Selvaraghavan: ధనుష్‌తో దర్శకులకి చాలా సౌకర్యం

సినిమా తీతలో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని సొంతం చేసుకున్న దర్శకుడు... సెల్వ రాఘవన్‌. సహజత్వానికి పెద్ద పీట వేస్తూ, చూసే ప్రేక్షకుడికి ‘మన కథే’ అనిపించేలా సినిమాలు తీస్తుంటారాయన. ఆయన సినిమాలు తమిళంతోపాటు, తెలుగులోనూ

Updated : 25 Sep 2022 08:18 IST

సినిమా తీతలో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని సొంతం చేసుకున్న దర్శకుడు... సెల్వ రాఘవన్‌ (Selvaraghavan). సహజత్వానికి పెద్ద పీట వేస్తూ, చూసే ప్రేక్షకుడికి ‘మన కథే’ అనిపించేలా సినిమాలు తీస్తుంటారాయన. ఆయన సినిమాలు తమిళంతోపాటు, తెలుగులోనూ విడుదలవుతుంటాయి. తన తమ్ముడు ధనుష్‌ (Dhanush) కథానాయకుడిగా... సుదీర్ఘ విరామం తర్వాత ఓ సినిమా చేశారు. అది ‘నేనే వస్తున్నా’ (Nene Vasthunna) పేరుతో తెలుగులో ఈ నెల 29న గీతా ఆర్ట్స్‌ సమర్పణలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా సెల్వ రాఘవన్‌ శనివారం విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

‘‘ధనుష్, నేను కలిసి సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాం. మేమిద్దరం కలిసి సినిమా చేయాలనేది మా అమ్మ కోరిక కూడా. ధనుష్‌ పెద్ద స్టార్‌ అయిపోయాడు. తన డేట్స్‌ దొరకడం అంత సులభం కాదు ఇప్పుడు. అదే సమయంలో మా ఇద్దరికీ తగ్గ కథ కూడా కుదరాలి. దాదాపు పదేళ్ల తర్వాత మేం కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. మొదట ‘పుదు పెట్టై2’ చేయాలనుకున్నాం. తర్వాత వేరే ఆలోచన వచింది. నాతో కలిసి ఓ సినిమా రాయాలని ధనుష్‌కి ఎప్పట్నుంచో కోరిక. తొలిసారి ఈ సినిమాని ఇద్దరం కలిసి రాశాం. మా ఇద్దరి ఆలోచనలు దాదాపుగా ఒకేలా ఉంటాయి’’.

* ‘‘నా ఆలోచన నుంచి పుట్టిన కథే.. ‘నేనే వస్తున్నా’. కథ, కథనాల కంటే కూడా... ధనుష్‌ ద్విపాత్రాభినయం విషయంలో ఎక్కువ సవాళ్లు ఎదురయ్యాయి. రెండు విభిన్నమైన పాత్రలు, ఒకేసారి తెరపై కనిపిస్తుంటాయి. ఆ పాత్రల్ని ఇద్దరు వేర్వేరు నటులు చేసినట్టే ఉండాలి. ఒకపాత్ర నుంచి మరో పాత్రకి మారిపోయి నటించడం ఓ పెద్ద సవాల్‌. అయితే ధనుష్‌తో పని చేయడం దర్శకులకి చాలా సౌకర్యం. తనకి పెద్దగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. ప్రతీ విషయాన్నీ దృష్టిలో పెట్టుకుని నటిస్తుంటాడు. తను నాకు తమ్ముడే అయినా మేం సెట్‌కి వెళ్లాక నటుడు, దర్శకుల్లాగే మెలుగుతాం. 20 యేళ్లుగా అలా పనిచేయడమే తెలుసు. తను తమ్ముడైనంత మాత్రాన నాకు సెట్లో అదనంగా ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు. మేం ఇద్దరం కొన్ని సన్నివేశాల గురించి వాదించుకుంటాం కూడా. ‘నేనే వస్తున్నా’ గీతా ఆర్ట్స్‌ నుంచి విడుదలవుతుండడం ఓ గౌరవం. మంచి కథ ఉంటే చెప్పండంటూ ప్రోత్సహిస్తుంటారు నిర్మాత అల్లు అరవింద్‌’’.

* ‘‘చిత్రసీమలో ఇప్పుడున్న దశ ప్రత్యేకమైనది. సినిమాల మధ్య హద్దులు చెరిగిపోయాయి. దక్షిణాది సినిమా ఇప్పుడు భారతీయ సినిమా అయ్యింది. రాజమౌళి, సుకుమార్‌ తదితర దర్శకుల ఆలోచనలతోనే ఇది సాధ్యమైంది. వాళ్లని కథానాయకులు కూడా అదే స్థాయిలో నమ్మారు. ఇది ముమ్మాటికీ వేడుక సమయం. మరిన్ని చిత్రాలు వస్తాయనే నమ్మకం ఉంది. మనవైన కథలతోనే అందరికీ వినోదం పంచుతున్నాం. ‘యుగానికి ఒక్కడు’ సినిమా అప్పటి పరిస్థితులకి తగ్గట్టుగా నేను తీశా. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో ఇప్పుడు మరింత బాగా తీస్తాననిపిస్తుంది. అలాంటి చిత్రాల్ని తీయడం ఇప్పుడు మరింత సులభంగా మారింది. ‘యుగానికి ఒక్కడు’కి కొనసాగింపు ఆలోచన ఉంది. అన్నీ కుదిరితే చేస్తానేమో. మనకు తెలిసిన గొప్ప సామ్రాజ్యాల్లో చోళ సామ్రాజ్యం ఒకటి. చోళ సామ్రాజ్యం నేపథ్యం ఒక్కటే తప్ప, రానున్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌’కీ... నా ‘యుగానికి ఒక్కడు’ సినిమాకీ ఎలాంటి సంబంధం ఉండదు’’.

‘‘నటుడిగా 17, 18 యేళ్ల వయసులో తెరకు పరిచయమయ్యాడు ధనుష్‌. అప్పట్లో తనకి ఏవైనా సలహాలు ఇచ్చేవాణ్ని కానీ, ఇప్పుడు ఆ అవసరం లేదు. కాకపోతే తను చేసే సినిమాల గురించి చెబుతుంటాడు. నేను అనుకోకుండానే నటుడినయ్యా. ‘సాని కాయిదం’లో నేను నటిస్తేనే బాగుంటుందని ఆ చిత్ర దర్శకుడు పట్టుబట్టాడు. దాంతో అదొక కొత్త అనుభవంలా ఉంటుందని నటించా. ‘నేనే వస్తున్నా’లో కూడా ఓ చిన్న పాత్ర చేశాను. దర్శకత్వంపైనే నా దృష్టంతా. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ తర్వాత తెలుగు సినిమా చేయలేదని అడుగుతుంటారు. కానీ నా సినిమాల చిత్రీకరణ ఎక్కువగా హైదరాబాద్‌లోనే జరుగుతుంటాయి. దాంతో తెలుగు సినిమా చేస్తున్నట్టే ఉంటుంది. మంచి కథ కుదిరితే తప్పకుండా తెలుగులో సినిమా చేస్తా’’.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts