Updated : 29/09/2021 17:15 IST

MAA Elections: నాది కృష్ణుడి పాత్ర... విష్ణు రథం ఎక్కుతున్నా : నరేశ్‌

ఇంటర్నెట్ డెస్క్‌: ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) మసకబారింది అన్నప్పుడు నేను ఎన్నికల్లో నిలబడ్డా. జాయింట్‌ సెక్రటరీగా గెలిచా’ అని సీనియర్‌ నటుడు, ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్‌ అన్నారు. ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తోన్న మంచు విష్ణు, అతని ప్యానల్‌తో కలిసి నరేశ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. 

నరేశ్ మాట్లాడుతూ.. ‘‘మా’లో నేను 20 ఏళ్లు కేవలం సాధారణ సభ్యుడిగానే ఉన్నా. జయసుధ పోటీ చేస్తున్నప్పుడు నన్ను వైస్‌ ప్రెసిడెంట్‌గా చేయమని దివంగత దాసరి నారాయణరావు అడిగితే సరేనన్నాను. అయితే కొన్ని కారణాల వల్ల ఆ తర్వాత ‘జాయింట్‌ సెక్రటరీగా చేస్తావా’ అన్నారు. ఇక్కడ ‘స్థాయి అంటూ ఏం ఉండదండి. ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా అయినా పోటీ చేసేందుకు సిద్ధం’ అని నేను అన్నాను. ‘మా’లో ప్రతి సభ్యుడూ సమానం అనే ఆలోచనతో వచ్చాం. మేం 22 మంది గెలిచాం. కానీ, జయసుధ ఓడిపోయింది. నేను జాయింట్‌ సెక్రటరీగా గెలిచాను. వెల్ఫేర్‌ కమిటీ ఛైర్మన్‌ అయ్యాను. నటులకు సినీ అవకాశాలు, కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం కృషి చేశాను. ఇవన్నీ చరిత్రలో ఓ భాగం. మసకబారుతున్న ‘మా’ను వెలుగులోకి తీసుకురావాలని చేసిన ప్రయత్నం అది’’ అని చెప్పారు.

ఎవరు పడితే వారు వస్తే ఎలా...

‘‘మా’ రాజకీయ వేదిక కాదు. పదవీ వ్యామోహాలు ఉండకూడదు. కొవిడ్‌ సమయంలో ‘మా’లో రెండు గ్రూపులు మొదలయ్యాయి. వాటిల్లో ఓ బృందం మీడియా వద్దకి వెళ్లి నిందించే ప్రయత్నం చేసింది. కరోనా సమయంలో భవనం కంటే మనుషుల ప్రాణాలకు ప్రాధాన్యతిచ్చాం. మేం చేయాల్సిన మంచి పనులు ఇంకా ఉన్నాయి. ‘మా’ అధ్యక్షుడిగా సంక్షేమ పథకాలు తీసుకొస్తా అని చెప్పా. ‘మా’ భవనం కోసం ప్రయత్నం చేశా. దానికి సంబంధించిన ఆధారాలున్నాయి. నా తర్వాత ‘మా’కి మంచి అధ్యక్షుడిని అందించడం నా బాధ్యత. పదవి చేపట్టినప్పుడే ఈ విషయం చెప్పాను. ఈ కుర్చీలోకి ఎవరు పడితే వారు వస్తే ‘మా’ వైభవం కోల్పోతుంది. ప్రకాశ్‌ రాజ్‌ నాకు మంచి స్నేహితుడు. మంచు విష్ణు ఇక్కడే అందరికీ అందుబాటులో ఉంటారు. ‘మా’ అధ్యక్షుడిగా విష్ణు సరైనవాడు. నాది కృష్ణుని పాత్ర. ‘మా’ కోసం మంచు విష్ణు రథం ఎక్కుతున్నాను. విష్ణుకి నా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నా’’ అని నరేశ్‌ చెప్పారు. 

శవ రాజకీయం చూశా...

‘‘ప్రకాశ్ రాజు ఆరు నెలల క్రితం ఓ ప్యానల్‌ని నిలబెట్టారు. తొందరపడొద్దని చెప్పా. ఆ తర్వాత నాతో ఫోన్‌లో మాట్లాడుతూ నేను పోటీ చేస్తున్నా అని అన్నారు... చేయండి అని స్వాగతించాను. ఎవరైనా ‘మా’ సభ్యులు చనిపోయినపుడు వెళ్లడం, ఎంతో కొంత ఇవ్వడం, ఫొటోలు దిగడం లాంటివి చేస్తుంటారు కొందరు. సేవా రాజకీయం, శవ రాజకీయం..  అని రెండు రకాలున్నాయి. నాకు మొదటిదే తెలుసు. కొంతమంది దగ్గర శవ రాజకీయం చూశా. పదవితో సంబంధం లేకుండా శివ బాలాజీ, రాజీవ్‌ కనకాల, లక్ష్మీకాంతరావు మంచి పనులు చేశారు. మెసేజ్‌లు పంపించడమే జనరల్‌ సెక్రటరీ బాధ్యతైతే..  ఆ పదవిలోకి నేను మళ్లీ వస్తా. ‘మా’ తరఫున మేం 16 కుటుంబాలకి 24 గంటల్లో జీవితా బీమా చెక్కులు అందించాం. ‘మా’ భవనం తర్వాతి సంగతి... ముందు మనుషులు బతకాలి కదా అనుకొని అలా చేశాం’’ అని నరేశ్‌ చెప్పారు. ‘‘మా’ భవనం నేను కడుతున్నా.. కావాల్సిన స్థలం చూశా అని విష్ణు ఇటీవల చెప్పాడు. వెంటనే బాలకృష్ణ.. విష్ణుకు ఫోన్‌ చేసి మాట్లాడి నేనున్నా అని అన్నారు. సంతోషం అనిపించింది. ఇప్పుడు చూస్తే మిగిలినవారెవరూ భవనం గురించి మాట్లాడటం లేదు’ అని నరేశ్‌ అన్నారు.

ప్రకాశ్‌రాజ్‌ ఆ మాటను వెనక్కి తీసుకోవాలి...

‘‘మా’ సభ్యుల కోసం ప్రభుత్వం ద్వారా సొంతిళ్లు ఇవ్వాలని అనుకున్నాం. దాని కోసం 70కిపైగా దరఖాస్తులు సిద్ధంగా ఉన్నాయి. కానీ, జనరల్ సెక్రటరీ కారణంగా అవి సబ్మిట్‌ చేయకుండా ఆగిపోయాయి. ‘మా’ అంటే అప్పులు, పప్పులు ఇవ్వటం మా పని కాదని ప్రకాశ్‌రాజ్‌ చెబుతున్నారు. నిధుల కోసం డ్యాన్స్‌లు, డ్రామాలు వేయొద్దని అంటున్నారు. ప్రత్యేక కార్యక్రమం కోసం ఇళయరాజాతో మాట్లాడుతున్నా అన్నారు. ఆ కార్యక్రమం కోసం తెలుగులో సంగీత దర్శకులు లేరా?’’ అని నరేశ్‌ ప్రశ్నించారు. ‘‘తెలుగువారు ‘మా’ అధ్యక్షులుగా ఉండాలి. ఆ పదవి కోసం ఇక్కడ సమర్థులు లేరన్న మాటను ప్రకాశ్‌రాజ్‌ వెనక్కి తీసుకోవాలి. మా ప్యానల్‌ అజెండా సంక్షేమం. మీది ఏంటి?’’ అని సూటిగా అడిగారు నరేశ్‌. మీరెప్పుడైనా ‘మా’ ఎన్నికల్లో ఓటు వేశారా? సమావేశాలకు హాజరయ్యారా? ఉన్నట్టుండి ఇలా ‘మా’పై ప్రేమ ఎలా పుట్టింది? మీ ఇష్టంతోనే వచ్చారా. ఎవరైనా పంపారా? అని ప్రకాశ్‌రాజ్‌ను నరేశ్‌ ప్రశ్నించారు. ఏదైనా సరే పూర్తి ప్యానల్‌ని గెలిపించాలని ఓటర్లను నరేశ్‌ కోరారు. విష్ణు ప్యానెల్‌ గెలుపు కోసం కృషి చేస్తానని, ఓడినా, గెలిచినా అంతా ‘మా’ సభ్యులమేనని నరేశ్‌ మరోసారి స్పష్టం చేశారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని