Covid 19 Vaccine: గూగుల్‌తో టీకా స్లాట్.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే? 

గూగుల్‌ ద్వారా కూడా కొవిడ్‌ 19 వ్యాక్సిన్ స్లాట్ ఎలా బుక్‌ చేసుకునే సదుపాయం అందిస్తున్నట్లు  కేంద్ర ఆరోగ్య మంత్రి తెలిపారు. మరి గూగుల్‌ సెర్చ్ ద్వారా స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి? అందుకోసం గూగుల్‌లో ఏమని టైప్ చేయాలనేది చూద్దాం.

Published : 03 Sep 2021 21:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా మూడో దశ ముప్పు నుంచి భారతావనిని రక్షించేందుకు కేంద్రం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా టీకా పంపిణీని వేగవంతం చేయడంతోపాటు అందుకు సంబంధించిన సమాచారం ప్రజలు సులువుగా తెలుసుకునేందుకు వీలుగా పలు రకాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తదనుగుణంగా కొవిన్‌, ఆరోగ్యసేతు, ఉమాంగ్‌, వాట్సాప్‌తోపాటు గూగుల్‌లో కూడా టీకా స్లాట్‌ బుకింగ్ సదుపాయం కల్పిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. దేశవ్యాప్తంగా 13 వేలకు పైగా ప్రాంతాల్లో టీకా లభ్యత, అపాయింట్‌మెంట్ల  గురించిన వివరాలు గూగుల్ సెర్చ్‌, మ్యాప్‌, అసిస్టెంట్ ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించారు. అలానే ఆంగ్లంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, హిందీ, గుజరాతీ భాషల్లో గూగుల్ ఈ సమాచారాన్ని అందిస్తుంది. ఇంతకీ గూగుల్‌ మాధ్యమాల్లో టీకా కోసం ఎలా సెర్చ్‌ చేయాలి? టీకా స్లాట్ ఎలా బుక్ చేయాలనేది తెలుసుకుందాం. 

* గూగుల్ యాప్‌/బ్రౌజర్‌ ఓపెన్ చేసి అందులో ‘కొవిడ్ 19 వ్యాక్సిన్‌’ (covid 19 vaccine) లేదా ‘దగ్గర్లోని కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రం’ (covid vaccine near me) అని  సెర్చ్ చేయాలి. 

* తర్వాత మీకు సెర్చ్‌ రిజల్ట్‌లో మీకు దగ్గర్లోని కొవిడ్‌ టీకా అందించే ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులకు జాబితా చూపిస్తుంది. అందులో ఏయే ఆస్పత్రులో టీకా అందుబాటులో ఉంది అనే సమాచారం కూడా కనిపిస్తుంది.

* అలానే మొదటి డోస్‌ వేస్తారా? లేక రెండో డోస్‌ మాత్రమే వేస్తారా? అనే సమాచారం ఉంటుంది.

* తర్వాత మీకు దగ్గర్లోని ఆస్పత్రి పేరుపై క్లిక్ చేస్తే అడ్రస్‌తోపాటు గూగుల్ మ్యాప్‌లో దారి చూపిస్తూ.. ‘బుక్‌ అపాయింట్‌మెంట్’ (Book Appointment) అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే కొవిన్‌ వెబ్‌సైట్‌కి తీసుకెళుతుంది. 

* అక్కడ మీ మొబైల్ నంబర్‌ ఎంటర్ చేసి ఓటీపీ టైప్‌ చేయాలి. తర్వాత ఒక మొబైల్ నంబర్‌తో వ్యాక్సినేషన్‌ కోసం నలుగురిని రిజిస్టర్‌ చెయ్యొచ్చనే మెసేజ్‌ చూపిస్తుంది. దాన్ని ఓకే చేస్తే రిజిస్ట్రేషన్ పేజ్‌ ఓపెన్ అవుతుంది. 

* అందులో మీ ఫొటో ఐడీ ప్రూఫ్‌, ఫొటో ఐడీ నంబర్‌, పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేసి రిజిస్ట్రర్ చేస్తే మీ వ్యాక్సినేషన్ తేదీ చూపిస్తుంది. ఆ రోజు మీరు రిజిస్ట్రర్ చేసుకున్న వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి టీకా పొందొచ్చు. 

* గూగుల్ మ్యాప్స్‌లో కూడా ఇదే పద్ధతిలో కొవిడ్‌ 19 టీకా లభ్యత, స్లాట్ బుకింగ్‌కు సంబంధించిన సమాచారం ఉంటుంది. గూగుల్ వాయిస్‌ అసిస్టెంట్‌లో కూడా ఓకే గూగుల్ లేదా హేయ్‌ గూగుల్ అనే వాయిస్ కమాండ్ తర్వాత కొవిడ్ 19 వ్యాక్సిన్‌ అని చెప్తే టీకా అందించే ఆస్పత్రుల జాబితా చూపిస్తుంది. 

యూట్యూబ్‌

* ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్ 19 చికిత్స, లక్షణాలను గుర్తించడం, వైరస్‌ బారినపడకుండా పాటించాల్సిన జాగ్రత్తలు, వైరస్ సంక్రమణ వంటి అంశాలకు సంబంధించిన సమాచారం వేర్వేరు మాధ్యమాల్లో అందుబాటులో ఉంది. అయితే వీటిలో ఏ సమాచారం నిజమైంది.. ఆ మాధ్యమాల్లో సూచించిన విధంగా వాటిని పాటించాలా అనే దానిపై ఎన్నో సందేహాలు. అలానే కొన్నిసార్లు తప్పుడు సమాచారంతో యూజర్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

* దీంతో యూట్యూబ్‌ కొవిడ్‌ 19 గురించి కచ్చితమైన సమాచారం అందించే ఉద్దేశంతో ‘కొవిడ్‌ 19 భద్రత, సంరక్షణ’ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇందులో డాక్టర్లు, ఆరోగ్యరంగ నిపుణులు, సామాజిక కార్యకర్తలు అందించే సమాచారం ఉంటుంది.

* అలానే సామాన్య వ్యక్తుల సమాచారాన్ని కూడా క్రోడీకరించి అందులోని సమాచారం ప్రభుత్వ ఆరోగ్య సంస్థల సూచించిన విధంగా ఉంటేనే దాన్ని యూట్యూబ్‌లో యూజర్ చూడగలుగుతారు. ఇప్పటికే కొవిడ్‌ 19 గురించి తప్పుడు సమాచారం అందిస్తున్న మిలియన్‌ వీడియోలను తొలగించినట్లు యూట్యూబ్‌ తెలిపింది. 

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని