దీపావళికి..‘చిత్రా’వళి

థియేటర్లు ఇప్పుడిప్పుడే కరోనాకు ముందున్న పరిస్థితులకు మారుతున్నాయి. వందశాతం ఆక్యుపెన్సీకి కేంద్రం అనుమతులు ఇవ్వడంతో విడుదల

Published : 20 Feb 2021 12:47 IST

థియేటర్లు ఇప్పుడిప్పుడే కరోనాకు ముందున్న పరిస్థితులకు మారుతున్నాయి. వందశాతం ఆక్యుపెన్సీకి కేంద్రం అనుమతులు ఇవ్వడంతో విడుదల తేదీలు ఖాయం చేసుకుంటున్నాయి సినిమాలు. పండగల వేళ తమ సినిమాల్ని ప్రదర్శించుకోడానికి ముందస్తు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇటీవలే యశ్‌రాజ్‌ సంస్థ నిర్మించిన ఐదు చిత్రాలకు సంబంధించిన విడుదల తేదీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఐదింటిలో అక్షయ్‌కుమార్‌ ‘పృథ్విరాజ్‌’ కూడా ఉంది. దీన్ని దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

అంతకుముందే దీపావళికి తమ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది ‘జెర్సీ’ బృందం. షాహిద్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఇది. తెలుగులో విజయం సాధించిన ఈ చిత్రాన్ని హిందీలో అదే పేరుతో రీమేక్‌ చేస్తున్నారు మాతృకను తెరకెక్కించిన గౌతమ్‌ తిన్ననూరి. ‘కబీర్‌సింగ్‌’తో భారీ విజయాన్ని అందుకున్న షాహిద్‌ చేస్తున్న ‘జెర్సీ’పైనా భారీ అంచనాలున్నాయి.

ఇదే సమయంలో ‘అప్నే 2’ వెలుగుల పండక్కే రానుంది. ధర్మేంద్ర, సన్నీ దేఓల్, బాబీ దేఓల్‌ కలిసి నటిస్తున్న చిత్రమిది.  ‘‘దర్శకనిర్మాతలు తమ సినిమాల విడుదలకు   పండగల్ని కీలక సమయంగా   భావిస్తుంటారు. ఆ సమయంలో మంచి వసూళ్లు అందుకోవచ్చనేది అభిప్రాయం. ఈసారి దీపావళికి ‘జెర్సీ’, ‘అప్నే 2’ మధ్యే పోటీ ఉంటుంది అనుకున్నారు. యశ్‌రాజ్‌ సంస్థ ‘పృథ్విరాజ్‌’ చిత్రాన్నీ దీపాల పండగకే అని ప్రకటించడంతో త్రిముఖ పోటీ నెలకొంది’’అంటున్నారు ఓ ప్రముఖ సినీ విశ్లేషకుడు.

‘జెర్సీ’, ‘పృథ్విరాజ్‌’..ఈ రెండు చిత్రాలు ఎక్కువమంది ప్రేక్షకులు లక్ష్యంగా వచ్చే చిత్రాలు. వసూళ్లు భారీ స్థాయిలోనే ఉంటాయి. దీంతో ఈ రెండు సినిమాల మధ్యే అసలైన పోటీ ఉంటుంది. ‘అప్నే 2’ పోటీ అని చెప్పలేం కానీ ఆ సినిమాకి అంటూ ప్రత్యేక ప్రేక్షకులు ఉంటారు’’అని మరో సినీ విశ్లేషకుడు అభిప్రాయపడుతున్నారు.

అలియాభట్‌ ప్రధాన పాత్రలో సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న ‘గంగూబాయి కతియావాడి’ని దీపావళి బరిలోనే నిలిపే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్టు సమాచారం. అదే నిజమైతే దేశంలో దీపావళి వేళ థియేటర్లు కళకళలాడటం ఖాయంగా అనిపిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని