Abbas: స్టార్‌గా ఎదిగి.. ట్యాక్సీ డ్రైవర్‌గా మారి: ‘ప్రేమదేశం’ అబ్బాస్‌ అనుభవాలివీ

‘ప్రేమదేశం’తో తొలి ప్రయత్నంలోనే నటుడిగా క్రేజ్‌ దక్కించుకున్న అబ్బాస్‌.. తానెందుకు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్నారో తెలిపారు. న్యూజిలాండ్‌ నుంచి భారత్‌కు తిరిగొచ్చిన ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Published : 19 Jul 2023 02:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పుడు ఆయన స్టార్‌.. అమ్మాయిలకు డ్రీమ్‌ బాయ్‌.. సోలో హీరోగా నటిస్తూనే అగ్ర నటుల సినిమాల్లో కీలక పాత్రలు పోషించి ఓ స్థాయికి చేరుకున్నారు. కట్‌ చేస్తే, కుటుంబాన్ని పోషించేందుకు ఒకానొక సమయంలో మెకానిక్‌గా, ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేశారు. ఆయనెవరో కాదు ‘ప్రేమ దేశం’ (Prema Desam) సినిమాతో అటు కోలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌ ప్రేక్షకుల్ని విశేషంగా అలరించిన అబ్బాస్‌ (Abbas). తానెందుకు సినిమాలకు దూరంకావాల్సి వచ్చిందో తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. స్వదేశానికి తిరిగొచ్చిన ఆయన ఒడుదొడుకుల ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు.

ఆత్మహత్య ఆలోచన వచ్చింది కానీ..

తనని తాను ప్రైవేట్‌ పర్సన్‌గా అభివర్ణించుకున్న అబ్బాస్‌ సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటానన్నారు. కొవిడ్‌ సమయంలో ‘జూమ్‌’ ద్వారా అభిమానులకు దగ్గరయ్యానని పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఉన్నవారిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించానని తెలిపారు. ‘‘10 గ్రేడ్‌ ఫెయిలైనప్పుడు నాకూ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. అదే సమయంలో నేను ప్రేమించిన అమ్మాయి నాకు దూరంకావడంతో సూసైడ్‌ ఆలోచన బలపడింది. కానీ, దాన్నుంచి నేను బయటపడగలిగా. ఓసారి రోడ్డు పక్కన నిల్చొని.. వేగంగా వస్తున్న భారీ వాహనం ముందుకు వెళ్లాలనుకున్నా. అదే సమయంలో దాని వెనుక వస్తున్న బైక్‌ని గమనించా. ఒకవేళ నన్ను ఆ వాహనం ఢీ కొడితే.. వెనుక వచ్చే ద్విచక్రవాహనదారుడు దాన్ని ఢీ కొడతాడు. నేను తీసుకున్న నిర్ణయం వల్ల అతడి జీవితంపై ప్రభావం పడుతుంది. కష్ట సమయంలోనూ ఇతరుల శ్రేయస్సును కోరుకునే మనస్తత్వం అలవరచుకున్నా. ఈ విషయాన్నే కొవిడ్‌ సమయంలో నా అభిమానులతో పంచుకున్నా’’

ఫేక్‌ మ్యారేజ్‌ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాడు.. కంగనా పోస్ట్‌ ఎవరినుద్దేశించో?

‘‘విద్యార్థి దశలో నాకు చదువుపై ఆసక్తి లేదు. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రతిభ దాగుంటుంది. అంతేగానీ మార్కులు ఆధారంగా మనిషిని అంచనా వేయడం సరైంది కాదనేది నా అభిప్రాయం. సాధారణంగా పురుషులు ఎమోషన్స్‌ బయటపెట్టేందుకు కష్టంగా ఫీలవుతుంటారు. బాధను లోపలే దాచుకుంటారు. నా అభిమానులతో మాట్లాడడం ద్వారా వారి ఫీలింగ్స్‌ తెలుసుకోగలిగా.’’

అందుకే ఇండస్ట్రీకి దూరమయ్యా..

‘‘అనుకోకుండానే నేను నటుడినయ్యా. సాధారణ ప్రేక్షకుడిలానే నా తొలి చిత్రం ‘కాదల్‌ దేశం’ (ప్రేమదేశం) ప్రీమియర్‌కి వెళ్లా. మరుసటి రోజు మా ఇంటి ముందు సముద్రాన్ని తలపించే అభిమానగణాన్ని చూసి ఆశ్చర్యపోయా. వారెందుకు నాపై అంత ప్రేమ కురిపించారో అప్పుడు నాకర్థంకాలేదు. 19 ఏళ్ల వయసులో డబ్బు సంపాదించేందుకు సినిమాని ఓ మార్గంగా ఎంపిక చేసుకున్నా. కెరీర్‌ ప్రారంభంలో విజయాలు అందుకున్నా. తర్వాత ఫెయిల్యూర్‌నీ చూశా. కనీస అవసరాలకూ డబ్బుల్లేని పరిస్థితి ఎదురైంది. అవకాశం కోసం నిర్మాత ఆర్‌.బి. చౌదరిని కలిశా. ‘పూవెలి’ చిత్రంలో నటించమన్నారు. కొన్నాళ్లకు నా పనిని (నటన) నేను ఆస్వాదించలేకపోయా. బోర్‌ కొట్టేసింది. అందుకే సినిమాలకు దూరమయ్యా. న్యూజిలాండ్‌ వెళ్లా. కుటుంబాన్ని పోషించేందుకు బైక్‌ మెకానిక్‌గా, ట్యాక్సీ డ్రైవర్‌గాను పనిచేశా’’ అని అబ్బాస్‌ చెప్పారు.

రష్మి అప్పుడు చెప్పిన సీన్‌ ఇదేనా? వైరల్‌గా మారిన ‘భోళా శంకర్‌’ స్క్రీన్‌ షాట్స్‌!

‘ప్రేమదేశం’ సూపర్‌హిట్‌కావడంతో అబ్బాస్‌కు తమిళం, తెలుగుతోపాటు మలయాళం, కన్నడ, హిందీ పరిశ్రమల్లో వరుస అవకాశాలొచ్చాయి. ‘రాజహంస’, ‘రాజా’, ‘నీ ప్రేమకై’, ‘అనగనగా ఒక అమ్మాయి’, ‘కృష్ణబాబు’, ‘శ్వేతనాగు’, ‘నరసింహ’, ‘అనసూయ’ తదితర చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించిన అబ్బాస్‌ 2015లో ఇండస్ట్రీకి దూరమయ్యారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసేందుకు న్యూజిలాండ్‌ వెళ్లిన అబ్బాస్‌.. డబ్బుల్లేని స్థితిలో ట్యాక్సీ డ్రైవర్‌గానూ అవతారమెత్తారు. ఇటీవలే ఇండియాకు వచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని