
నేను కరోనా బారినపడలేదు: ప్రభు
రూమర్స్‌పై స్పందించిన నటుడు
చెన్నై: సెలబ్రిటీలు ఎవరైనా ఉన్నట్టుండి కనిపించకపోతే.. వాళ్లు కొవిడ్-19 బారిన పడ్డారని.. అందుకే బయటకు రావడం లేదని ఇటీవల సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాను కరోనా బారినపడ్డానంటూ ఇటీవల నెట్టింట్లో వచ్చిన వార్తలపై నటుడు ప్రభు స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు.
తన తండ్రి నటుడు శివాజీ గణేషన్ జయంతిని పురస్కరించుకుని గురువారం (అక్టోబర్ 1) ఓ స్మారక కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పలువురు రాజకీయ ప్రముఖులు దీనికి హాజరయ్యారు. నటుడు ప్రభు మాత్రం కార్యక్రమంలో కనిపించలేదు. దీంతో ఆయన కరోనా బారిన పడ్డారని.. క్వారంటైన్‌లో ఉన్నారని.. అందుకే స్మారక కార్యక్రమంలో కనిపించలేదని పేర్కొంటూ నెట్టింట్లో పలు పోస్టులు దర్శనమిచ్చాయి. ఈ వార్తలపై ఆయన తాజాగా స్పందించారు. ‘నేను కొవిడ్-19 బారినపడలేదు. సోషల్‌మీడియాలో వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇటీవల నా కాలు బెణికింది. దాని కారణంగా నేను స్మారక కార్యక్రమానికి హాజరు కాలేకపోయాను. ఇప్పుడు నేను ఆర్యోగంగా ఉన్నాను’ అని పేర్కొన్నారు.
ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘డార్లింగ్’ చిత్రంలో ప్రభు నటించారు. ఈ సినిమాలో ఆయన ప్రభాస్ తండ్రి పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. అనంతరం ‘ఆరెంజ్’, ‘శక్తి’, ‘బెజవాడ’, ‘ఊ.. కొడతారా ఉలిక్కిపడతారా’ చిత్రాల్లో నటించించారు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలో ఆయన నటించనున్నారు.