Cinema news: టికెట్‌ రేట్ల వ్యవహారం.. మంత్రి పేర్ని నానితో భేటీకానున్న డిస్ట్రిబ్యూటర్లు

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చకు దారి తీసింది.

Updated : 27 Dec 2021 16:09 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చకు దారి తీసింది. దీనిపై సినీ పరిశ్రమ వర్గాలతో పాటు, రాజకీయ నాయకులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మరోవైపు ఏపీలో సరైన నిర్వహణ, అనుమతులు లేని థియేటర్‌లపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో తాము థియేటర్‌లను నడపలేమని పలువురు యజమానులు స్వచ్ఛందంగా సినిమా హాళ్లను మూసివేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో చర్చలకు థియేటర్ యజమానులు, పంపిణీదారులు తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. టికెట్‌ రేట్ల తగ్గింపు వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని నాని దృష్టికి తీసుకెళ్లేందుకు సమయాత్తమయ్యారు. ఇప్పటికే ఈ విషయమై మంత్రిని కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వాల్సిందిగా కోరగా, కేవలం డిస్ట్రిబ్యూటర్స్‌తో మాత్రమే మాట్లాడేందుకు మంత్రి ఓకే చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు 20మంది డిస్ట్రిబ్యూటర్లు మంత్రిని కలిసేందుకు అనుమతి లభించింది. ప్రస్తుతం తాము ఎదుర్కొంటున్న సమస్యలను డిస్ట్రిబ్యూటర్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు. సినిమా టికెట్‌ రేట్లపై పలువురు సినీ హీరోలు, నిర్మాతల వ్యాఖ్యలతో తాము ఇబ్బంది పడుతున్నట్లు థియేటర్‌ యజమానులు, పంపిణీదారులు చెబుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లతో థియేటర్లు నడపలేమని, దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని మంత్రిని కోరనున్నారు.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని