నేనూ ఆ వివక్ష ఎదుర్కొన్నా!

‘‘ఓ నటిగా నేనెప్పుడూ నాతోనే పోటీ  పడాలనుకుంటా. చేసే ప్రతి చిత్రంతో నటిగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవాలనుకుంటా’’ అంటోంది చాందినీ

Published : 17 Oct 2020 15:42 IST

‘‘ఓ నటిగా నేనెప్పుడూ నాతోనే పోటీ  పడాలనుకుంటా. చేసే ప్రతి చిత్రంతో నటిగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవాలనుకుంటా’’ అంటోంది చాందినీ చౌదరి. ‘మను’, ‘హౌరా బ్రిడ్జి’ చిత్రాలతో కథానాయికగా ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ తెలుగు ముద్దుగుమ్మ.. ఇప్పుడు ‘కలర్‌ ఫొటో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. సందీప్‌రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. సుహాస్‌ కథానాయకుడిగా నటించారు.  సునీల్‌ ముఖ్య పాత్ర పోషించారు. ఈనెల 23న ఓటీటీ వేదిక ‘ఆహా’లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ  నేపథ్యంలో తాజాగా విలేకర్లతో ముచ్చటించారు చాందినీ. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

‘‘దర్శకుడు సందీప్‌ ఏడాది క్రితం ఈ కథతో నా దగ్గరకొచ్చారు. ఆయన కథ చెప్పిన తీరు.. దాన్ని ముందుకు తీసుకెళ్లిన విధానం, నా పాత్ర అన్నీ నాకు బాగా నచ్చాయి. దీంతో వెంటనే సినిమాకు ఓకే చెప్పేశా. నిజానికి నాకు తనకీ ముందు నుంచే పరిచయం ఉంది. ఇద్దరం లఘు చిత్రాల ద్వారా తెరపైకి వచ్చిన వాళ్లమే. ఆయన ఈ కథ రాసుకున్నప్పుడే ఈ పాత్రకు నన్ను అనుకున్నారట’’

‘‘ఇది వర్ణ వివక్ష నేపథ్యంలో సాగే చిత్రం. 1990ల కాలంలో ఓ మారుమూల గ్రామంలో జరిగే కథ ఇది. దీంట్లో నేను మనసుకు నచ్చినట్లుగా జీవించడానికి ఇష్టపడే స్వాతంత్య్ర భావాలున్న మధ్యతరగతి అమ్మాయిగా కనిపిస్తా’’

‘‘ఇది 90ల కాలం నాటి పాత్ర కావడంతో.. దీని కోసం అమ్మనే స్ఫూర్తిగా తీసుకున్నా. రంగును చూసి మనిషి వ్యక్తిత్వాన్ని, స్థాయిని అంచనా వేయడం సరికాదని ఈ చిత్రం ద్వారా సందేశమివ్వనున్నాం. నటిగా నాకెంతో సంతృప్తినిచ్చిన చిత్రమిది’’.

‘‘సమాజంలో వర్ణ వివక్ష చాలా ఏళ్లుగా ఉంది. కెరీర్‌ తొలినాళ్లలో నేనూ ఇలాంటి వివక్షను ఎదుర్కొన్నా. కొంతమంది ‘నువ్వు అంత పెద్ద రంగేంలేవ’న్నారు. కానీ, నేనెప్పుడూ ఆ మాటలు పట్టించుకోలేదు’’

‘‘నటిగా కెరీర్‌ ఆరంభంలో వాళ్లకి నచ్చాలి.. వీళ్లకి నచ్చాలి అని రకరకాలుగా ఆలోచిస్తూ సినిమాలు చేశా. కానీ, దాని వల్ల ఎవరికీ ఉపయోగం లేదని తేలింది. నేనెప్పుడైతే నా మనసుకు నచ్చిన కథలు ఎంపిక చేసుకొని, సినిమాలు చేయడం మొదలు పెట్టానో.. అప్పటి నుంచే నటిగా నాకు సంతృప్తి దొరికినట్లయింది. ఇకపైనా ఇలాగే నా ప్రయాణాన్ని కొనసాగించాలనుకుంటున్నా’’

‘‘వ్యక్తిగతంగా నేనెలాంటి చిత్రాలు చూడటానికి ఇష్టపడతానో.. అలాంటి మంచి సినిమాలే చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఓ నటిగా చేసే ప్రతి చిత్రంతోనూ వైవిధ్యం చూపించాలనుకుంటున్నా. ప్రస్తుతం సుధీర్‌ వర్మ నిర్మాణంలో ఓ చిత్రం చేస్తున్నా. విష్వక్‌ సేన్‌కు జోడీగా ఓ అడ్వెంచరస్‌ థ్రిల్లర్‌ చేస్తున్నా. ఒక వైవిధ్యభరిత ప్రేమకథా చిత్రంలోనూ నటిస్తున్నా’’


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని