నొప్పిలేకుండా చావు: గూగుల్‌లో వెతికిన సుశాంత్‌

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య ఘటనపై విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. ఆత్మహత్య ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు

Updated : 18 Nov 2022 11:47 IST

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య ఘటనపై విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. సుశాంత్‌ వాడిన సిమ్‌కార్డులు ఆయన పేరు మీద లేనట్లు ఇప్పటికే గుర్తించగా, ఇప్పుడు మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. నొప్పిలేకుండా చనిపోవడం ఎలాగో సుశాంత్‌ గూగుల్‌లో శోధించాడని ముంబయి పోలీసు కమిషనర్‌ సంజయ్‌ బ్రావో తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

‘‘సుశాంత్‌ చనిపోవడానికి ఐదు రోజుల ముందు ఆయన మాజీ మేనేజర్‌ దిశా షాలిని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనతో సుశాంత్‌కు సంబంధం ఉన్నట్లు పలు వార్తలు వెలువడ్డాయి. దీంతో అతను తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. చనిపోవడానికి రెండు గంటల ముందు తన పేరు మీద గూగుల్‌లో శోధించాడు. దిశ ఆత్మహత్య ఘటనపై ఎలాంటి వార్తలు వచ్చాయి? ఏయే వార్తల్లో తన పేరుంది? తదితర విషయాలను వెతికాడు. ఆ ఆర్టికల్స్‌ అన్నీ చదివాడు. ఆ తర్వాత నొప్పిలేకుండా చనిపోవడం ఎలా? మానసిక ఒత్తిడి సమస్యలు తదితర విషయాలపై కూడా గూగుల్‌ వెతికాడు’’ అని సంజయ్‌ వెల్లడించారు.

అంతేకాదు, షాలిని ఆత్మహత్య ఘటనపై మాట్లాడుతూ.. ‘దిశా షాలిని చనిపోయే ముందు రోజు రాత్రి ఆమె ప్రియుడి నివాసంలో పార్టీ జరిగింది. ఆ తర్వాత తెల్లవారుజామున 3గంటలకు ఆమె ఆత్మహత్య చేసుకుంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఈ కేసు విశ్లేషించాం. దిశా ప్రియుడు సహా ఐదుగురు వ్యక్తులు ఈ పార్టీలో పాల్గొన్నారు. వారిని అదుపులోకి తీసుకున్నాం. అందులో రాజకీయ నాయకులు ఎవరూ లేరు’’ అని తెలిపారు. దిశ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు జరిగిన పార్టీలో ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు కూడా ఉన్నాడని వార్తలు వచ్చిన నేపథ్యంలో పోలీస్‌ కమిషనర్‌ దీనిపై స్పష్టతనిచ్చారు.

సుశాంత్‌ చనిపోవడానికి ఆరు రోజుల ముందు అతడి ఇంటి నుంచి స్నేహితురాలు రియా చక్రవర్తి వెళ్లిపోయిన ఘటనపైనా కమిషన్‌ వివరణ ఇచ్చారు. ‘‘జూన్‌ 8న సుశాంత్‌ ఇంటి నుంచి రియా చక్రవర్తి వెళ్లిపోయింది. అప్పుడు ఆమె మానసిక స్థితి సరిగా లేదు. ఆ తర్వాత సుశాంత్‌ సోదరి ఆయన ఇంటికి వచ్చారు. జూన్‌ 13వ తేదీ వరకూ ఆమె అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ఆమె కుమార్తెకు పరీక్షలు ఉండటంతో వెళ్లిపోయారు. ఇదే విషయాన్ని సుశాంత్‌ సోదరి తన వాంగ్మూలంలో తెలిపారు’’ అని సంజయ్‌ పేర్కొన్నారు.

మరోవైపు సుశాంత్‌ కుటుంబంతో రియా చక్రవర్తికి ఉన్న వివాదంపైనా సంజయ్‌ మాట్లాడారు. సుశాంత్‌ కుటుంబంతో ఆమెకు స్వల్ప వివాదాలు ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకూ రెండుసార్లు రియా వాంగ్మూలాన్ని నమోదు చేశామన్నారు. సుశాంత్‌ను తాను ఎలా కలిసింది? ఎలా సన్నిహితంగా ఉన్నదీ? సుశాంత్‌ మానసిక పరిస్థితి, యూరప్‌ ట్రిప్‌ తదితర విషయాలను రియా పోలీసులకు తెలిపిందన్నారు. మరోసారి సుశాంత్‌ కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం చేయగా, వారు మాట్లాడేందుకు ఆసక్తి చూపలేదని అన్నారు.

సుశాంత్‌ కేసు దర్యాప్తు అధికారికి బలవంతపు క్వారంటైన్‌

మరోవైపు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ కేసు విచారణ నిమిత్తం బిహార్‌ నుంచి వచ్చిన ఐపీఎస్‌ అధికారి వినయ్‌ తివారీని బలవంతంగా క్వారంటైన్‌కు పంపారంటూ ఆరోపణలు చోటుచేసుకున్నాయి. తన కుమారుడిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారంటూ నటుడి తండ్రి కేకే సింగ్‌ బిహార్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ విషయమై విచారణ జరిపేందుకు తివారీ నేతృత్వంలోని పోలీసు బృందం ఆదివారం ముంబయి చేరుకుంది.

‘‘అధికారిక విధుల్లో భాగంగా పట్నా నుంచి వచ్చిన పోలీసు బృందానికి నాయకత్వం వహిస్తున్న ఐపీఎస్‌ అధికారి వినయ్‌ తివారీని.. బీఎంసీ అధికారులు బలవంతంగా ఆదివారం రాత్రి 11 గంటలకు క్వారంటైన్‌కు తరలించారు. తనకు ఐపీఎస్‌ మెస్‌లో వసతి కల్పించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేసినప్పటికీ లభించకపోవటంతో.. ఆయన కోరెగావ్‌లోని ఓ అతిథి గృహంలో ఉన్నారు’’ అని బిహార్‌ డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. దీనిపైనా సంజయ్‌ స్పందించారు. ఈ కేసు విచారణలో బిహార్‌ పోలీసులకు ఎలాంటి అధికారమూ లేదని వెల్లడించారు. దీనిపై న్యాయపరమైన అభిప్రాయాన్ని తీసుకోనున్నట్లు తెలిపారు. తాము ఎవరికీ క్లీన్‌ చిట్‌ ఇవ్వలేదన్నారు. అదే సమయంలో సుశాంత్‌ తండ్రి చేసిన ఫిర్యాదు తమకు అందలేదని వివరించారు. ముంబయి ఐపీఎస్‌ ఆఫీస్‌ వినయ్‌ తివారీని క్వారంటైన్‌కు పంపడంలో తమ ప్రమేయం లేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని