ్‌ను సీఈఎస్‌లో ప్రదర్శించింది. అంతేకాదు ఈ ఫ్రిజ్‌ల్లో మైక్రోఫోన్‌, స్పీకర్‌ను కూడా సెట్‌ చేశారు. మాటలతోనే ఫ్రిజ్‌ను పని చేయించొచ్చు. ‘డోర్‌ ఓపెన్‌ చేయ్‌’ అనగానే ఫ్రిజ్‌ ఓపెన్‌ అయిపోతుంది. నీళ్లు తాగడానికి తీసుకునేటప్పుడు అవి యూవీ లైట్‌తో శానిటైజ్‌ అయి వస్తాయి. ఈ ఫ్రిజ్‌ ధర సుమారు నాలుగు వేల డాలర్లు ఉండొచ్చట. 

పై వస్తువుల్ని సీఈఎస్‌లో కేవలం ప్రదర్శించారు. ఇవి పూర్తిస్థాయిలో సిద్ధమై మార్కెట్‌లోకి రావడానికి ఇంకాస్త సమయం పట్టొచ్చు. అప్పుడు మరిన్ని వివరాలు బయటికొస్తాయి.

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని