Updated : 10/05/2021 14:07 IST

ఊపిరితిత్తులపై అవగాహన లేకే ఉక్కిరిబిక్కిరి

మూడు నెలలు జాగ్రత్తగా ఉండాల్సిందే  
హ్యాపీ హైపోక్సియాతో అధిక నష్టం

‘‘ఈనాడు- ఈటీవీ తెలంగాణ’’ ఫోన్‌ఇన్‌లో ప్రముఖ పల్మనాలజిస్టు డా.రాజేంద్రప్రసాద్‌

ఈనాడు డిజిటల్‌ నిజామాబాద్‌, నిజామాబాద్‌ వైద్య విభాగం: కొవిడ్‌ బారిన పడ్డ చాలా మందిలో ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.. అది గమనించక ప్రాణం మీదికి తెచ్చుకొంటున్నారని ప్రముఖ పల్మనాలజిస్టు డా.రాజేంద్రప్రసాద్‌ అన్నారు. ఊపిరితిత్తులు దెబ్బతిన్నా..? పైకి ఆరోగ్యంగానే కనిపిస్తారు.. ఈ స్థితిని హ్యాపీ హైపోక్సియా అంటారు... వైరస్‌ సోకి తీవ్రమైన దగ్గు, ఇతర లక్షణాలు ఉంటే ఎప్పటికప్పుడు ఆక్సిజన్‌ శాతం గమనిస్తూ ఉంటే ప్రమాదం నుంచి బయట పడొచ్చన్నారు. కొవిడ్‌ బాధితుల్లో ఊపిరితిత్తులపై వైరస్‌ ప్రభావం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. వాటి సామర్థ్యం పెంచుకొనేందుకు చేపట్టాల్సిన ప్రక్రియలపై  ‘‘ఈనాడు- ఈటీవీ తెలంగాణ’’ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఫోన్‌ఇన్‌లో ఆయన వివరించారు. ఉమ్మడి జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఫోన్‌చేసి సందేహాలు నివృత్తి చేసుకొన్నారు.

బ్లాక్‌ ఫంగస్‌ ముందు నుంచి ఉన్నదే
బ్లాక్‌ ఫంగస్‌ అనేది కొత్తది కాదు. ముందు నుంచి ఉంది. దీన్నే మ్యూకర్‌ మైకోస్‌ అంటారు. ఇది చాలా అరుదుగా వస్తుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారితో పాటు దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి సోకుతుంది. ఈ ఫంగస్‌ వచ్చిన వారిలో మరణశాతం ఎక్కువగా ఉంది. బాధితులకు స్టెరాయిడ్‌ అధిక డోసు వాడాల్సి వస్తోంది. ఈ కారణంగా రెండో దశలో బ్లాక్‌ ఫంగస్‌ సోకుతుంది.
గత నెల 19న పాజిటివ్‌ వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నాక 27న ఇంటికి వచ్చాను. రెండు మూడు రోజులకోసారి రాత్రిళ్లు విపరీతమైన దగ్గు వస్తోంది? - సాగర్, కామారెడ్డి
కొవిడ్‌ సోకిన తర్వాత ఊపిరితిత్తుల్లో ఏర్పడే ఇన్ఫెక్షన్‌ వల్ల ఇలా జరుగుతుంది. కోలుకున్న తర్వాత కొందరిలో ఇతర ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. మీరు వెంటనే వైద్యుడ్ని సంప్రదించి రక్తపరీక్షలు, ఎక్స్‌రే చేయించుకోవాలి. కారణమేంటో గుర్తించి మందులు వాడితే సరిపోతుంది.

ఆస్తమా ఉంటే టీకా తీసుకోవచ్చా? స్టెరాయిడ్‌ ఇన్హేలర్‌ వల్ల ఊపిరితిత్తులకు రక్షణ ఉంటుందా? -సాయిరెడ్డి, లింబాద్రి-నిజామాబాద్‌
• ఆస్తమాతో పాటు ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్న ఎవరైనా టీకా తీసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఆస్తమా ఉన్న వారు వాడే స్టెరాయిడ్‌ ఇన్హేలర్‌తో ఊపిరితిత్తులకు కొంత రక్షణ ఉంటుంది. అలాగని కరోనా రాదని, ఊపిరితిత్తులకు సోకదని కాదు. అయినా తప్పకుండా వ్యాక్సిన్‌ తీసుకొని పూర్తి రక్షణ పొందాలి.

గత నెల 23న నా భార్య కరోనా బారిన పడింది. ఈ నెల 4న నెగెటివ్‌ వచ్చింది. చల్లగాలి తగిలినా, స్నానం చేసినా, తడి తగిలినా విపరీతమైన దగ్గు వస్తోంది. నీరసపడిపోతోంది?- నర్సయ్య, నిజామాబాద్‌
• రోగనిరోధకశక్తి ఆధారంగా వైరస్‌ ప్రభావం శరీరంలో కొన్ని రోజుల పాటు ఉంటుంది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ ఏర్పడి తగ్గిన తర్వాత కొన్నిసార్లు ఇలాంటివి వస్తుంటాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు కాబట్టి శారీరక పనులు తగ్గించి విశ్రాంతి తీసుకుంటే అంతా సర్దుకుంటుంది. ఎక్కువ రోజులు ఉంటే ఒకసారి వైద్యుణ్ని కలవండి. ఊపిరితిత్తుల పనితీరు పరిశీలించి తగిన మందులు వాడాల్సి ఉంటుంది.

 కరోనా వచ్చిన వారిలో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ ఉందని ఎలా తెలుసుకోవాలి? - తులసీరాం, నవీపేట
• వైరస్‌ సోకిన వారిలో శ్వాసనాళం ద్వారా గాలి  ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా అడ్డుపడుతుంది. ఎవరైనా విపరీతమైన దగ్గు, జలుబు, నడుము నొప్పి, జ్వరంతో బాధపడుతుంటే వైరస్‌ ఊపిరితిత్తులకు చేరిందని గుర్తించాలి. చాలా మందిలో వైరస్‌ వల్ల ఇవి దెబ్బతిన్నా బయటకు తెలియడం లేదు. తెలిసేసరికి ప్రమాదకర స్థాయిలో ఉంటోంది. పల్స్‌ ఆక్సీమీటర్‌తో ఆక్సిజన్‌ శాతం చూసుకోవాలి. తగ్గితే ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవడం ఉత్తమం.

ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. నిత్యం బయట తిరగాల్సి వస్తోంది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో రక్షణ పొందేందుకు, రోగనిరోధకశక్తి పెంచుకునేందుకు ఏం చేయాలి? - శంకర్, బోధన్‌
• జన సమూహంలోకి వెళ్లినప్పుడు భౌతిక దూరం పాటించాలి. మాస్కు ధరించడంతో పాటు శానిటైజర్‌ ఉంచుకోవాలి. బయటి నుంచి వచ్చాక దుస్తులు ప్రత్యేకంగా ఉతకాలి. స్నానం చేసిన తర్వాతే ఇంట్లోకి వెళ్లాలి. తాజా పండ్లు, ఎండు ఫలాలు తీసుకోవాలి. 

ఎలాంటి లక్షణాలు లేకున్నా కరోనా పరీక్ష తర్వాతే టీకా వేయించుకోవాలా? లేదా టీకా తీసుకున్నాక కరోనా పరీక్ష చేయించుకోవాలా? - రాజేందర్, నిజామాబాద్‌
• లక్షణాలు ఉంటేనే కరోనా పరీక్ష అవసరం. ఇతర అనారోగ్య సమస్యలు ఏవీ లేకుంటే నేరుగా టీకా తీసుకోవచ్చు. టీకా తీసుకున్న తర్వాత రెండు వారాల పాటు మద్యానికి దూరంగా ఉండాలి. లేదంటే టీకా పనితీరుపై ప్రభావం ఉంటుంది.

లోనికి వైరస్‌ వెళ్తే

శ్వాసనాళం ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన వైరస్‌ మనం పీల్చే గాలి రక్తంలోకి వెళ్లే చోట అడ్డుపడుతుంది. దీంతో అవి దెబ్బతినడం, ఆక్సిజన్‌ వెళ్లక శ్వాస ఆడకపోవడం, రక్తం గడ్డ కట్టడం జరుగుతుంది. సాధారణానికి భిన్నంగా కరోనా వైరస్‌ ఊపిరితిత్తుల్లో చివర్ల నుంచి ప్రభావం చూపిస్తూ మధ్యలోకి వస్తుంది. అందుకే అవి దెబ్బతిన్న విషయం తెలియడం లేదు. ఈ సమయంలో 70-80 శాతం వరకు నష్టం వాటిల్లుతుంది. ముందుగా గుర్తిస్తే ప్రమాద తీవ్రత తగ్గుతుంది. అన్ని వయసుల వారిలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. 

నెల క్రితం కరోనా బారిన పడి కోలుకున్నా. చికిత్స సమయంలో ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నాయని వైద్యుడు చెప్పాడు. దీనివల్ల ఏమైనా ఇబ్బంది తలెత్తుతుందా?- గంగాధర్, మాక్లూర్‌
• కరోనా నుంచి కోలుకున్నారు కాబట్టి ధైర్యంగా ఉండండి. కరోనా సోకిన ప్రతి ఒక్కరిలో ఊపిరితిత్తులపై ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. వాటి పనితీరు ఎలా ఉందో పరీక్షించుకోండి. 

నా భార్య, కూతురు కరోనా నుంచి కోలుకున్నారు. నీరసం, ఆయాసంగా ఉందంటున్నారు. ఏం చేయాలి? - వెంకటేష్, వినాయక్‌ నగర్‌
• కరోనా నుంచి కోలుకున్నప్పటికీ నీరసం, ఆయాసం తగ్గలేదంటే ఊపిరితిత్తులపై వైరస్‌ ప్రభావం చూపి ఉంటుంది. వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి రక్తపరీక్షలు, ఎక్స్‌రే చేయిస్తే ఊపిరితిత్తుల పరిస్థితి తెలుసుకోవచ్చు. తద్వారా అవసరమైన చికిత్స అందుతుంది. 

మూడు రోజుల క్రితం అమ్మకు కరోనా సోకింది. సీటీ స్కాన్‌ తీయిస్తే ఫలితం 15/25 అని వచ్చింది. అయినా ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. ఏం చేయమంటారు? - విశ్వనాథ్, ఆర్మూర్‌
• మీరు చెప్పిన రిపోర్టు ప్రకారం ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. నిత్యం పల్స్‌ ఆక్సీమీటర్‌తో ఆక్సిజన్‌ శాతం పరీక్షిస్తూ ఉండాలి. కూర్చున్నప్పుడు ఒకసారి, ఆరు నిమిషాల నడక తర్వాత మరోసారి ఆక్సిజన్‌ శాతం లెక్కించాలి. 94 కంటే తక్కువ ఉంటే వెంటనే ఆసుపత్రిలో చేర్చాలి. కొందరిలో ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నా పైకి ఆరోగ్యంగానే కనిపిస్తారు. దీన్నే హ్యాపీ హైపోక్సియా అంటారు. అలాగే వదిలేస్తే చాలా ప్రమాదం.

గత వారం కరోనా వచ్చింది. ఎంతకీ తెమడ తగ్గడం లేదు. ఏం చేయాలి?  - అనిల్‌-భీమ్‌గల్, శ్రీనివాస్‌-దోమకొండ
• ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ వల్ల తెమడ బయటకు రాలేని పరిస్థితుల్లో ఇలా జరుగుతుంది. నెబులైజర్‌ వాడితే మేలు జరుగుతుంది. అంతగా భయపడాల్సిన అవసరం లేదు. అప్పటికీ తగ్గకుంటే వైద్యుడ్ని సంప్రదించాలి. నిర్లక్ష్యం చేయడం వల్ల కొందరిలో ఇతర ఫంగస్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌ రావొచ్చు.

కరోనా పాజిటివ్‌ రావడంతో హోంక్వారంటైన్‌ లో ఉన్నాను. దమ్ము వస్తోంది. ఏం చేయాలి? - మహేష్‌ నిజామాబాద్‌
• కరోనా సోకిన వారిలో ఊపిరితిత్తులు దెబ్బతినడం వల్ల దమ్ము, దగ్గు వస్తాయి. ఆక్సిజన్‌తో చికిత్స అందించాలి. ఇలాంటి వారు కోలుకోవడానికి సమయం పడుతుంది. వాటి పనితీరు మెరుగుపర్చే శ్వాస వ్యాయామాలు చేయాలి.

కరోనా పాజిటివ్‌ వచ్చి తగ్గింది. అయినా రుచి తెలియడం లేదు. ఏమైనా మందులు వాడాలా? - రవీందర్‌-మోతె, అశోక్‌-ఆర్యనగర్, సుస్మిత-నిజామాబాద్‌
•  కరోనా బారిన పడిన తర్వాత కొద్ది రోజులకు సాధారణంగా రుచి, వాసన పోతుంది. వారం నుంచి మూడు వారాల వ్యవధిలో తిరిగి వస్తాయి. ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన పని లేదు.

ఇతర సమస్యలు తిరగబెడతాయి

కరోనా తర్వాత ఇతర అనారోగ్య సమస్యలు లేదంటే తగ్గిపోయిన ఇతర వ్యాధులు తిరగబెడుతున్నాయి. టీబీ తగ్గిన వారు కొవిడ్‌ బారిన పడితే వారిలో మళ్లీ టీబీ తిరగబెడుతోంది. పక్షవాతం, గుండెపోటు, ఫంగస్, బ్యాక్టీరియల్‌ వంటి ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. అందుకే కరోనా వచ్చి కోలుకున్న వారు మూడు నెలలపాటు అప్రమత్తంగా ఉండాలి. 

మా బావ కరోనా బారిన పడ్డారు. శ్వాస ఆడక ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ఊపిరితిత్తులు దెబ్బతినకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి:- గంగాధర్, నిజామాబాద్‌
• కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిలో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ వస్తోంది. బాగా దెబ్బతిని ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన వారు కచ్చితంగా మూడు నెలలు జాగ్రత్త వహించాలి. వాటి పనితీరు మెరుగుపర్చే వ్యాయామాలు చేయండి. ఇన్సెంటివ్‌ స్పైరో మీటర్‌తో వ్యాయామం చేస్తే ఫలితం ఉంటుంది.

కరోనా వచ్చింది. సీటీ స్కాన్‌లో 12/25 అని వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాను. తగ్గిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు అవసరం? - వెంకట లక్ష్మి, దోమకొండ
• అధిక శాతం ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. చికిత్స పొందుతున్నారు కాబట్టి ధైర్యంగా ఉండండి. ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఐసోలేషన్‌లో ఉండాలి. లేదంటే మళ్లీ ఇన్ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉంది. కుటుంబ సభ్యులు బయటి నుంచి వచ్చినప్పుడు దగ్గరకు రాకుండా జాగ్రత్త వహించాలి. 

 మా సోదరుడికి రెండు రోజుల క్రితం పాజిటివ్‌ వచ్చింది. ఉదయం, సాయంత్రం చలి జ్వరం వస్తోంది. మందులు వాడుతున్నా తగ్గడం లేదు. ఏం చేయమంటారు?  - శ్రీనివాస్, బాన్సువాడ
• కొవిడ్‌ సోకినప్పటి నుంచి కొన్ని రోజుల పాటు వైరస్‌ ప్రభావం ఉంటుంది. మందులు వాడినా కొంత సమయం తీసుకుంటుంది. మరో రెండు రోజులు వాడి చూడండి. అప్పటికీ తగ్గకుంటే వైద్యుడ్ని సంప్రదించాలి. రక్తపరీక్షలు చేసి తదనుగుణంగా మందులు వాడితే తప్పక నయం అవుతుంది. 

మా అమ్మకు కరోనా వచ్చి కోలుకుంది. ఊపిరితిత్తులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? - ప్రవీణ్‌ కుమార్, నిజామాబాద్‌
• కరోనా వైరస్‌ నేరుగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తోంది. కరోనా సమయంలో, కోలుకున్న తర్వాతైనా మూడు నెలలు అప్రమత్తత అవసరం. ఊపిరితిత్తుల పనితీరుకు సంబంధించి రక్త పరీక్షలు చేయించుకోవాలి. ఇన్ఫెక్షన్‌ ఉంటే మందులు వాడాలి. వీటితో పాటు మంచి ఆహారం తీసుకుంటూ ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండాలి. ఏ మాత్రం తేడా అనిపించినా వైద్యుణ్ని సంప్రదించాలి.  

 

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని