Cinema News: వ్యాక్సిన్‌.. కెమెరా..  యాక్షన్‌

సెట్లో సందడికి సిద్ధం సినిమా పూర్తయి కాపీ సిద్ధంగా ఉంటే నిర్మాతకు ఉండే ధైర్యమే వేరుగా ఉంటుంది. టాకీ పార్ట్‌ పూర్తయి నిర్మాణానంతర కార్యక్రమాలు మిగిలినా..

Published : 11 Jun 2021 09:19 IST

ముంబయి: సెట్లో సందడికి సిద్ధం సినిమా పూర్తయి కాపీ సిద్ధంగా ఉంటే నిర్మాతకు ఉండే ధైర్యమే వేరుగా ఉంటుంది. టాకీ పార్ట్‌ పూర్తయి నిర్మాణానంతర కార్యక్రమాలు మిగిలినా.. అంత సమస్యగా అనిపించదు. కానీ సినిమా ఎక్కువ భాగం చిత్రీకరణ పూర్తి చేసి ఇంకాస్త మిగిలి ఉంది అనగా ఏదైనా అనుకోని సమస్య వస్తే ఆ చిత్రబృందం పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. కరోనా సెకండ్‌ వేవ్‌ అలాంటి దారుణమైన పరిస్థితుల్లోకే చిత్ర సీమను నెట్టేసింది. ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా అదుపులోకి రావడం, కరోనా కేసులు తగ్గడంతో మహారాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను పాటిస్తూ చిత్రీకరణలు చేసుకోవడానికి అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఎప్పుడెప్పుడు అనుమతులు వస్తాయా...మిగిలిన భాగాన్ని పూర్తి చేసేద్దామా అనుకుంటున్న బృందాలకు ఇది ఎంతో శుభవార్త. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సెట్లోకి అడుగుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.

కరోనా తొలి దశ తర్వాత నెమ్మదిగా తేరుకొని చిత్రీకరణలు మొదలుపెట్టిన చాలా సినిమాలు వేగంగా పూర్తి చేసే లక్ష్యంగా రంగంలోకి దిగాయి. రెండో దశ కరోనా ఆ ఆశలపై నీళ్లు చల్లేసింది. చిత్రీకరణలు చివరి దశకు చేరుకున్నాకా ఇలా జరగడంతో చిత్రబృందాలు తీవ్ర నిరాశకు    లోనయ్యాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చిత్ర బృందంలోని ఎవరో ఒకరికి కరోనా సోకడంతో షూటింగ్‌ ఆపాల్సి వచ్చేది. ఇక కరోనా తీవ్రత పెరిగాకా లాక్‌డౌన్‌ పెట్టేయడంతో బాలీవుడ్‌లో చిత్రీకరణలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇటీవల అనుమతులు రావడంతో ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి.

కత్రినా వస్తోంది: కత్రినాకైఫ్‌ కెరీర్‌లో టైగర్‌ సిరీస్‌ చిత్రాలు ఓ మైలురాయి. సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా నటించిన ‘ఏక్‌ థా టైగర్‌’, ‘టైగర్‌ జిందా హై’ చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఇందులో కత్రినా యాక్షన్‌ హంగామాకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఈ సిరీస్‌లో తెరకెక్కుతోన్న ‘టైగర్‌ 3’లోనూ ఆమె అంతే సందడి చేయనుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌   మీదకు వెళ్లనుంది. ఈ షెడ్యూల్‌ల్లోనే కత్రినా సెట్లోకి అడుగుపెట్టనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా సెట్‌ను తీర్చిదిద్దారు. దాన్ని ఉపయోగించే పరిస్థితి లేకపోయినా నిర్వహణ చేయాల్సి వచ్చింది. దీంతో సుమారు రూ.9 కోట్లు నష్టం వాటిల్లినట్టు సమాచారం. అందుకే సాధ్యమైనంత త్వరగా సినిమాని మళ్లీ మొదలుపెట్టి పూర్తి చేయాలని చిత్రబృందం ఆలోచనలో ఉంది.

గంగూబాయి...బిగ్‌బీ: అలియాభట్‌ ప్రధాన పాత్రలో సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. ఈ సినిమా కరోనా తొలి దశ నుంచి పలు సమస్యలు ఎదుర్కొంటూ చిత్రీకరణ జరుపుకొంటోంది. 90శాతం చిత్రీకరణ పూర్తయిపోయింది అనుకుంటుండగానే లాక్‌డౌన్‌  పెట్టడంతో ఆగిపోయింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ మళ్లీ మొదలు కానుంది. ఈ షెడ్యూల్‌లో అలియాపై ఓ ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించనున్నారు. ఇక అమితాబ్‌బచ్చన్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘గుడ్‌బై’ చిత్రీకరణ మరో వారంలో తిరిగి షురూ కానుంది. ఈ విషయాన్ని అమితాబ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఇంకా పలు చిత్రబృందాలు తిరిగి సెట్స్‌పైకి వెళ్లే తేదీని  నిర్ణయించుకోలేదు కానీ త్వరలోనే వెళ్లే అవకాశాలున్నాయి. వాటిలో ‘మేడే’, ‘బ్రహ్మాస్త్ర’, ‘ఆదిపురుష్‌’, ‘శెభాష్‌ మిథు’ లాంటి చిత్రాలున్నాయి.

టీకా తర్వాతే: ఎన్ని జాగ్రత్తలు పాటించి చిత్రీకరణ చేసినా ఏదో రూపంలో కొవిడ్‌ బాధ తప్పడం లేదు. దీంతో ఈసారి పక్కాగా ప్లాన్‌ చేస్తున్నాయి చిత్రబృందాలు. తమ యూనిట్‌ మొత్తానికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయ్యాకే చిత్రీకరణ మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాయి. ఆ దిశగా ఆదిత్య చోప్రా, కరణ్‌ జోహార్, రాజ్‌కుమార్‌ హిరాణీ లాంటి ఫిల్మ్‌ మేకర్స్‌ ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టేశారు. తమ బృందాల్లో కొందరికి వ్యాక్సినేషన్‌ రెండు డోసులూ పూర్తయ్యాయి. ఇంకా పలు చిత్రబృందాలకు వ్యాక్సినేషన్‌ కాలేదు. అదీ అయ్యాకా మరిన్ని సినిమాలకు సంబంధించిన షూటింగ్‌ విశేషాలు త్వరలో తెలియనున్నాయి.

‘పఠాన్‌’ వేగంగా: పలు భారీ చిత్రాలు సెట్లో అడుగుపెట్టడానికి సమాయత్తం అవుతున్నాయి. ‘పఠాన్‌’, ‘టైగర్‌ 3’, ‘గంగూబాయి కతియావాడి’, ‘బ్రహ్మాస్త్ర’, ‘మేడే’, ‘గుడ్‌బై’, ‘ఆది పురుష్‌’, శెభాష్‌ మిథు...ఇలా పలు చిత్రాలు షూటింగ్‌ కోసం సిద్ధమవుతున్నాయి. షారుఖ్‌ఖాన్‌ కథానాయకుడిగా సిద్థార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘పఠాన్‌’. షారుఖ్‌ నుంచి చాలా రోజుల విరామం తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను విదేశాల్లో తెరకెక్కించారు. లాక్‌డౌన్‌ ముందు వరకూ వేగంగా సాగిన ఈ సినిమా ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ నెల 21 నుంచి సెట్స్‌పైకి వెళ్లడానికి సిద్ధమవుతోంది. దీపికా పదుకొణె, జాన్‌ అబ్రహం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో డింపుల్‌ కపాడియా కీలక పాత్రల్లో నటిస్తున్నారట. 21 నుంచే ఆమె చిత్రీకరణలో పాల్గొంటారని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని