బెంగాల్‌ సినీరంగం అనాథగా మారింది

బెంగాలీ నట దిగ్గజం సౌమిత్ర ఛటర్జీ యావత్తు భారతదేశాన్ని విషాదంలో ముంచెత్తింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయనను కాపాడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదని వైద్యులు..

Updated : 15 Nov 2020 19:12 IST

సౌమిత్ర ఛటర్జీకి ప్రముఖుల నివాళి

ఇంటర్నెట్‌ డెస్క్‌: బెంగాలి నట దిగ్గజం సౌమిత్ర ఛటర్జీ మరణవార్త యావత్తు భారతదేశాన్ని విషాదంలో ముంచెత్తింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయనను కాపాడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదని వైద్యులు తెలిపారు. ‘ఘరె బైరె’, ‘అరణ్యర్ దిన్ రాత్రి’, ‘చారులత’ చిత్రాలతో ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన మరణంపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌: భారతీయ సినీరంగం దిగ్గజాల్లో ఒకరిని కోల్పోయింది. సౌమిత్ర ఛటర్జీ ముఖ్యంగా ‘అపు’ ట్రైయాలజీ, సత్యజిత్‌రే‌తో కలిసి నటించిన సినిమాలతో అభిమానులకు చెప్పలేనంత వినోదాన్ని పంచారు. భారతీయ సినీరంగంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఆయన నటనకు గానూ ఎన్నో పురస్కారాలు వరించాయి. దాదా సాహెబ్‌ ఫాల్కే, పద్మభూషణ్‌వంటి పురస్కారాలను ఆయన సాధించారు. ఆయన కుటుంబానికి, సినీరంగానికి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు నా సంతాపం తెలియజేస్తున్నాను. 

ప్రధాని నరేంద్ర మోదీ: సౌమిత్ర ఛటర్జీ మరణం ఎంతో బాధ కలిగించింది. ప్రపంచ సినిమా రంగానికి ఆయన మరణం తీరని లోటు. బెంగాలీ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు వాళ్ల సున్నితత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పారాయన. ఆయన అభిమానులకు, కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి.
కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ: సౌమిత్ర ఛటర్జీ దేశం గర్వించే నటుడు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత అయిన ఛటర్జీ మరణవార్త వినడం విచారకరం.

పశ్చిమ్‌ బంగాల్‌ సీఎం మమతా బెనర్జీ: ఫెలుడా ’ఇక లేరు. ‘అపు’ వీడ్కోలు చెప్పారు. సౌమిత్రా ఛటర్జీకి వీడ్కోలు. ఆయన ఒక లెజెండ్. ప్రపంచ సినిమా రంగం ఓ దిగ్గజాన్ని కోల్పోయింది. బెంగాల్ సినీ ప్రపంచం అనాథగా మారింది. ఆయన కుటుంబానికి, అభిమానులకు సంతాపం తెలియజేస్తున్నాం.

భాజపా జాతీయాధ్యక్షుడు జెపీ నడ్డా: దిగ్గజ బెంగాలీ నటుడు సౌమిత్రా ఛటర్జీ మరణం తీవ్ర బాధను కలిగించింది. ఆయన తన సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో ఎన్నో ప్రశంసలు పొందాడు. ఆయన యువతరానికి స్ఫూర్తి. ఆయన కుటుంబానికి, అనుచరులకు నా సంతాపం. ఓం శాంతి.

కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌: సౌమిత్రా ఛటర్జీ చేసిన సినిమాలు మనతో ఎప్పటికీ బతికే ఉంటాయి. కోల్‌కతా తన అభిమాన కుమారుడిని కోల్పోయింది.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని