Agent: ‘ఏజెంట్’తో ఢీ

కథానాయకుడు అఖిల్‌ అక్కినేని (Akhil) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఏజెంట్‌’ (Agent). సురేందర్‌ రెడ్డి తెరక్కిస్తున్నారు.

Updated : 15 Apr 2023 09:31 IST

కథానాయకుడు అఖిల్‌ అక్కినేని (Akhil) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఏజెంట్‌’ (Agent). సురేందర్‌ రెడ్డి తెరక్కిస్తున్నారు. సాక్షి వైద్య కథానాయిక. ఈ సినిమాలో డినో మోరియా ప్రతినాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని డినో ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఇందులో చేతిలో గన్‌తో ఏజెంట్‌తో తలపడనున్నట్లు కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు డినో. ఈ సందర్భంగా ఆయన తన పాత్ర గురించి మాట్లాడుతూ.. ‘ప్రేక్షకులు నన్ను లవర్‌బాయ్‌ ఇమేజ్‌లో ఎక్కువ కాలం చూసినప్పుడు, ఇప్పుడు విలన్‌గా ఉండటం అంత సులభం కాదు. కానీ, ఏజెంట్‌లో నేను యాక్షన్‌ పట్ల నాకున్న ప్రేమను చూపించాల్సి వచ్చింది. ప్రజలు షైబానీ ఖాన్‌ను ఎంతగా ఇష్టపడతున్నారో, ఇంకా ఎక్కువగా దీనిని ఇష్టపడతారని నేను కచ్చితంగా అనుకుంటున్నాను’ అని చెప్పారు. ఈ స్పై థ్రిల్లర్‌ చిత్రంలో మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. డినో ‘బాంద్రా’ సినిమాతో మలయాళంలోకి కూడా అడుగుపెట్టనున్నారు.


ఇతిహాసాల్ని సైన్స్‌తో ముడిపెట్టి..

అశోక్‌ రాజ్‌, రితికా రాజ్‌, శ్రష్టి వర్మ ప్రధాన పాత్రల్లో బాల పులిబోయిన తెరకెక్కిస్తున్న చిత్రం ‘ప్రచండ తరుణం కాఠిన్య కావ్యం’. పులిచర్ల నాగరాజు, రామచంద్ర, కొల్లకుంట నాగరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వినయ్‌ బిడ్డప్ప, ఉగ్రం మంజు, రవితేజ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సిద్ధార్థ్‌ మహేష్‌ క్లాప్‌ కొట్టగా.. రాజ్యలక్ష్మీ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. పరుచూరి గోపాలకృష్ణ స్క్రిప్ట్‌ అందించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘మన పురాణాలు, ఇతిహాసాల్ని.. సైన్స్‌తో ముడిపెడుతూ తయారు చేసిన స్క్రిప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రంతో ఓ సరికొత్త స్క్రీన్‌ప్లే విధానాన్ని పరిచయం చేయనున్నాం. మా ప్రయత్నం కచ్చితంగా విజయవంతమవుతుందని నమ్ముతున్నాం’’ అన్నారు. ఈ సినిమాకి సంగీతం: పెద్దపల్లి రోహిత్‌, ఛాయాగ్రహణం: నిరంజన్‌ దాస్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని