kareena kapoor: వాళ్లే మా సినిమాను ట్రోల్‌ చేశారు..అందుకే ఇలా! కరీనా కపూర్‌

గత మూడు నెలలుగా బాలీవుడ్‌లో ఆమిర్‌ఖాన్‌(Aamir Khan) కథానాయకుడిగా నటించిన ‘లాల్‌ సింగ్ చడ్డా’(Laal Singh Chaddha) సినిమా పైనే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం(ఆగస్టు11)దేశవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో

Published : 14 Aug 2022 02:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆమిర్‌ఖాన్‌(Aamir Khan) కథానాయకుడిగా నటించిన ‘లాల్‌ సింగ్ చడ్డా’(Laal Singh Chaddha) పైనే గత కొంతకాలంగా బాలీవుడ్‌లో చర్చలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం(ఆగస్టు11)దేశవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రారంభ వసూళ్లను దక్కించుకోలేకపోయింది. బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రానికి అనుకున్న స్థాయిలో వసూళ్లు రాకపోవడంపై సినీ పండితులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ సినిమా ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచే ‘బాయ్‌కట్‌ లాల్‌ సింగ్‌చడ్డా’ ట్యాగ్‌లైన్‌తో సామాజిక మాధ్యమాల్లో కొందరు తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. విడుదలైన అనంతరం ఈ చిత్రంపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. తాజాగా ఈ చిత్ర కథానాయిక, ప్రముఖ హిందీ నటి కరీనాకపూర్‌(Kareena Kapoor) ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఒక ఇంటర్వ్యూలో ‘లాల్‌ సింగ్‌ చడ్డా ఓపెనింగ్స్‌ ఆశించిన రీతిలో లేవు.. దీనిపై మీ స్పందనేంటి?’ అన్న ప్రశ్నకు కరీనా మాట్లాడుతూ..‘లాల్‌ సింగ్‌ చడ్డాను కొందరు టార్గెట్‌ చేశారు. మొత్తం ప్రేక్షకుల్లో వారు 1శాతం ఉంటారు. వాళ్లే ఈ చిత్రాన్ని ట్రోల్‌ చేస్తున్నారు. మిగతావారు ఈ సినిమాని అభిమానిస్తున్నారు. ఈ సినిమాని బహిష్కరిస్తే మంచి సినిమాని ప్రేక్షకులకు దూరం చేసినట్లే. రెండున్నరేళ్లు 250మంది ఈ సినిమా కోసం కష్టపడ్డాం. మూడేళ్ల నుంచి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. దయచేసి ఈ చిత్రాన్ని బహిష్కరించకండి’ అంటూ ఆమె విజ్ఞప్తి చేసింది. అయితే సినిమా విడుదలకు ముందు కూడా ‘బాయ్‌కట్‌ లాల్‌ సింగ్‌చడ్డా’ పై స్పందించిన కరీనా ‘ప్రతి ఒక్కరికి  ప్రతిదాని పై అభిప్రాయం ఉంటుంది. ఒక మంచి సినిమా వీటంన్నిటిని అధిగమించి విజయం సాధిస్తుంది’ అంటూ వ్యాఖ్యానించింది. ఇదిలా ఉండగా ‘లాల్‌ సింగ్ చద్దా’ మొదటి రోజు సుమారు రూ.12కోట్లు వసూళ్లను దక్కించుకున్నట్లు సమాచారం. ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ మినహాయిస్తే ఆమిర్‌ఖాన్‌ గత ఐదు చిత్రాల్లో దేనికి ఇంత తక్కువ ఓపెనింగ్స్ నమోదవ్వలేదని బాక్సాఫీస్‌ రికార్డులు చెబుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని