Devaki nandhana vasudev: ఏమయ్యిందే గుండెకు.. ఏనాడు లేదే ఇంత ఉలుకు

అశోక్‌ గల్లా హీరోగా అర్జున్‌ జంధ్యాల తెరకెక్కిస్తున్న చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. వారణాసి మానస కథానాయిక. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 04 May 2024 09:42 IST

శోక్‌ గల్లా హీరోగా అర్జున్‌ జంధ్యాల తెరకెక్కిస్తున్న చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. వారణాసి మానస కథానాయిక. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర తొలి గీతాన్ని శుక్రవారం విడుదల చేశారు. ‘‘ఏమయ్యిందే గుండెకు.. ఏనాడు లేదే ఇంత ఉలుకు’’ అంటూ సాగుతున్న ఈ పాటకు భీమ్స్‌ సిసిరోలియో స్వరాలు సమకూర్చగా.. సురేశ్‌ గంగుల సాహిత్యాన్ని అందించారు. ఈశ్వర్‌ దత్తు ఆలపించారు. ‘‘ఆధ్యాత్మిక అంశాలతో నిండిన ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. దీంట్లో అశోక్‌ మాస్‌ యాక్షన్‌ పాత్రలో కనిపించనున్నారు’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి కూర్పు: తమ్మిరాజు, ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మూరెళ్ల, రసూల్‌ ఎల్లోర్‌.


దేశాన్ని కాపాడాలంటే.. మన ధర్మాన్ని కాపాడుకోవాలి

‘‘మన దేశాన్ని కాపాడుకోవాలంటే మన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఇది ప్రతి ఒక్క భారతీయుడి కర్తవ్యం’’ అంటున్నారు నటుడు రాకేశ్‌ వర్రె. ఇప్పుడాయన ప్రధాన పాత్రలో విరించి వర్మ తెరకెక్కించిన చిత్రం ‘జితేందర్‌ రెడ్డి’. ముదుగంటి రవీందర్‌ రెడ్డి నిర్మించారు. రియా సుమన్‌, వైశాలి రాజ్‌, ఛత్రపతి శేఖర్‌, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 10న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. ఇది 1980ల కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం. చిన్నప్పటి నుంచే సమాజం పట్ల అంకితభావం ఉన్న జితేందర్‌ రెడ్డి.. ఆ సమాజానికి ఏదో మంచి చెయ్యాలని తపన పడుతుంటాడు. ఈ క్రమంలోనే విద్యార్థి నాయకుడిగా ఎదిగి.. ఆ తర్వాత పోలీసు వ్యవస్థకు దీటుగా సమాజంలోని నక్సలైట్ల దౌర్జన్యాలకు ఎదురు వెళ్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది? ఈ ప్రయాణంలో ఓవైపు రాజకీయ శక్తుల నుంచి.. మరోవైపు నక్సలైట్ల నుంచి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయన్నది చిత్ర కథాంశం. ‘‘నక్సలైట్లు దేశభక్తులు కాదు సర్‌. దేశం కోసం ప్రాణాలిచ్చే వాళ్లే నిజమైన దేశభక్తులు. ప్రాణాలు తీసే వాళ్లు కాదు సర్‌’’ అంటూ ట్రైలర్‌లో వినిపించిన డైలాగ్‌ ఆలోచింపజేసేలా ఉంది. ఈ సినిమాకి సంగీతం: గోపీ సుందర్‌, ఛాయాగ్రహణం: వి.ఎస్‌.జ్ఞానశేఖర్‌.  


ఆలోచన రేకెత్తించే సత్య

మరేశ్‌, ప్రార్థనా సందీప్‌ జంటగా వాలీ మోహన్‌దాస్‌ తెరకెక్కించిన చిత్రం ‘సత్య’. శివ మల్లాల నిర్మాత. ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం శుక్రవారం ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘‘తన వల్ల తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని ఆలోచించే కొడుకు కథతో తెరకెక్కిన భావోద్వేగభరిత చిత్రమిది. సెన్సార్‌ పనులు పూర్తి చేసుకుని ‘యు’ సర్టిఫికెట్‌ అందుకుంది’’ అన్నారు.


ఎగిరే ‘పతంగ్‌’

యువతరాన్ని అలరించే కథతో రూపొందిన ‘పతంగ్‌’ మరో ‘హ్యాపీడేస్‌’లా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు బుచ్చిబాబు సానా. ఆయనతోపాటు, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ముఖ్య అతిథులుగా ఇటీవల ‘పతంగ్‌’ టీజర్‌ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ప్రీతి పగడాల, ప్రణవ్‌ కౌశిక్‌, వంశీ పూజిత ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. ప్రణీత్‌ ప్రతిపాటి దర్శకుడు. గాయకుడు, నటుడు ఎస్పీ చరణ్‌ ఓ కీలక పాత్రని పోషించారు. విజయ్‌ శేఖర్‌ అన్నే, సంపత్‌, సురేశ్‌ కొత్తింటి నిర్మిస్తున్నారు. నాని బండ్రెడ్డి క్రియేటివ్‌ నిర్మాత. కామెడీ స్పోర్ట్స్‌ డ్రామాగా, పతంగుల పోటీ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. టీజర్‌ని విడుదల చేసిన అనంతరం దర్శకుడు మాట్లాడుతూ ‘‘అంతెత్తున ఎగిరే పతంగ్‌లాగా, మా సినిమా అందరి దృష్టినీ ఆకర్షిస్తుంద’’న్నారు.


‘సర్పంచి’ ప్రారంభం

‘ప్రభుత్వ యంత్రాంగానికీ...  ప్రజలకీ  మధ్య వారధిగా ఉంటూ గ్రామాన్ని  అభివృద్ధి బాటలో నడిపించే సర్పంచి స్థానిక స్వయం పాలనలో ఎంత కీలకమో చాటి చెప్పే ప్రయత్నమే మా చిత్రం’ అన్నారు జట్టి రవికుమార్‌. ఆయన స్వయంగా దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘సర్పంచి’. ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. బోయినపల్లి హనుమంతరావు, పెండ్యాల సత్యనారాయణ, ఆంజనేయులు, బి.రమేశ్‌, అంజనీ, జట్టి రజిత, అక్షర జ్ఞాన తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకనిర్మాత మాట్లాడుతూ ‘‘స్వపరిపాలన చేసే అద్భుతాల్ని మా సినిమాలో చూపిస్తున్నాం. ప్రేక్షకులకు స్వచ్ఛమైన వినోదంతోపాటు, వాళ్లలో చైతన్యం కలిగించేలా సినిమా ఉంటుంది. త్వరలోనే నటీనటులు, సాంకేతిక బృందం వివరాల్ని ప్రకటిస్తాం.  భవిష్యత్తులోనూ మా జ్ఞాన ఆర్ట్స్‌ పతాకంపై ఇలాంటి చిత్రాలు వరుసగా నిర్మిస్తాం’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని