
వీసాలపై ట్రంప్ విధానాలను వెనక్కితీసుకోండి
బైడెన్‌ను కోరిన అమెరికా చట్టసభ్యులు
వాషింగ్టన్: హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములైన హెచ్4 వీసాదారులు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు ఇచ్చిన పని అనుమతుల కాలపరిమితిని పెంచాలని కోరుతూ 60 మంది అమెరికా చట్టసభ్యులు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన వలస విధానాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఆయనకు వినతిపత్రం అందజేశారు.
హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాముల(భార్యా లేదా భర్త)తో పాటు 21ఏళ్ల లోపు పిల్లలకు.. అమెరికా పౌరసత్వం, వలససేవల సంస్థ(యూఎస్సీఐఎస్) హెచ్4 వీసాలు జారీ చేస్తుంటుంది. అయితే తొలుత హెచ్4 వీసాదారులు అగ్రరాజ్యంలో ఉద్యోగం చేసుకునేందుకు వీలుండేది కాదు. దీంతో హెచ్-1బీ వీసాదారులపై ఆర్థికభారం అధికంగా ఉండేది. ఈ నేపథ్యంలో హెచ్4 వీసాదారులు చట్టపరంగా అమెరికాలో ఉద్యోగం చేసుకునేలా పని అనుమతి కల్పిస్తూ 2015లో అప్పటి ఒబామా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా.. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే.. వలస విధానంలో కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. హెచ్4 వీసాదారులకు పని అనుమతులు రద్దు చేయనున్నట్లు యూఎస్ కోర్టుకు తెలిపారు.
హెచ్1బీ వీసాదారుల భాగస్వాముల్లో చాలా మంది నిపుణులైన భారతీయ మహిళలే ఉన్నారు. ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన నిబంధనల కారణంగా అనేక మంది భవితవ్యం అయోమంలో పడింది. ఈ క్రమంలో వారి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ అమెరికా చట్టసభ్యులు బైడెన్‌ను కలిశారు. హెచ్4 వీసాలతో అమెరికాలో పనిచేస్తున్న ఎంతోమంది విదేశీ మహిళలు.. వైద్యంతో పాటు అనేక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని చట్టసభ్యులు తమ వినతి పత్రంలో పేర్కొన్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో వారి అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేశారు. వీరిపై రాబోయే ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.