నెగిటివ్‌ రోల్‌లో మెప్పించి.. స్టార్‌గా ఎదిగి..

15 ఏళ్ల వయసులోనే ముఖానికి రంగులద్దుకుని కథానాయికగా ఎంట్రీ ఇచ్చి.. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు నటి తమన్నా భాటియా. మొదటి చిత్రంతో పరాజయాన్ని అందుకున్న తమన్నా..

Updated : 21 Dec 2020 09:59 IST

బర్త్‌డే గర్ల్‌ తమన్నా.. ఈ విషయాలు తెలుసా

ఇంటర్నెట్‌డెస్క్‌: 15 ఏళ్ల వయసులోనే కథానాయికగా ఎంట్రీ.. మొదటి చిత్రమే పరాజయం.. ఎన్నో ఆశలతో హీరోయిన్‌గా ఎదగాలని రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టిన అమ్మాయిలకు తొలి చిత్రమే పరాజయం పాలైతే మానసికంగా ఎంతో కుంగిపోతారు. కానీ, ఆమె ఒడిదొడుకులను ఎదుర్కొంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. తన నటనతో మెప్పించింది. వరుస అవకాశాలు దక్కించుకుంటూ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది మిల్కీ బ్యూటీ తమన్నా. ఆమె సినీ కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు చాలామందికి తెలుసు. అయితే, నేడు తమన్నా పుట్టినరోజు సందర్భంగా ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఆమె మాటల్లోనే...

వార్షికోత్సవంలో వచ్చిన ఆఫర్‌..

సంతోష్ భాటియా, రజనీ దంపతులకు 1989 డిసెంబర్‌ 21న తమన్నా జన్మించారు. ఆమె తండ్రి వజ్రాల వ్యాపారవేత్త. ఆమెకు ఆనంద్‌ అనే అన్నయ్య కూడా ఉన్నారు. ఆమె ముద్దుపేరు తమ్మూ

‘‘మనేక్జి కూపర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ పాఠశాలలో చదువుకుంటున్న సమయంలో నాకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ఆ స్కూల్ వార్షికోత్సవంలో నన్ను చూసిన ఓ ప్రముఖ వ్యక్తి నాకు సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చారు. అప్పుడు నా వయసు 15 సంవత్సరాలు. ‘చాంద్‌ సా రోషన్ చెహ్రా’ అనే బాలీవుడ్‌ చిత్రంతో 2005లో కథానాయికగా వెండితెరకు పరిచయమయ్యాను. అప్పటి నుంచి ఎన్నో విభిన్నమైన కథల్లో నటిస్తున్నాను. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్ని సంవత్సరాలయ్యిందని ఎప్పుడూ లెక్కపెట్టుకోలేదు. చేసే ప్రతి ప్రాజెక్ట్‌.. నాకు తొలి సినిమాలాగే ఉంటుంది. ఇంకా ఎన్నో నేర్చుకోవాలి.’’

నాన్న విమర్శలు.. అన్నయ్యంటే భయం..

2005లో బాలీవుడ్‌ చిత్రం ‘చాంద్‌ సా రోషన్ చెహ్రా’తో హీరోయిన్‌గా మొదటిసారి వెండితెరకు పరిచయమైన తమన్నా.. అదే ఏడాది ‘శ్రీ’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు.

‘‘మా నాన్న.. నేను నటించిన చిత్రాలను చాలా అరుదుగా చూస్తారు. కానీ ఆయన మంచి విమర్శకుడు. నేను వేసుకున్న మేకప్ దగ్గర్నుంచి, ఎంపిక చేసుకున్న పాత్ర వరకూ అన్నింటినీ ఆయన పరిశీలించి నాకు చెబుతుంటారు. ఎందుకు అలాంటి మేకప్‌ వేసుకున్నావ్‌? ఇలాంటి పాత్ర చేశావెందుకు? అని ప్రశ్నిస్తుంటారు. ఇంకా మా అన్నయ్య ఆనంద్‌.. నేను నటించిన సినిమా చూస్తున్నాడంటే నాకు ఒకటే భయం. అతనికి ఏమనిపిస్తే అది ముఖం మీదే చెప్పేస్తుంటాడు. ఇలా చేశావేంటి? నీకు అసలు నటనే రాదు అనేస్తాడు.’’

వావ్‌.. సంప్రదాయ దుస్తులు..

2006లో విడుదలైన ‘కేడీ’తో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన తమన్నా. తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇలియానా కథానాయికగా నటించిన ఈ సినిమాలో తమన్నా ప్రతినాయిక లక్షణాలు ఉన్న పాత్రలో నటించారు.

‘‘కథానాయికగా నేను అన్నిరకాల దుస్తులను ధరించాల్సి వస్తుంది. దీనివల్ల నాకు అటు ట్రెండీగా ఉండే ఫ్యాషన్‌ వస్త్రాలతో పాటు.. ఇటు సంప్రదాయ దుస్తులూ నచ్చుతాయి. పరికిణీ అంటే నాకెంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. ‘100% లవ్‌ ’ చిత్రంలో నాకెంతో ఇష్టమైన లంగావోణిలోనే ఎక్కువ సన్నివేశాల్లో కనిపిస్తాను.’’

మేమిద్దరం కలిస్తే..

‘ఇండస్ట్రీలో ఉన్న అందరితోనూ నేను బాగా మాట్లాడతాను. ముఖ్యంగా పరిశ్రమకు చెందిన వారిలో కాజల్‌ నా బెస్ట్‌ ఫ్రెండ్‌. మేమిద్దరం ఎప్పుడు ఎక్కడ కలిసినా సరే మా మధ్య మాటలు అలా సాగిపోతుంటాయి. అలాగే శ్రుతిహాసన్‌, సమంత.. కూడా నాకు స్నేహితులు. కథానాయకుల విషయానికి వస్తే ప్రభాస్‌ నాకు మంచి మిత్రుడు. ఇక ముంబైలోని మా అపార్ట్‌మెంట్‌లో ఉండే వారందరూ నాకు దోస్తులే.’

మిల్కీబ్యూటీ.. ఇబ్బందే..

‘‘నన్ను ఇష్టపడే ఎంతో మంది అభిమానులు నన్ను ‘మిల్కీ బ్యూటీ’ అని పిలుస్తుంటారు. కానీ నిజం చెప్పాలంటే.. ‘మిల్కీ బ్యూటీ’ అంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే శరీరఛాయను ఆధారంగా చేసుకుని ఓ మనిషిని ముద్దుపేర్లతో పిలవడం నాకు ఇష్టం ఉండదు.’’

నిద్ర.. ఫిట్‌నెస్‌.. సోషల్‌మీడియా

‘‘షూటింగ్స్‌ ఏమీ లేనప్పుడు.. ఖాళీ సమయం దొరికితే నాకు బద్ధకం వచ్చేస్తుంది. ఇంట్లో నుంచి బయటకు కూడా వెళ్ల బుద్ధి కాదు. ముంబయిలో ఉన్న నా స్నేహితులు.. ‘నువ్వు ఎందుకే బయటకు రావు’ అని తెగ బాధపడిపోతుంటారు. ఇంట్లో ఉంటే టీవీ కూడా చూడాలనిపించదు. మార్నింగ్‌ ఫిట్‌నెస్‌కు సంబంధించిన వర్కౌట్లు చేస్తా. మొదట్లో అప్పుడప్పుడూ సోషల్‌మీడియా అకౌంట్లు తిరగేసే దాన్ని. కానీ లాక్‌డౌన్‌ సమయంలో ఇన్‌స్టా, ట్విటర్‌.. ఎక్కువగా ఫాలో అవుతున్నా.’’

డ్యాన్స్‌ ఇక్కడే నేర్చుకున్నా..

‘‘చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే ఆసక్తి ఉంది. మ్యూజిక్‌ వినపడితే చాలు.. వెంటనే స్టెప్పులేసేయాలనిపించేది. పాటలు కూడా పాడేస్తుంటాను. కానీ, డ్యాన్స్‌ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదు. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చేయడం వల్ల.. సెట్స్‌లోనే డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేసేదాన్ని. సెట్‌లో చేసిన ప్రాక్టీస్‌తోనే డ్యాన్స్‌ నేర్చుకున్నా. ‘జై లవకుశ’లోని ‘స్వింగ్‌ జరా’, ‘సరిలేరు నీకెవ్వరు’లోనా పార్టీ సాంగ్‌ ప్రేక్షకులకు ఎంతో బాగా నచ్చాయి.’’

అమెరికా ప్రయాణం..

‘‘షూటింగ్స్‌లో భాగంగా వేరే దేశాలకు వెళ్లి వస్తుంటాను. షెడ్యూల్‌లో భాగంగా అక్కడ ఉన్నన్ని రోజులు లొకేషన్స్‌లో మాత్రమే ఉంటాం. ఏ దేశానికైతే వెళ్తానో.. అక్కడ పేరుపొందిన ప్రాంతాలను చూడాలని ప్రతిసారీ అనుకుంటాను. ఎప్పుడూ కుదరలేదు. కానీ నాకు అమెరికా అంటే ఎంతో ఇష్టం. హాలీడే కోసం అక్కడి వెళ్తుంటాను.’’

సినిమా టు ఓటీటీ..

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వెంటనే నాలుగు వరుస పరాజయాల అనంతరం నటిగా తనని తాను నిరూపించుకోవడానికి తమన్నాకు దొరికిన అవకాశం ‘హ్యాపీడేస్‌’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా తమన్నాకి విజయాన్ని అందించింది. దాంతో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్‌ను సొంతం చేసుకుంది. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘100% లవ్‌’, ‘బద్రినాథ్‌’, ‘ఊసరవెల్లి’, ‘రచ్చ’, ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’, ‘బాహుబలి’, ‘ఊపిరి’, ‘ఎఫ్‌2’.. చిత్రాలు ఆమెకు బాగా పేరు తెచ్చిపెట్టాయి. గతేడాది  విడుదలైన ‘సైరా’లోని లక్ష్మి పాత్ర ఆమెలోని నటికి నిదర్శనంగా నిలిచింది. వరుస సినిమాల్లో నటిస్తూనే.. పలు సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌లో కూడా ఆమె ఆడిపాడారు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘సిటీమార్‌’, ‘అంధాధున్‌’ రీమేక్‌, ‘గుర్తుందా సీతాకాలం’, ‘ఎఫ్‌3’ చిత్రాలు ఉన్నాయి. మరోవైపు ఆమె ‘లెవన్త్‌ అవర్‌’తో ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.

ఇండియన్‌ ఐడిల్‌-1 విజేత అభిజీత్‌ సావంత్‌తో కలిసి ఓ ఆల్బమ్‌లో తమన్నా ఆడిపాడారు. 2005లోనే ఇది విడుదలయ్యింది.

 

ఇవీ చదవండి..

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని