సోదరుడికి కరోనా.. ఎంతో భయపడ్డా: రామ్‌

2020 ఏడాది అందరిలాగే తనకి కూడా విభిన్నమైన అనుభూతులు సొంతం చేసిందని నటుడు రామ్‌ పోతినేని అన్నారు.  మరికొన్ని రోజుల్లో ఈ ఏడాదికి గుడ్‌బాయ్‌ చెప్పనున్న నేపథ్యంలో.. 2020లో తన జీవితం ఏవిధంగా గడిచిందనే విషయాన్ని...

Published : 19 Dec 2020 14:55 IST

హైదరాబాద్‌: 2020 ఏడాది అందరిలాగే తనకి కూడా విభిన్నమైన అనుభూతులు సొంతం చేసిందని నటుడు రామ్‌ పోతినేని అన్నారు.  మరికొన్ని రోజుల్లో ఈ ఏడాదికి గుడ్‌బై చెప్పనున్న నేపథ్యంలో.. 2020లో తన జీవితం ఏవిధంగా గడిచిందనే విషయాన్ని తాజాగా రామ్‌ వెల్లడించారు.

‘కరోనా కారణంగా ఈ ఏడాది నా జీవితంలో ఎన్నో సంఘటనలు చోటుచేసుకున్నాయి. అందులో కొన్ని మంచివి. మరికొన్ని చెడ్డవి. ఎప్పుడూ షూటింగ్స్‌తో బిజీగా ఉండే నేను లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉండడం వల్ల కుటుంబసభ్యులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చింది. అది నాకెంతో సంతోషంగా అనిపించింది. కొన్నినెలలపాటు ఇంట్లోనే కూర్చొవడం కొన్నిసార్లు నాకెంతో చిరాకుగా అనిపించింది. అలాగే ఈ ఏడాది నా జీవితం అనుకున్నంత సాఫీగా జరగలేదు. ఎందుకంటే, మా కుటుంబం కూడా కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంది. నా సోదరుడు, అమ్మ కొవిడ్‌-19 బారినపడ్డారు. ఆ విషయం నన్ను ఎంతగానో బాధపెట్టింది, భయపెట్టింది. నా సోదరుడిలో కరోనా లక్షణాలు కొంచెం ఎక్కువగానే కనిపించాయి. అతను ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. కరోనాకి ఇంకా వ్యాక్సిన్‌ రానందువల్ల కొత్త సంవత్సరం వచ్చినా సరే మనం జాగ్రత్తగానే ఉండాలి’ అని రామ్‌ అన్నారు.

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ లాంటి మాస్‌ విజయం తర్వాత రామ్‌ కథానాయకుడిగా నటించి యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘రెడ్’‌. ‘తడమ్‌’ రీమేక్‌గా వస్తోన్న ఈ చిత్రానికి కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రామ్‌ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ కథానాయికలుగా సందడి చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘రెడ్‌’ చిత్రంలోని పాటలు ప్రేక్షకుల్ని ఎంతో అలరిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇవీ చదవండి

పెళ్లి గురించి నేనే చెప్తా: అల్లు శిరీష్‌

బరువు తగ్గి షాక్‌ ఇచ్చిన స్టార్‌ హీరో కుమార్తె

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని