Tollywood: అక్టోబరు 6న ‘రాక్షస కావ్యం’

అభయ్‌ నవీన్‌, కుశాలిని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రాక్షస కావ్యం’. శ్రీమాన్‌ కీర్తి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దాము రెడ్డి, శింగనమల కల్యాణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Updated : 02 Sep 2023 13:53 IST

అభయ్‌ నవీన్‌, కుశాలిని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రాక్షస కావ్యం’. శ్రీమాన్‌ కీర్తి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దాము రెడ్డి, శింగనమల కల్యాణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసింది చిత్రబృందం. టీజర్‌తో మంచి స్పందనను సొంతం చేసుకున్న ఈ చిత్రం అక్టోబరు 6న విడుదల కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. మైథాలజీని, నేటి సామాజిక పరిస్థితులను అన్వయించి రూపొందించిన ఈ సినిమాలో అన్వేష్‌ మైఖేల్‌, పవన్‌ రమేష్‌, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషించారు.


నవ్వులే నవ్వులు

పరుచూరి సుదర్శన్‌, శ్రీ జంటగా... రవికిశోర్‌ బాబు చందిన దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది.  ఎన్‌.పాండురంగారావు, చిన్న రెడ్డయ్య కోయ నిర్మిస్తున్నారు. ఆమని, రఘుబాబు, నాజర్‌, పృథ్వీరాజ్‌, సప్తగిరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని శుక్రవారం విడుదల చేసింది చిత్రబృందం. ‘‘ఆద్యంతం నవ్వించి...  థ్రిల్‌ని పంచే కథతో  రూపొందుతున్న చిత్రమిది. ఒక వదంతి ఎవరెవరి జీవితాల్ని ఎలా ప్రభావితం చేసిందన్నది ఈ కథలో కీలకం. సుదర్శన్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన లుక్‌కి మంచి స్పందన లభిస్తోంది. పరుచూరి బ్రదర్స్‌ సంభాషణలు  చిత్రానికి ప్రధాన బలం’’ అని తెలిపాయి సినీ వర్గాలు. యోగి, దొరబాబు, జబర్దస్త్‌ రాజమౌళి, బాబి, సునీత మోహన్‌, రాజేశ్వరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వినోద్‌ యాజమాన్య, ఛాయాగ్రహణం: శివకుమార్‌ దేవరకొండ.


పవన్‌కల్యాణ్‌పై అభిమానంతో...

యామిన్‌రాజ్‌, విరాట్‌ కార్తీక్‌, ప్రియాంక రేవ్రి కీలక పాత్రధారులుగా... సాయి సునీల్‌ నిమ్మల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. ఆనంద్‌ వేమూరి, హరిప్రసాద్‌ సీహెచ్‌ నిర్మాత. ప్రముఖ కథానాయకుడు పవన్‌కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా శనివారం చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. కథానాయకుడు అరవింద్‌ కృష్ణ, నటుడు శివారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అరవింద్‌ కృష్ణ మాట్లాడుతూ ‘‘యామిన్‌రాజ్‌, నేను కలిసి వెబ్‌సిరీస్‌ చేశాం. తను ప్రతిభ కలిగిన నటుడు. ట్రైలర్‌ చాలా బాగుంది. ఈ చిత్ర దర్శకుడితో భవిష్యత్తులో సినిమా చేయాలని ఉంది’’ అన్నారు. కొత్త బృందం కలిసి ఓ వినూత్నమైన కథతో చేసిన ఈ ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు శివారెడ్డి. దర్శకుడు మాట్లాడుతూ ‘‘పవన్‌కల్యాణ్‌ అభిమానిని నేను. ఆ అభిమానంతోనే ఆయన పుట్టినరోజున ఈ సినిమాని విడుదల చేస్తున్నాం. కొత్త రకమైన కథతో రూపొందించిన చిత్రమిది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొంది.


వెండితెరకు ‘చరణ్‌దాస్‌ చోర్‌’ నాటకం

ప్రముఖ నాటక రచయిత హబీబ్‌ తన్వీర్‌ రచించిన ‘చరణ్‌దాస్‌ చోర్‌’ నాటకాన్ని చలనచిత్రంగా అభిమానులకు అందించనున్నారు సునీల్‌ వాద్వా. 1975లో ప్రఖ్యాతి పొందిన ఆ నాటకం...నిజాయతీ గల ఒక దొంగ జీవితం చుట్టూ తిరుగుతుంది. పద్మశ్రీ, పద్మ భూషణ్‌ అందుకున్న హబీబ్‌ తన్వీర్‌ శతజయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ... కర్మిక్‌ ఫిల్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై ఆ నాటకాన్ని వెండితెరపై చూపించడానికి అన్ని హక్కులను పొందారు సునీల్‌. ఆకట్టుకునే కథనంతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ నాటకం ఎడిన్‌బర్గ్‌ ఫ్రింజ్‌ ఫెస్టివల్‌లో ప్రతిష్ఠాత్మకమైన ఫ్రింజ్‌ ఫస్ట్‌ అవార్డును గెలుచుకుంది. ఈ కొత్త సినిమా ప్రయాణం గురించి కర్మిక్‌ ఫిల్మ్స్‌ వ్యవస్థాపకుడు సునీల్‌ మాట్లాడుతూ...‘‘చరణ్‌దాస్‌ చోర్‌’ను ఫీచర్‌ ఫిల్మ్‌గా ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ఇప్పుడున్న తరానికి చరణ్‌దాస్‌ నాటకం గురించి తెలిసేలా చేయడం గర్వంగా ఉంది’ అన్నారు. కర్మిక్‌ ఫిల్మ్స్‌ ప్రస్తుతం ఈ సినిమా కోసం పరిశ్రమలో ఉన్న ప్రముఖ నటులతో, నిర్మాతలతో చర్చలు జరుపుతోంది. ‘ఈ నాటకాన్ని సినిమాగా మలిచినందుకు ఆనందంగా ఉంది’ అంటూ హబీబ్‌ కూతురు నగీన్‌ తన్వీర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని