Sivasankar: శివశంకర్ కుటుంబానికి చిరంజీవి ఆర్థిక సాయం 

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న చిరంజీవి చలించిపోయారు.

Updated : 26 Nov 2021 20:07 IST

హైదరాబాద్‌: ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌(sivasankar) ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని చిరంజీవి చలించిపోయారు. శివశంకర్‌ చిన్న కుమారుడు అజయ్‌ని తమ ఇంటికి ఆహ్వానించి ఉదారతను చాటుకున్నారు. తనవంతు సాయంగా రూ.3 లక్షల చెక్కును అజయ్‌కు అందించారు. శివశంకర్‌ చికిత్సకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంగారు పడొద్దని, శివశంకర్‌ మాస్టర్‌కు అండగా తామంతా ఉన్నామనే ధైర్యానిచ్చారు. ‘చిరంజీవిగారంటే నాన్నకు ఎంతో అభిమానం. వారిద్దరి కలయికలో పలు హిట్‌ గీతాలు తెరకెక్కాయి. చిరంజీవి చేసిన సాయం మరిచిపోలేనిది. ఈ కష్టసమయంలో ప్రతి పైసా మాకు అవసరం’ అని అజయ్‌ అన్నారు.

కొన్నిరోజుల క్రితం కరోనా బారిన పడిన శివశంకర్ చికిత్స కోసం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో ఆయన ఆరోగ్యం విషమంగా మారింది. ప్రస్తుతానికి ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. కరోనా బారిన పడిన శివశంకర్‌ పెద్ద కుమారుడూ అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన సతీమణికీ కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ కాగా ఆమె హోం క్వారంటైన్‌లో ఉన్నారు. కుటుంబ సభ్యుల చికిత్సకు కావాల్సిన డబ్బు తన వద్ద లేకపోవడంతో అజయ్‌ సామాజిక మాధ్యమాల వేదికగా దాతల్ని కోరారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు నటులు స్పందించారు. తమవంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని