సంక్షిప్త వార్తలు (6)

సూరరై పోట్రు చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం గెలుచుకున్న మలయాళ నటి అపర్ణాబాలమురళి. వైవిధ్యమైన చిత్రాలతో ముందుకు సాగుతోంది

Updated : 05 Nov 2022 14:58 IST

గొడ్డలి మర్చిపోయినా... చెట్టుకు గుర్తే

సూరరై పోట్రు చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం గెలుచుకున్న మలయాళ నటి అపర్ణాబాలమురళి (Aparna balamurali). వైవిధ్యమైన చిత్రాలతో ముందుకు సాగుతోంది. ఆమె మరో కొత్త చిత్రంలో నటించబోతుంది. అదే ‘రుధిరం’ (Rudhiram). ఈ విషయాన్ని ఆమె తెలియజేస్తూ ఓ పోస్టర్‌ను పంచుకోవడంతో పాటు ‘‘గొడ్డలి మర్చిపోయినా..చెట్టుకు గుర్తుంటుంది’అనే వ్యాఖ్యను రాసింది. జిషో లాన్‌ ఆంటోనీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రతీకారం నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌ చిత్రంగా రూపొందనుంది. కన్నడ నటుడు రాజ్‌ బీ శెట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.


చిరు కోసం ప్రత్యేకంగా..

ఊర్వశీ రౌతేలా (urvashi rautela) తెలుగులో జోరు చూపిస్తోంది. ఇటీవలే రామ్‌ - బోయపాటి శ్రీను చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడిన ఈ నాయిక ఇప్పుడు మరో క్రేజీ అవకాశం అందుకుంది. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya)లోనూ ఓ ప్రత్యేక గీతం చేస్తోంది. బాబీ (కె.ఎస్‌.రవీంద్ర) తెరకెక్కిస్తున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. రవితేజ ఓ కీలక పాత్రలో నటించారు. ఆయన ఇటీవలే చిరంజీవితో కలిసి ఓ స్పెషల్‌ మాస్‌ పాటలో స్టెప్పేశారు. కాగా, ఇప్పుడు చిరు - ఊర్వశిపై హైదరాబాద్‌లో వేసిన ఒక భారీ సెట్‌లో ఓ ప్రత్యేక గీతం చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం శుక్రవారం ప్రకటించింది. ‘‘ఇది సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచే పాట. ఈ గీతానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందించగా.. శేఖర్‌ మాస్టర్‌ నృత్యరీతులు సమకూరుస్తున్నారు’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం.. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఊహకందని మలుపులతో...

ఒకే ఒక్క పాత్రతో రూపొందిన చిత్రం ‘హలో మీరా’ (Hello Meera). గార్గేయి యల్లాప్రగడ నటించారు. శ్రీనివాసు కాకర్ల దర్శకత్వం వహించారు. డా.లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల నిర్మాతలు. ఎస్‌.చిన్న స్వరకర్త. ఈ సినిమా ట్రైలర్‌ని ఇటీవల ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘ఒక్క పాత్రతో సినిమా చేయడమనేది ఓ పెద్ద సవాల్‌. ట్రైలర్‌తోనే థ్రిల్‌కి గురిచేశారు దర్శకుడు. సినిమా తప్పకుండా ప్రేక్షకుల మెప్పు పొందుతుంద’’న్నారు. ‘‘పెళ్లి పీటలెక్కాల్సిన మీరా రాత్రికి రాత్రే హైదరాబాద్‌ ఎందుకు వెళ్లిపోవాలనుకుంది? ఆ తర్వాత మీరాకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనే అంశాల చుట్టూ ఆసక్తికరంగా ఈ చిత్రం సాగుతుంది. ప్రముఖ దర్శకుడు బాపు దగ్గర పలు చిత్రాలకి సహ దర్శకుడిగా పనిచేసిన అనుభవంతో ప్రయోగాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు కాకర్ల శ్రీనివాసు. ఊహకందని మలుపులతో ప్రేక్షకుల్ని థ్రిల్‌కి గురిచేసే చిత్రమిద’’ని సినీ వర్గాలు తెలిపాయి.


సీతారామపురంలో ప్రేమ కథ

రణధీర్‌, నందినీ జంటగా ఎం.వినయ్‌ బాబు తెరకెక్కించిన చిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట’ (seetharama puram lo oka prema janta). బీసు చందర్‌ గౌడ్‌ నిర్మించారు. ఈ సినిమా నవంబరు 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే విభిన్నమైన ప్రేమకథా చిత్రమిది. బోలెడన్ని మలుపులతో చాలా ఆసక్తికరంగా తెరకెక్కించారు దర్శకుడు. ఇందులో అంతర్లీనంగా ఓ మంచి సందేశం ఉంది. యువతతో పాటు తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రమిది’’ అన్నారు. ‘‘మంచి కథతో పాటు చక్కటి వాణిజ్య అంశాలు ఉన్న సినిమా ఇది. దీన్ని ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరుతున్నా’’ అన్నారు చిత్ర దర్శకుడు.


అతనెవరు?

ఎడిటర్‌ కోలా భాస్కర్‌ తనయుడు కోలా బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘నేనెవరు?’ (Nenevaru). సాక్షి చౌదరి కథానాయిక. నిర్ణయ్‌ పల్నాటి దర్శకత్వం వహించారు. భీమనేని శివప్రసాద్‌, తన్నీరు రాంబాబు నిర్మాతలు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయని, త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని సినీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ‘‘ప్రేమ చుట్టూ సాగే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఇది. ఓ యువకుడు నేనెవరు? అని ప్రశ్నించాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఇంతకీ అతనెవరు? అనే విషయాల్ని  తెరపైనే చూడాలి. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచే ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాతలు. రాజా రవీంద్ర, దిల్‌ రమేష్‌, డి.ఎస్‌.రావు తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సామల భాస్కర్‌.


సీక్వెల్‌ రావాలని ప్రార్థించండి

షారుక్‌ఖాన్‌ భారీ యాక్షన్‌ హంగామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘పఠాన్‌’ (Pathaan). ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు భారీ స్పందన లభించింది. సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో దీపికా పదుకొణె కూడా అదిరిపోయే పోరాటాలు చేసింది. ఈ సినిమాకు సీక్వెల్‌ తీస్తే బాగుంటుందనే మాట వినిపిస్తోంది. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు షారుక్‌ని ఇదే విషయం అడిగారు కొందరు అభిమానులు. ‘పఠాన్‌’కు సీక్వెల్‌ రావాలని అందరూ ప్రార్థించండి. ఈ సినిమా మీకు కచ్చితంగా నచ్చుతుంది. మేం అనుకున్నట్లు ‘పఠాన్‌’ ప్రేక్షకులకు నచ్చితే రెండో భాగానికి తొందరగా ఏర్పాట్లు చేసుకుంటాం’’అని చెప్పారు. దీన్నిబట్టి ఈ సినిమాకు కొనసాగింపు ఉండే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. ‘పఠాన్‌’ జనవరి 25న విడుదల కానుంది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని