Ram Charan: నాటు నాటు.. దేశ ప్రజల పాట: రామ్‌చరణ్‌

ఆస్కార్‌ గెలిచిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) బృందానికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. దిల్లీలో కథానాయకుడు రామ్‌చరణ్‌(Ram Charan)కి, హైదరాబాద్‌లో దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి(Rajamouli), సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి(Keeravani) కుటుంబ సభ్యులకి అభిమానులు స్వాగతం పలికారు.

Updated : 18 Mar 2023 06:56 IST

ఆస్కార్‌ గెలిచిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బృందానికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. దిల్లీలో కథానాయకుడు రామ్‌చరణ్‌(Ram Charan)కి, హైదరాబాద్‌లో దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి(Rajamouli), సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి కుటుంబ సభ్యులకి అభిమానులు స్వాగతం పలికారు. ఇటీవల లాస్‌ ఏంజెలెస్‌లో జరిగిన ఆస్కార్‌ వేడుకల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బృందం పాల్గొన్న సంగతి తెలిసిందే. కథానాయకుడు ఎన్టీఆర్‌ ఈ నెల 15నే హైదరాబాద్‌కి చేరుకున్నారు.  రాజమౌళి, కీరవాణి ఇతర బృందం శుక్రవారం తెల్లవారు జామున హైదరాబాద్‌ తిరిగొచ్చారు. మరో కథానాయకుడు రామ్‌చరణ్‌ తన భార్య ఉపాసనతో కలిసి దిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయన్ని చుట్టుముట్టి అభినందనలు తెలిపారు.

* దేశంలోని నలు దిక్కుల ప్రజలు ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ (RRR) సినిమాని చూడటంతోనే ఇంతటి విజయం సాధ్యమైందన్నారు రామ్‌చరణ్‌. ‘నాటు నాటు’ మాది కాదని, ఇది భారతీయులందరి పాట అని, ఆస్కార్‌ కోసం మాకు అవకాశాన్ని కల్పించిన పాట అన్నారు. దిల్లీ విమానాశ్రయంలో రామ్‌చరణ్‌ (ram Charan) విలేకర్లతో మాట్లాడారు. ‘‘మేం చాలా సంతోషంగా ఉన్నాం. ఎం.ఎం.కీరవాణి, ఎస్‌.ఎస్‌.రాజమౌళి, చంద్రబోస్‌ల విషయంలో గర్వపడుతున్నాం. వారి కారణంగానే మేం రెడ్‌ కార్పెట్‌పై నడిచి దేశానికి ఆస్కార్‌ తీసుకొచ్చాం. ‘నాటు నాటు’ లైవ్‌ ప్రదర్శనలో డ్యాన్స్‌ చేయడానికి నేను వందశాతం సిద్ధంగానే ఉన్నాను. కారణం ఏంటో తెలియదు కానీ నాకు ఆహ్వానం రాలేదు. అవన్నీ పక్కనపెడితే వేదికపై ఆ పాటకు డ్యాన్స్‌ చేసిన బృందం మాత్రం అదరగొట్టేశారు’’ అన్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని నాటు నాటు... పాటకి ఉత్తమ ఒరిజినల్‌ పాట విభాగంలో ఆస్కార్‌ పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. స్వరకర్త కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌ ఈ పురస్కారాన్ని స్వీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని