National Cinema Day: మల్టీప్లెక్స్‌లో రూ. 99కే సినిమా టికెట్‌.. ఆఫర్‌ ఆ ఒక్క రోజే!

‘నేషనల్‌ సినిమా డే’ పురస్కరించుకుని మల్టీప్లెక్స్‌ల్లో సినిమా టికెట్‌ ధరలు రూ.99కే అందుబాటులో ఉండనున్నాయి. ఏ రోజంటే?

Published : 21 Sep 2023 16:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎం.ఎ.ఐ) (Multiplex Association of India) సినీ అభిమానులకు శుభవార్త చెప్పింది. పీవీఆర్‌ ఐనాక్స్‌, సినీ పోలిస్‌, మిరాజ్‌, సిటీప్రైడ్‌, ఏషియన్‌, మూవీ టైమ్‌, వేవ్‌, ఎమ్‌2కే, డిలైట్‌ సహా 4వేలకు పైగా థియేటర్లలో రూ.99కే సినిమాలను ప్రదర్శించనున్నట్లు తెలిపింది. అక్టోబరు 13ను ‘నేషనల్‌ సినిమా డే’ (National Cinema Day)గా పేర్కొంటూ ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ఒక్క రోజే ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఆయా మల్టీప్లెక్స్‌ వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొంది. ఆయా థియేటర్లలో నేరుగా టికెట్‌ తీసుకుంటేనే రూ.99కి లభించనుంది. ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేయాల్సివస్తే టికెట్‌ ధరకు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. రిక్లెయినర్స్‌, ప్రీమియం ఫార్మాట్స్‌కు ఈ ఆఫర్‌ వర్తించదు.

ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!

ఎగ్జిబిటర్లకు దిశానిర్దేశం చేసే ఎం.ఎ.ఐ.. గతేడాది సెప్టెంబరు 23న నేషనల్‌ సినిమా డే సెలబ్రేషన్స్‌ చేసింది. ఆ ఒక్క రోజే 6.5 మిలియన్స్‌కుపైగా ఆడియన్స్‌ మల్టీప్లెక్స్‌ల్లో సినిమాలు చూశారు. తొలి ప్రయత్నం విజయవంతం కావడంతో ప్రేక్షకులకు మరోసారి ఆఫర్‌ ఇచ్చింది. కొవిడ్‌ రెండు వేవ్‌ల తర్వాత భారత్‌లో పూర్తిస్థాయిలో థియేటర్లు తెరచుకున్న రోజు కావడంతో సెప్టెంబరు 16ను సినిమా డేగా ప్రకటించి అనివార్యకారణాలతో సెప్టెంబరు 23కి వాయిదా వేశారు. ఇప్పుడు అక్టోబరు 13ని ఎంపిక చేశారు. ప్రస్తుతం విడుదలైన, త్వరలో విడుదలకానున్న చిత్ర బృందాలకు ఇది కలిసొచ్చే అంశమని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రామ్‌ ‘స్కంద’ (Skanda), రాఘవ లారెన్స్‌ ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2), వివేక్‌ అగ్నిహోత్రి తెరకెక్కించిన ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ (The Vaccine War) తదితర చిత్రాలు సెప్టెంబరు 28న, శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన ‘పెదకాపు 1’ (Peda Kapu-1), కిరణ్‌ అబ్బవరం ‘రూల్స్‌ రంజన్‌’ (Rules Ranjan) అక్టోబరు 6న విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. షారుక్‌ ఖాన్‌ ‘జవాన్‌’ బాక్సాఫీసు వద్ద సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని