Tollywood: ఈ ఏడాదీ హిట్‌ జోడీ...

సినిమా భాషలో కాంబినేషన్‌ అనే మాటకి విలువ ఎక్కువ. ఆ మాట వినిపించగానే  మొట్ట మొదట గుర్తొచ్చేది నాయకానాయికల జోడీనే!  ఆ తర్వాత కథానాయకుడు - దర్శకుడు, కథానాయకుడు - నిర్మాత, దర్శకుడు - నిర్మాత, దర్శకుడు - హీరోయిన్‌ తదితర మిగతా కలయికలు ప్రస్తావనకొస్తాయి.

Updated : 18 Jan 2023 07:36 IST

2023లో సందడి చేయనున్న సక్సెస్‌ జంటలు

సినిమా భాషలో కాంబినేషన్‌ అనే మాటకి విలువ ఎక్కువ. ఆ మాట వినిపించగానే  మొట్ట మొదట గుర్తొచ్చేది నాయకానాయికల జోడీనే!  ఆ తర్వాత కథానాయకుడు - దర్శకుడు, కథానాయకుడు - నిర్మాత, దర్శకుడు - నిర్మాత, దర్శకుడు - హీరోయిన్‌ తదితర మిగతా కలయికలు ప్రస్తావనకొస్తాయి. హీరో హీరోయిన్‌ జోడీ ఎంత ఆకర్షణీయంగా ఉంటే సినిమాకి అంత క్రేజ్‌. ఇక్కడ ఆకర్షణ అంటే అందంగా కనిపించడం మాత్రమే కాదు. విజయం కూడా! ఇదివరకు కలిసి నటించి విజయం అందుకున్న నాయకానాయికలైతే ‘హిట్‌ జోడీ’గా మార్కెట్‌ని ప్రభావితం చేస్తుంటారు. అలాంటి జంటల్ని మళ్లీ మళ్లీ కలిపి సినిమాలు తీయడానికి దర్శకనిర్మాతలు ప్రత్యేకమైన ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. అలా చిత్రసీమలో ఏటా కొన్ని హిట్‌ జోడీలు మళ్లీ మళ్లీ సందడి చేస్తుంటాయి. కొన్ని కలయికలు జయాపజయాలతో సంబంధం లేకుండానూ సందడిచేస్తుంటాయి. ఈ ఏడాది కూడా అలా పునరావృతం అవుతున్న జంటలు చాలానే!

హిట్‌ కాంబినేషన్‌ అనేది కొత్త విషయమేమీ కాదు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాలం నుంచి కొనసాగుతున్నదే. ఎన్టీఆర్‌ - సావిత్రి, కృష్ణ - విజయనిర్మల, శోభన్‌బాబు - శ్రీదేవి, చిరంజీవి - రాధ, బాలకృష్ణ - విజయశాంతి, వెంకటేష్‌ - సౌందర్య... ఇలా ఎప్పటికీ గుర్తుండిపోయే కాంబినేషన్లు చాలానే. ఆయా జంటలు మరోసారి జట్టు కడుతున్నారంటే చాలు... ప్రేక్షకుల్లో అమాంతం అంచనాలు పెరిగిపోయేవి. వ్యాపార వర్గాలు సైతం ఆ సినిమాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టేవి. అలా గుర్తుండిపోయే కలయికలు ఇప్పుడు తక్కువయ్యాయేమో కానీ... హిట్‌ కాంబినేషన్‌ అనే మాటకి డిమాండ్‌ అయితే అలాగే ఉంది. అందుకే ఒకసారి అలరించిన జంటలు మళ్లీ మళ్లీ తెరపై సందడి చేస్తున్నాయి.

* మహేష్‌బాబు (Mahesh Babu) - పూజాహెగ్డే (Pooja Hegde) జోడీ ‘మహర్షి’తో తొలిసారి సందడి చేసింది. ప్రస్తుతం అగ్ర దర్శకుడు త్రివిక్రమ్‌ ఆ ఇద్దరినీ కలిపి సినిమా చేస్తున్నారు. మహేష్‌ - త్రివిక్రమ్‌ (Trivikram) ఎలాగో, త్రివిక్రమ్‌ - పూజాహెగ్డే కలయిక కూడా అంతే. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పూజాహెగ్డే నటించిన ‘అరవింద సమేత’,  ‘అల వైకుంఠపురములో’ విజయాలు అందుకున్నాయి. అందుకే మహేష్‌ - పూజాహెగ్డే - త్రివిక్రమ్‌ కలయిక ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణని సంతరించుకుంది.  ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొస్తున్న మరో రిపీట్‌ జోడీ రామ్‌చరణ్‌ - కియారా అడ్వాణీ. ఈ ఇద్దరూ ‘వినయ విధేయ రామ’ చిత్రంలో ఆడిపాడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో కలిసి నటిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. అల్లు అర్జున్‌ - రష్మిక.. జంట ‘పుష్ప’తో ప్రేక్షకలోకాన్ని ఊపేసింది. ఇప్పుడు కొనసాగింపుగా రూపొందుతున్న ‘పుష్ప2’ చిత్రంలోనూ ఈ జోడీ సందడి చేయనుంది.

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) - సమంత (Samantha) జోడీ ‘మహానటి’లో మంచి వినోదం పంచింది. ‘ఖుషి’ (Kushi) కోసం ఈ ఇద్దరూ మరోసారి కలిశారు.  ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఆ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగచైతన్య - కృతిశెట్టి జంట ‘బంగార్రాజు’తో ఆకట్టుకుంది. చిన్న సోగ్గాడిగా నాగచైతన్య, సర్పంచి నాగలక్ష్మిగా కృతిశెట్టి సందడి చేశారు. ఆ ఇద్దరూ ఇప్పుడు ‘కస్టడీ’ కోసం జట్టు కట్టారు. నాని (Nani) - కీర్తి సురేష్‌ (Keerthy Suresh) జంటగా  ‘నేను లోకల్‌’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పుడు ‘దసరా’ (Dasara) కోసం వీళ్లిద్దరూ మరోసారి ఆడిపాడుతున్నారు. సీనియర్‌ హీరోల్లో చిరంజీవి - తమన్నా ‘సైరా నరసింహారెడ్డి’లో కలిసి నటించారు. ‘భోళా శంకర్‌’ కోసం ఈ ఇద్దరూ మరోమారు కలిసి కెమెరా ముందుకొచ్చారు.  


అప్పట్లో అయితే... వాళ్లు తప్ప మరొకరు చేయలేరనిపించే కథలు, పాత్రలు కొన్ని జోడీల్ని పునరావృతం చేసేవి. ఈమధ్య అయితే స్టార్‌ హీరోల సరసన స్థానాన్ని భర్తీ చేయడానికి దర్శకులకి మరో ప్రత్యామ్నాయం కనిపించదు. స్టార్‌ కథానాయికల సంఖ్య తగ్గడమే అందుకు కారణం. దాంతో ఉన్న కొద్దిమందిలో వాళ్లనే మళ్లీ మళ్లీ ఎంపిక చేసుకుని సినిమాలు తీస్తుంటారు. అలా పునరావృతం అయిన కలయికలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని