Sonu Sood: నా హృదయం ముక్కలయ్యేది

కరోనా కష్టకాలంలో అతడే ఒక సైన్యంలా మారి ఎంతోమంది బాధితుల ప్రాణాలు కాపాడుతున్నారు రియల్‌ హీరో సోనూసూద్‌. గతేడాది లాక్‌డౌన్‌ నుంచి సామాన్య ప్రజల కోసం నిర్విరామంగా శ్రమిస్తున్న ఆయన తాజాగా...

Updated : 24 May 2021 10:55 IST

సరైన సమయంలోనే వాళ్లు కాలం చేశారు

ముంబయి: కరోనా కష్టకాలంలో అతడే ఒక సైన్యంలా మారి ఎంతోమంది బాధితుల ప్రాణాలు కాపాడుతున్నారు రియల్‌ హీరో సోనూసూద్‌. గతేడాది లాక్‌డౌన్‌ నుంచి సామాన్య ప్రజల కోసం నిర్విరామంగా శ్రమిస్తున్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. గతేడాదిలో పోలిస్తే కరోనా సెకండ్‌వేవ్‌ కారణంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా సరైన వసతుల్లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటే.. అది చూసి తాను చలించిపోయినట్లు వివరించారు.

‘కరోనా సెకండ్‌వేవ్‌లో దేశవ్యాప్తంగా పరిస్థితులు ఎంతో క్లిష్టంగా మారాయి. ఆసుపత్రుల్లో పడకలు దొరక్క, ప్రాణవాయువు అందక ప్రజలు పడుతున్న ఇబ్బందులు నన్ను ఆవేదనకు గురి చేశాయి. తమ కుటుంబసభ్యుల్ని, ఆప్తుల్ని, ప్రియమైన వారిని కోల్పోయి ప్రతిరోజూ ఎంతో మంది కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ పరిస్థితులన్ని చూశాక.. నా తల్లిదండ్రులు సరైన సమయంలో కన్నుమూశారని భావిస్తున్నాను. ఒకవేళ వాళ్లే కనుక ఇప్పుడు బతికి ఉండి ఉంటే.. ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఎదురైతే.. ఆసుపత్రుల్లో పడకలు దొరక్క.. ఆక్సిజన్‌ దొరక్క వాళ్లు పడే ఇబ్బంది చూసి నా హృదయం ముక్కలయ్యేది’

‘లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికులకు నాకు చేతనైనంత సాయం అందించాను. అసలైన సంతోషమంటే ఏమిటో దానివల్ల నాకు తెలిసివచ్చింది. ఇప్పటికైనా రాజకీయ నాయకులందరూ ఒకరిపై ఒకరు బురద చల్లుకునే ప్రయత్నాలు మాని ఐక్యంగా కలిసి ప్రజలకు సాయం అందించాలి’ అని సోనూ వివరించారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయించడానికి సోనూ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని