
పబ్జీ పైత్యం.. తల్లి, ముగ్గురు తోబుట్టువులను కాల్చిచంపిన బాలుడు
లాహోర్: పబ్జీ ఆటకు బానిసైన పద్నాలుగేళ్ల బాలుడు తల్లిని, ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురు తోబుట్టువులను కాల్చి చంపాడు. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో గత వారం జరిగిన ఈ దుర్ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. లాహోర్‌లోని కహ్నా ప్రాంతానికి చెందిన నిందితుడు ఆన్లైనులో పబ్జీ ఆటకు బానిస కావడంతో మానసిక సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ వీడియోగేమ్ విపరీతంగా ఆడుతూ చదువుపై శ్రద్ధ చూపట్లేదని తల్లి నహీద్ ముబారక్ (45) ఇటీవల మందలించింది.
దీంతో బాలుడు అదేరోజు రాత్రి కప్‌బోర్డులో ఉన్న పిస్తోలు తీసుకొని తల్లిని, సోదరుడు తైముర్ (22) సహా 17.. 11 ఏళ్ల అక్కాచెల్లెళ్లను కాల్చి చంపాడు. మరుసటిరోజు ఉదయం ఇరుగు పొరుగు కుటుంబాలు పోలీసులకు సమాచారం అందించాయి. ఆ సమయంలో తాను మేడ మీద ఉన్నానని, తనకేమీ తెలియదంటూ బాలుడు బుకాయించాడు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. బాలుడు ఉపయోగించిన తుపాకీ.. భర్త నుంచి విడాకులు తీసుకొని ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్న తల్లి కుటుంబ రక్షణ కోసం కొంతకాలం క్రితం తీసుకున్నదని పోలీసులు వెల్లడించారు. కాగా, పబ్జీ ఆన్లైను ఆట కారణంగా ఇది లాహోర్‌లో జరిగిన నాలుగో నేరమని ‘డాన్’ పత్రిక కథనం పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.