Manchu Manoj: అలాంటి షో కాదు కాబట్టే ఉస్తాద్‌ నేను చేశా!

వైవిధ్యభరితమైన కథలతో.. విలక్షణమైన నటనతో సినీప్రియుల్ని మెప్పించిన కథానాయకుడు మంచు మనోజ్‌. ‘వేదం’, ‘బిందాస్‌’, ‘కరెంట్‌ తీగ’ లాంటి చిత్రాలతో అలరించిన ఆయన.. ఏడేళ్ల విరామం తర్వాత ‘ఉస్తాద్‌’ గేమ్‌ షోతో తిరిగి ప్రేక్షకుల ముందుకొచ్చారు.

Updated : 16 Dec 2023 05:28 IST

వైవిధ్యభరితమైన కథలతో.. విలక్షణమైన నటనతో సినీప్రియుల్ని మెప్పించిన కథానాయకుడు మంచు మనోజ్‌. ‘వేదం’, ‘బిందాస్‌’, ‘కరెంట్‌ తీగ’ లాంటి చిత్రాలతో అలరించిన ఆయన.. ఏడేళ్ల విరామం తర్వాత ‘ఉస్తాద్‌’ గేమ్‌ షోతో తిరిగి ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇది శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఈటీవీ విన్‌’లో ప్రసారం అవుతోంది. ఈ నేపథ్యంలోనే మనోజ్‌ ‘ఈనాడు సినిమా’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

మీరు తెరపై కనిపించి 7ఏళ్లు అవుతోంది. ఈ గ్యాప్‌ కావాలని తీసుకున్నారా? అనుకోకుండా వచ్చిందా?  

‘‘ఈ విరామంలో తొలి నాలుగేళ్లు నేను కావాలని తీసుకున్నదే. కానీ, ఆ మిగతా మూడేళ్ల విరామం అనుకోకుండా వచ్చింది. అయితే, ఇకపై ఎలాంటి గ్యాప్‌ తీసుకోకుండా ప్రేక్షకుల్ని అలరించడమే లక్ష్యంగా పని చేస్తానని మాటిస్తున్నా’’.

ఇంతకీ ఈ విరామంలో ఏం నేర్చుకున్నారు?

‘‘వ్యక్తిగతంగా ఈ విరామం నాకెంతో మేలు చేసింది. ఈ ఏడేళ్లలో నేను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నా. అయితే తొలి మూడేళ్లు మాత్రం మనోధైర్యం కోల్పోయి చాలా చీకటిని చూశా. అదే సమయంలో మౌనిక నా జీవితంలోకి వచ్చి ధైర్యాన్ని నింపింది. జీవితంపై ఆశను చిగురింపజేసింది. సినిమాలపై నాకున్న ప్రేమను, నన్ను ప్రేమించే అభిమానుల ప్రేమను అప్పుడే అర్థం చేసుకోగలిగా’’.  

ఇన్నేళ్ల విరామం తర్వాత ‘ఉస్తాద్‌’ లాంటి గేమ్‌ షోతో తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడానికి కారణమేంటి? ఈ షోలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలేంటి?

‘‘సాధారణంగా ఇలాంటి గేమ్‌ షోల్లో ఎవరైనా సరే తమ కోసం ఆడి.. డబ్బు గెలుచుకుని వెళ్తారు. కానీ, ఈ ‘ఉస్తాద్‌’ షోలో హీరో తన అభిమానిని గెలిపించడం కోసం ఆడుతుంటాడు. అలాగే ఆ అభిమానేమో తాము గెలుచుకున్న డబ్బుతో సమాజానికి ఏదో మంచి చేయాలనే ఉద్దేశంతో ఆడుతుంటాడు. ఇలా ఈ షోలో హీరోని.. అభిమానిని కనెక్ట్‌ చేసిన విధానం నాకు చాలా నచ్చింది. అందుకే ఈ షో గురించి చెప్పగానే చేయాలని నిర్ణయించుకున్నా. తొలుత ఈ కాన్సెప్ట్‌తో నా దగ్గరకు వచ్చినప్పుడు ట్యాంకర్‌ లాంటి వాణ్ని.. యాంకర్‌గా ఎలా అనుకున్నారనుకున్నా (నవ్వుతూ). నిజానికి దీనికన్నా ముందు కొన్ని షోల కోసం పలు ఓటీటీ సంస్థలు, టీవీ ఛానెళ్లు నన్ను సంప్రదించాయి. కానీ, ఆ కథలు.. కాన్సెప్ట్‌లేవీ నాకు నచ్చక చేయనన్నా’’.

ఇంతకి తొలి షోకి వచ్చిన మీరు ముందే చెప్పినట్లు ఈ షోలో గెలుచుకున్న డబ్బును నిజంగానే అభిమానులకు ఇస్తారా?

‘‘గెలిచిన వాళ్లకు కచ్చితంగా ఇస్తాం. అందులో ఎలాంటి అనుమానం లేదు. సాధారణంగా చాలా టీవీ షోల్లో డబ్బులు ఇస్తామని చెప్పి కేవలం వినోదం కోసం రకరకాల ఆటలాడిస్తుంటారు. కానీ, ఇది అలాంటి షో కాదు. ఒకవేళ అలాంటి షో అయ్యి ఉంటే మనోజ్‌ వచ్చి చేసేవాడు కాదు’’.  

మీ కొత్త చిత్ర విశేషాలేంటి?

‘‘ప్రస్తుతం పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలోనే ఓ చిత్రం చేస్తున్నా. చిత్రీకరణ దశలో ఉంది. త్వరలో టీజర్‌తో ఆ సినిమాని ప్రకటించనున్నాం. అలాగే ‘వాట్‌ ద ఫిష్‌’ అనే సినిమా చేయనున్నా. పూర్తిగా విదేశాల నేపథ్యంలో సాగుతుంది. వచ్చే ఏడాది వేసవిలో ప్రారంభించాలని అనుకుంటున్నాం. ఇక ఈ క్రిస్మస్‌కి ముందు నా నుంచి ఓ పెద్ద సర్‌ప్రైజ్‌ రానుంది. నేను.. నా భార్య మౌనిక కలిసి పిల్లలకు సంబంధించినది ఒకటి చేయబోతున్నాం. ముంబయిలో దాన్ని ఆవిష్కరించనున్నాం. దీని కోసమే రిలయన్స్‌తో చేతులు కలిపాం. నేను ఇన్నేళ్లు విరామం తీసుకుని ఏం చేశానని అడిగే వాళ్లకు అది సమాధానంలా ఉంటుంది’’.

స్పందన చూశాక ఎలా అనిపించింది? ఈ సీజన్లో ఇంకా ఎన్ని ఎపిసోడ్స్‌ ఉండనున్నాయి? ఏ స్టార్లు అతిథులుగా రానున్నారు?

‘‘ప్రేక్షకుల ఆదరణ చాలా ఆనందాన్నిచ్చింది. ఇన్నేళ్ల తర్వాత ఇంత మంచి షోతో వాళ్ల ముందుకు వచ్చినందుకు సంతృప్తిగా అనిపించింది. నన్ను నేనెప్పుడూ ఉస్తాద్‌గా భావించుకోలేదు కానీ, నా ఉస్తాద్‌ మూమెంట్‌ మాత్రం ఈ ‘ఉస్తాద్‌’ షోనే. ఈ తొలి సీజన్‌లో మొత్తం 13 ఎపిసోడ్‌లు ఉంటాయి. అందులో అతిథులుగా పాల్గొనే స్టార్లెవరన్నది మాత్రం సర్‌ప్రైజ్‌. ఒకటి మాత్రం పక్కా.. బోలెడంత థ్రిల్‌, ఎమోషన్స్‌తో నిండిన షో ఇది. ఎంతో వినోదాన్ని పంచనుంది. అలాగే మీ అభిమాన తారల జీవితాల్లోని ఎవరికీ తెలియని అనేక ఆసక్తికర విషయాల్ని ఈ షోలో ఆవిష్కరించనున్నాం. వాటిని కచ్చితంగా మిస్‌ అవ్వకండి’’.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని