Allari naresh: ‘పుష్పక విమానం’ లాంటి మూకీ చిత్రం చేయాలనుంది!

‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’.  పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్‌ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం.

Updated : 02 May 2024 20:13 IST

‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’.  పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్‌ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. చివరి రెండు రీళ్లు భావోద్వేగభరితంగా ఉంటాయి’’ అన్నారు అల్లరి నరేశ్‌. ఆయన కథానాయకుడిగా మల్లి అంకం తెరకెక్కించిన ఈ సినిమాని రాజీవ్‌ చిలక నిర్మించారు. ఫరియా అబ్దుల్లా కథానాయిక. ఈ సినిమా ఈనెల 3న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే అల్లరి నరేశ్‌ పంచుకున్న విశేషాలు..

ఈ చిత్రానికి మీ నాన్నగారి క్లాసిక్‌ సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌ పెట్టడం ఏమైనా ఒత్తిడిగా అనిపించిందా?

‘‘కచ్చితంగా ఉంది. ఆ సినిమాకి దీనికి పోలిక పెడతారేమోనని భయపడ్డాం. కానీ, ఈ రెండూ వేటికవే పూర్తి భిన్నంగా ఉంటాయి. ఈ చిత్రంలో హీరోకి 35ఏళ్ల వయసొచ్చినా పెళ్లి కాదు. అందరూ తనని ‘పెళ్లి ఎప్పుడూ.. పప్పన్నం ఎప్పుడు పెడతావ’ని అడుగుతుంటే చిరాకుతో అతను చెప్పే డైలాగ్‌ ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. కథకు సరిగ్గా సరిపోతుందనే ఆ పేరు పెట్టాం’’.

మళ్లీ ఇలాంటి వినోదాత్మక కథాంశాన్ని ఎంచుకోవడానికి కారణమేంటి?

‘‘నేను కామెడీకి దూరం జరగలేదు. కథలు బాగా నచ్చితే చేయాలనే అనుకున్నా. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి చాలా మారింది. కథలో వినోదం ఉంటేనే అందరూ ఆస్వాదిస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో మల్లి అంకం ఈ కథతో నా దగ్గరకొచ్చాడు. నిజ జీవితంలో జరిగిన చాలా సంఘటనల్ని పరిశోధించి తను ఈ కథను సిద్ధం చేసిన తీరు బాగా నచ్చింది. ఇందులో ఓ సహజత్వం ఉంది. కామెడీలోనే చక్కటి సందేశముంది. ప్రస్తుతం పెళ్లి చుట్టూ ఎలాంటి మోసాలు జరుగుతున్నాయన్నది దీంట్లో చూపించిన తీరు ప్రేక్షకుల్ని ఆలోచింపజేసేలా ఉంటుంది. అందుకే కథ విన్న వెంటనే చేయాలని నిర్ణయించుకున్నా’’.

మీరు భవిష్యత్తులో ఎలాంటి జానర్స్‌ ప్రయత్నించాలనుకుంటున్నారు?

‘‘నాకు అన్ని రకాల సినిమాలు చేయాలని ఉంది. డార్క్‌ హ్యూమర్‌ ఉన్న కథల్ని బాగా ఇష్టపడతా. ప్రేక్షకులు ఇప్పుడు కథలో నుంచి పుట్టిన కామెడీని ఎక్కువ ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం నేను అలాంటి కథలపై దృష్టి పెడుతున్నా. అలాగే ‘పుష్పక విమానం’ లాంటి మూకీ చిత్రం చేయాలని ఉంది. దాంతో పాటు ‘జోకర్‌’ లాంటి పాత్ర చేయాలని ఉంది. మనం నవ్వుతుంటే ప్రేక్షకులు భయపడాలి’’.

ఈ చిత్రంలో వినోదాన్ని.. సందేశాన్ని ఎలా బ్యాలెన్స్‌ చేశారు?

‘‘సినిమా ఆద్యంతం నవ్వులు పంచినప్పటికీ ఆఖర్లో ఏదో మంచి సందేశం ఉండాల్సిందే. ‘కితకితలు’ కామెడీ సినిమానే. కానీ, అందులో చూపించిన సందేశం అందరికీ అద్భుతంగా కనెక్ట్‌ అయింది. మా నాన్న తీసిన సినిమాల్లోనూ అంతర్లీనంగా మంచి సందేశం ఉంటుంది. అలాగే మా చిత్రంలో చూపించనున్న సందేశం కూడా ప్రేక్షకుల్ని కదిలించేలా ఉంటుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది’’.

మీ కొత్త చిత్ర విశేషాలేంటి? దర్శకత్వం ఆలోచన ఉందా?

‘‘నేను ప్రస్తుతం ‘బచ్చల మల్లి’  అనే సినిమా చేస్తున్నా. అలాగే మరో రెండు చిత్రాలు ఒప్పుకున్నా. దర్శకత్వం చేయాలన్న ఆలోచనలు ఉన్నాయి కానీ, దానికి ఇంకా చాలా సమయం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని