
Laal Singh Chaddha: ఆమిర్ ఖాన్ ‘లాల్‌సింగ్ ఛద్దా’ కొత్త విడుదల తేదీ ఖరారు
ఏప్రిల్ 14, 2022 థియేటర్లో గ్రాండ్ రిలీజ్
అదే రోజున.. పాన్ ఇండియా చిత్రం యశ్ ‘కేజీఎఫ్-2’ విడుదల
ఇంటర్నెట్ డెస్క్: ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ‘‘లాల్ సింగ్ ఛద్దా’’ కొత్త విడుదల తేదీ ఖరారైంది. 2022 ఏప్రిల్ 14న బైశాఖీ పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు కొత్త పోస్టర్‌తో సామాజిక మాధ్యమాల్లో ప్రకటించింది ఆ చిత్ర బృందం. అదే రోజున కన్నడ హీరో యశ్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కేజీఎఫ్-2’ విడుదల చేస్తున్నట్లు గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో ఒకే రోజున రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్ ముందు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాయి. లాల్ సింగ్ ఛద్దాని తొలుత క్రిస్టమస్ కానుకగా ఈ ఏడాది డిసెంబర్ 25న విడుదల తేదీగా ప్రకటించినప్పటికీ.. బాలీవుడ్లో రోజుల వ్యవధిలో.. డిసెంబరు 24న ‘83’, డిసెంబరు 31న ‘జెర్సీ’, ‘సర్కస్’ చిత్రాలు రిలీజ్ అవ్వడంతో వాయిదా పడింది.
టాలీవుడ్ యువ నటుడు అక్కినేని నాగచైతన్య ‘లాల్ సింగ్ ఛద్దా’తో బాలీవుడ్లో తెరంగ్రేటం చేయనున్నారు. ఇందులో చైతూ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. గతంలో లద్దాఖ్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు చైతూ సైనిక దుస్తుల్లో ధరించిన ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఆమిర్ ఖాన్ సరసన కరీనా కపూర్ హీరోయిన్గా నటించింది. 1994లో హాలీవుడ్లో విడుదలైన ‘ఫారెస్ట్ గంప్’కి రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. ఆమీర్‌ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంస్థలు రూపొందిస్తున్నాయి. కామెడీ-డ్రామా నేపథ్యంలో రాబోయే చిత్రం రూ.105 కోట్ల వ్యయంతో తెరకెక్కింది. సల్మాన్, షారుక్ ఖాన్, మాధురి దీక్షిత్, కాజోల్, కరిష్మా కపూర్ అతిథి పాత్రల్లో నటించారు.