Hanuman: అక్కడ ‘సలార్‌’ రికార్డు బ్రేక్‌ చేసిన ‘హనుమాన్‌’.. టాప్‌ 10 జాబితాలో స్థానం

భారత్‌లోనే కాదు.. ఓవర్సీస్‌లోనూ ‘హనుమాన్‌’ హవా కొనసాగుతోంది. నార్త్‌ అమెరికాలో నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం మూడు మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది.

Published : 16 Jan 2024 16:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిన్న సినిమాగా విడుదలైన ‘హనుమాన్‌’ సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకోవడంతో థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. తాజాగా ఇది ఓవర్సీస్‌లో పెద్ద సినిమాల రికార్డులను బ్రేక్‌ చేసింది. నార్త్‌ అమెరికాలో నాలుగు రోజుల్లోనే 3 మిలియన్ల డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అక్కడ అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల జాబితాలో టాప్‌ 10లో స్థానం దక్కించుకుంది. అలాగే, నార్త్‌ అమెరికాలో మొదటి వీకెండ్‌ కలెక్షన్లలో ఈ చిత్రం ‘సలార్‌’, ‘బాహుబలి’ రికార్డులను దాటేసింది.

ఈ వారం థియేటర్‌లో కొత్త సినిమాల్లేవ్‌... ఓటీటీలో ఏకంగా 22 చిత్రాలు/సిరీస్‌లు

ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100కోట్లు వసూలు చేసింది. ఈ పోస్టర్‌ను షేర్ చేసిన దర్శకుడు ‘రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన మొదటి సినిమా’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు చెప్పారు. మరోవైపు ‘హనుమాన్‌’పై ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా చూసిన చిరంజీవి.. తనను అభినందిస్తూ మెసేజ్‌ పెట్టినట్లు తేజ సజ్జ ఇటీవల తెలిపారు. తాజాగా రామ్ పోతినేని ఈ చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్పారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన ‘హనుమాన్‌’ హవానే కనిపిస్తుందన్నారు. ‘మీ శ్రమకు తగ్గ ఫలితం దక్కింది. ప్రశాంత్‌ వర్మ తన విజన్‌తో అద్భుతాన్ని సృష్టించారు. ఈ సక్సెస్‌కు మీరంతా అర్హులు’ అని నటి రాధిక ఎక్స్‌లో పేర్కొన్నారు. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రంలో హనుమంతు పాత్రలో తేజ సజ్జ ఆకట్టుకుంటున్నారు. సూపర్‌ హీరో కథను ఇతిహాసంతో ముడిపెట్టి.. నేటివిటీ మిస్‌ కాకుండా చూపించడంతో ప్రేక్షకులు దీనికి క్యూ కడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని