Nani: మాస్‌ ‘దసరా’

బొగ్గు గనుల మధ్య నల్ల రంగు పులుముకుని బయటికొస్తున్న సూర్యుడిని గుర్తు చేస్తున్నాడు నాని. అచ్చమైన మాస్‌ అవతారంలో ఆయన ఎలా సందడి చేశాడో తెలియాలంటే ‘దసరా’ విడుదల వరకు ఆగాల్సిందే.

Updated : 02 Jul 2022 07:18 IST

బొగ్గు గనుల మధ్య నల్ల రంగు పులుముకుని బయటికొస్తున్న సూర్యుడిని గుర్తు చేస్తున్నాడు నాని (Nani). అచ్చమైన మాస్‌ అవతారంలో ఆయన ఎలా సందడి చేశాడో తెలియాలంటే ‘దసరా’ (Dasara) విడుదల వరకు ఆగాల్సిందే. నాని కథానాయకుడిగా... శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పునః ప్రారంభమైంది. హైదరాబాద్‌లో తీర్చిదిద్దిన ప్రత్యేకమైన సెట్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ప్రధాన తారాగణం అంతా అందులో పాల్గొంటోంది. గోదావరి ఖని సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో సాగే చిత్రమిది. నాని లుంగీ కట్టి, గెడ్డం పెంచి పక్కా అవతారంలో కనిపించనున్నారు. ‘‘పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చిత్రమిది. నాని తెలంగాణ యాసలో మాట్లాడటంతోపాటు.. పూర్తిస్థాయి యాక్షన్‌ ప్రధానమైన పాత్రలో కనిపిస్తారు. గత షెడ్యూల్‌లో అన్బరీవ్‌ ఆధ్వర్యంలో ఓ భారీ యాక్షన్‌ ఘట్టాన్ని తెరకెక్కించాం. నాని - కీర్తిసురేష్‌తోపాటు, 500 మంది డ్యాన్సర్లపై ప్రేమ్‌ రక్షిత్‌ నృత్య దర్శకత్వంలో ఓ పాటని చిత్రీకరించాం. సుదీర్ఘంగా సాగే ప్రస్తుత షెడ్యూల్‌ కీలకం. చిత్రం తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలవుతుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. సాయికుమార్‌, జరీనా వహాబ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సత్యన్‌ సూర్యన్‌, సంగీతం: సంతోష్‌ నారాయణన్‌, కూర్పు: నవీన్‌ నూలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని