కథానాయికల చుట్టూ బిగుస్తున్న ఈడీ ఉచ్చు!

మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా కేసును మరో కోణంలో విచారించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు రంగప్రవేశం చేశారు. కథానాయికలు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలపై ...

Updated : 13 Sep 2020 09:00 IST

విచారణకు ముందడుగు వేసిన కేంద్ర బృందం

బెంగళూరు (యశ్వంతపుర): మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా కేసును మరో కోణంలో విచారించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు రంగప్రవేశం చేశారు. కథానాయికలు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలపై ప్రత్యేకంగా కేసు దాఖలు చేసి వివరాల సేకరణ ప్రారంభించారు. ఆ ఇద్దరూ బినామీ పేర్లతో అడ్డగోలు ఆదాయార్జనకు దిగినట్లు అనుమానించి.. ఆ కోణంలో విచారణ మొదలుపెట్టారు. దాఖలాల సేకరణ అనంతరం ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారించే అవకాశాలున్నాయి. కోట్లాది రూపాయల వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా సాగుతుండటంతో స్వయం ప్రేరితంగా కేసు దాఖలు చేసినట్లు కర్ణాటక- గోవా విభాగ ఈడీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం సీసీబీ కస్టడీలో ఉన్న వీరేశ్‌ఖన్నా, రాహుల్‌, ప్రశాంత్‌ రంకా, ప్రతీక్‌శెట్టినీ విచారిస్తారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు అవకాశం ఇవ్వాలని న్యాయస్థానానికి విన్నవించారు.

రాగిణి రగడ..:

మడివాళ మహిళ సంరక్షణ పునర్వసతి కేంద్రంలో ఉన్న సినీ తారలు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ పరస్పరం గొడవపడుతున్నట్లు సమాచారం. ‘నీవల్లంటే.. నీవల్లే అంతా జరిగింది’ అంటూ పోట్లాడుతున్నారని తెలిసింది. మరోవైపు రాగిణి ఆరోగ్య వివరాల గుర్తింపు కోసం ఆమె మూత్ర పరీక్ష వేళ వైద్యులు శనివారం అగచాట్ల పాలయ్యారు. వైద్య సిబ్బంది అందించిన చిన్నపాటి సీసాలో ఆమె మంచినీరు పట్టి తెచ్చి ఇచ్చాక.. అసలు విషయం తెలిసి వైద్యులు తలలు పట్టుకున్నారు. ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి ఓ రక్షకభటురాలి సాయంతో మరోసారి ఆ పరీక్షలు సవ్యంగా నిర్వహించాక.. ఊపిరి పీల్చుకున్నారు.

మాదక ద్రవ్యాల కేసులో అరెస్టైన నిందితులు రవిశంకర్‌, రాహుల్‌, వైభవ్‌జైన్‌, ప్రశాంత్‌ రంకా, నియాజ్‌, ప్రతీక్‌ శెట్టిలకూ కేసీ జనరల్‌ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తం, మూత్రం, తల వెంట్రుకల నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించారు.

మాదక ద్రవ్యాల కేసులో నగరానికి చెందిన వైభవ్‌ జైన్‌ అనే బంగారు వ్యాపారిని సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. సినీ నటి రాగిణి ద్వివేదికి అప్తుడిగా ఈ నిందితుడు గుర్తింపు పొందాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని