కీర్తి సురేశ్‌ను ప్రశంసించిన రష్మిక

అగ్రకథానాయిక కీర్తి సురేశ్‌పై హీరోయిన్‌ రష్మిక ప్రశంసల వర్షం కురిపించారు. కీర్తి ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం ‘పెంగ్విన్‌’. సస్పెన్స్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది....

Published : 24 Jun 2020 12:29 IST

‘సైరస్‌’ నా పెంపుడు శునకం: ఈశ్వర్‌ కార్తిక్‌

హైదరాబాద్‌: అగ్రకథానాయిక కీర్తి సురేశ్‌పై హీరోయిన్‌ రష్మిక ప్రశంసల వర్షం కురిపించారు. కీర్తి ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం ‘పెంగ్విన్‌’. సస్పెన్స్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘పెంగ్విన్‌’ను వీక్షించిన రష్మిక చిత్రబృందాన్ని ప్రశంసిస్తూ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. ‘గత రాత్రి నేను ‘పెంగ్విన్‌’ చిత్రాన్ని వీక్షించాను. కీర్తి.. నీ నటన మర్చిపోలేకపోతున్నాను. ఎప్పటిలాగానే ఈ చిత్రంలోనూ నువ్వు చాలా అద్భుతంగా నటించావు. ఆపదల నుంచి కుటుంబాన్ని సైరస్‌(చిత్రంలో కీర్తిసురేశ్‌ పెంపుడు శునకం) రక్షించడం చాలా బాగుంది. ఈ సినిమా మాతృమూర్తులందరికీ సంబంధించిందని ఖచ్చితంగా చెప్పగలను. దర్శకుడు ఈశ్వర్‌ కార్తిక్‌, నిర్మాత కార్తిక్‌ సుబ్బరాజుతోపాటు ఇతర చిత్రబృందానికి అభినందనలు’ అని రష్మిక పోస్టు చేశారు.

సైరస్‌ నా పెంపుడు శునకం:

‘పెంగ్విన్‌’ చిత్రంలో సైరస్‌ అనే శునకం ఎంతో కీలకమైన పాత్రను పోషించిన విషయం తెలిసిందే. కథానాయిక కీర్తిసురేశ్‌కు పెంపుడు శునకంగా ఉంటూ ఆమెను అన్ని విధాలుగా రక్షిస్తుంటుంది. అయితే సైరస్‌ గురించి దర్శకుడు ఈశ్వర్‌ కార్తిక్‌ తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘సైరస్‌ అసలు పేరు మ్యాడీ. అది నా పెంపుడు శునకం. దానికి నా బాడీల్వాంగేజ్‌ బాగా తెలుసు. అలాగే నేను కూడా దాని ప్రతికదలికను పూర్తిగా అర్థం చేసుకోగలను. ‘పెంగ్విన్‌’ సినిమాలో సైరస్‌ పాత్ర కోసం శిక్షణ పొందిన శునకం కావాలని మొదట వెతికాను. కానీ దొరకలేదు. అలాంటి సమయంలో షూటింగ్‌కి ముందు ఓ రోజు మ్యాడీని సెట్‌కి తీసుకువెళ్లి కొన్ని సీన్స్‌ చేయించాను. నాకెంతో అద్భుతంగా అనిపించింది. అందుకే సినిమాలో మ్యాడీనే తీసుకున్నాను. అది చాలా సహజంగా నటించింది’ అని ఈశ్వర్‌ తెలిపారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని