Chiranjeevi: చిరుతో నటించేదెవరు?

కొత్త చిత్రాల విషయంలో అగ్ర కథానాయకుడు చిరంజీవి జోరు కొనసాగుతోంది. వరుసగా పలు సినిమాల్ని పట్టాలెక్కించిన ఆయన... ఒకొక్కటిగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

Updated : 06 May 2023 07:23 IST

కొత్త చిత్రాల విషయంలో అగ్ర కథానాయకుడు చిరంజీవి జోరు కొనసాగుతోంది. వరుసగా పలు సినిమాల్ని పట్టాలెక్కించిన ఆయన... ఒకొక్కటిగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ‘భోళాశంకర్‌’ని పూర్తి చేసే పనిలో ఉన్న ఆయన... తదుపరి మరో దఫా చిత్రాల్ని ప్రకటించి రంగంలోకి దిగే ప్రణాళికలతో ఉన్నారు. అందుకోసం పలువురు యువ దర్శకులు ఇప్పటికే కథలతో కసరత్తులు చేస్తున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఫేమ్‌ కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా నటించనున్న సినిమా ఖరారైంది. ఒకవైపు స్క్రిప్ట్‌ పనులు పక్కా అవుతుండగా.. మరోవైపు నటీనటుల ఎంపికకి సంబంధించిన కసరత్తులు కొనసాగుతున్నాయి. ఈ చిత్రంలో చిరంజీవితోపాటు మరో యువ కథానాయకుడు నటించనున్నారు.  విజయ్‌ దేవరకొండ, సిద్ధు జొన్నలగడ్డ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి ఈ ఇద్దరిలో చిరుతో కలిసి నటించేదెవరన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరికొన్ని రోజుల్లోనే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. సినిమాలో యువ కథానాయకుడికి జోడీగా నటించేందుకు శ్రీలీలని సంప్రదించినట్టు తెలిసింది. చూస్తుంటే ఈ సినిమా కోసం ఓ ఆసక్తికరమైన కలయిక కుదిరే అవకాశాలే కనిపిస్తున్నాయి. చిరంజీవి తనయ సుస్మిత కొణిదెల నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు