shyam singha roy: అక్షరం పట్టుకున్న ఆయుధం

స్త్రీ ఎవరికీ దాసి కాదు... ఆఖరికి దేవుడికి కూడా!  ఖబడ్డార్‌...’ అంటూ ‘శ్యామ్‌ సింగరాయ్‌’గా మీసం మెలేశాడు నాని. అతని కథేమిటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నాని కథానాయకుడిగా రాహుల్‌ సంకృత్యాన్‌ ...

Updated : 19 Nov 2021 07:39 IST

‘స్త్రీ ఎవరికీ దాసి కాదు... ఆఖరికి దేవుడికి కూడా!  ఖబడ్డార్‌...’ అంటూ ‘శ్యామ్‌ సింగరాయ్‌’గా మీసం మెలేశాడు నాని. అతని కథేమిటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నాని కథానాయకుడిగా రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమే ‘శ్యామ్‌ సింగరాయ్‌’. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. డిసెంబర్‌ 24న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. గురువారం ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ‘అడిగే అండ లేదని.. కలబడే కండ లేదని.. రక్షించాల్సిన దేవుడే రాక్షసుడిగా మారుతుంటే... కాగితం కడుపు చీల్చుకు పుట్టి... రాయడమే కాదు, కాల రాయడం కూడా తెలుసని.. అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే... శ్యామ్‌ సింగరాయ్‌’’ అంటూ   మొదలయ్యే ఈ టీజర్‌లో విజువల్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. కోల్‌కతా నేపథ్యంలో సాగే ఓ పీరియాడిక్‌ కథ అని స్పష్టమవుతోంది. నాని రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపిస్తారు. టీజర్‌ విడుదల కార్యక్రమంలో నాని మాట్లాడుతూ ‘‘రెండేళ్ల తర్వాత సరైన సినిమాతో వస్తున్నాను. ఈసారి క్రిస్మస్‌ మనదే. మంచి బృందం దొరికినప్పుడు ఎలాంటి సినిమా వస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణగా నిలుస్తుంది.  ఇదొక గొప్ప ప్రేమకథ. విన్నప్పుడే నాలో ఉద్వేగం కలిగింది. ఇలాగే కనుక తీస్తే చాలా బాగుంటుందని అనుకున్నా. అంతకంటే బాగా తీశాం’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘నేను నాని అభిమానినే. థియేటర్లో సినిమా చూసేందుకు నేనూ ఎదురు చూస్తున్నా’’ అన్నారు. కథా రచయిత సత్యదేవ్‌ జంగా మాట్లాడుతూ ‘‘విప్లవాత్మక ప్రేమగాథ ఇది. విప్లవం మనసుది, ప్రేమ హృదయానిది. ఈ రెండూ కలగలిపే కథే ఈ చిత్రం. మమ్మల్ని ప్రోత్సహించిన నానికి కృతజ్ఞతలు’’ అన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని