జైలుకెళ్లేందుకు ఎదురు చూస్తున్నా : కంగన

తనకు ఆదర్శప్రాయులైన మహనీయుల మాదిరిగానే.. తాను కూడా  జైలుకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్నానంటూ కంగన ప్రకటించింది.

Published : 23 Oct 2020 16:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు చేస్తున్నారంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై ముంబయి కోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ బాలీవుడ్‌ నటి, ఆమె సోదరి రంగోలీ చందేలాపై ముంబయిలో కేసు నమోదయ్యింది. మరో కేసులో బాంద్రా మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేటు ఆదేశాల మేరకు.. వీరు వచ్చే వారం విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తనకు ఆదర్శప్రాయులైన మహనీయుల మాదిరిగానే.. తాను కూడా  జైలుకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్నానంటూ కంగన ప్రకటించింది.

వీర సావర్కర్‌, నేతాజీ‌ వంటి వారు తనకు ఆదర్శమని.. వారిలా తాను కూడా జైలు జీవితాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని కంగన ట్వీట్‌ చేసింది. అంతేకాకుండా నటుడు ఆమిర్‌ ఖాన్‌ మౌనం వహించటం పట్ల ఆమె పరోక్షంగా అసహనం వ్యక్తం చేసింది. రాణి లక్ష్మీ బాయి కోటను కూలగొట్టినట్టే, తన ఇంటిని కూడా ధ్వంసం చేశారని.. వీర సావర్కర్‌ను కారాగారంలో ఉంచగా, తనను జైలుకు పంపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని కంగన ఆరోపించింది.  దేశంలో అసహనం పెరుగుతోందని ఆరోపిస్తున్న సభ్యులను ఇక్కడ ఎన్ని బాధలకు గురయ్యారో ఎవరైనా ప్రశ్నిస్తే బాగుంటుంది అంటూ.. ఆ పోస్టును ఆమిర్‌ ఖాన్‌కు ట్యాగ్‌ చేశారు. దేశంలో అసహనం పెరగడం పట్ల ఆమిర్‌ ఖాన్‌ గతంలో ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తమ బిడ్డ క్షేమం కోసం భారత్‌ విడిచి వెళ్లాలని తన భార్య ప్రతిపాదించినట్టు ఆయన చేసిన ప్రకటన అప్పట్లో సంచలనం సృష్టించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని