
ఆ రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయపు అంచులకు చేరుకున్నట్లే కనబడుతోంది. విజేత ఎవరో నేడు దాదాపు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జార్జియా, పెన్సిల్వేనియా, నెవాడాలో బైడెన్ ఆధిక్యం కొనసాగుతోంది. వీటిలో ఏ ఒక్కటి గెలిచినా బైడెన్ విజయం సాధించినట్లే. అయితే, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేయాలనుకుంటున్న న్యాయపోరాటం బైడెన్ గెలుపు ప్రకటనను కాస్త ఆలస్యం చేయొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం.. బైడెన్ గెలుపు సునాయసమేనని స్పష్టమవుతోంది.
జార్జియాలో ట్రంప్ ఆధిక్యానికి శుక్రవారమే గండికొట్టిన బైడెన్ ప్రస్తుతం 4,020 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇంకా ఒక శాతం ఓట్లు లెక్కించాల్సి ఉంది. కానీ, ఇద్దరు అభ్యర్థుల మధ్య అంతరం తక్కువగా ఉండడంతో రీకౌంటింగ్ అనివార్యమని అధికారులు ప్రకటించారు. ఇక్కడ ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల సంఖ్య 16.
నార్త్‌కరోలినాలో 99 శాతం కౌంటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ట్రంప్ 76,479 ఓట్లతో బైడెన్ కంటే ముందున్నారు. అయితే, ఇక్కడ మెయిల్-ఇన్ బ్యాలెట్లు చేరడానికి కోర్టు ఇంకొంత సమయం ఇవ్వడంతో తుది ఫలితం తేలడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక్కడ ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల సంఖ్య 15.
20 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లున్న పెన్సిల్వేనియాలోనూ బైడెన్ ఆధిక్యం స్పష్టంగా కనబడుతోంది. ప్రస్తుతం ఆయన 21,749 ఓట్లతో ట్రంప్ కంటే ముందంజలో ఉన్నారు. బైడెన్ ఈ ఒక్క రాష్ట్రంలో గెలిస్తే చాలు. మ్యాజిక్ ఫిగర్ 270ని దాటేస్తారు. మిగిలిన రాష్ట్రాలన్నీ ట్రంప్ గెలిచినా బైడెన్‌ను అధిగమించలేరు. అయితే, జార్జియా తరహాలో రీకౌంటింగ్‌కు అవకాశాలు కల్పించొద్దంటే బైడెన్ భారీ మెజార్టీతో గెలవాల్సిన అవసరం ఉంది. లేదంటే ట్రంప్ వర్గం రీకౌంటింగ్‌కు డిమాండ్ చేసి ఫలితాల్ని మరింత జాప్యం చేసే అవకాశం లేకపోలేదు. ఇంకా లక్షకు పైగా మెయిల్-ఇన్ బ్యాలెట్లు, భారీ స్థాయిలో ప్రొవిజినల్ బ్యాలెట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు లెక్కించిన పోస్టల్ ఓట్లలో మెజారిటీ బైడెన్‌కే అనుకూలంగా రావడం గమనార్హం.
నెవాడాలో ముందు నుంచీ బైడెన్ ఆధిక్యం కనబరుస్తున్నారు. ఇక్కడ ఆరు ఎలక్టోరల్ కాలేజీ ఓట్లున్నాయి. ప్రస్తుతం బైడెన్ 22,657 ఓట్లతో ముందంజలో ఉన్నారు. శుక్రవారం ఇరువురు అభ్యర్థుల మధ్య అంతరం దాదాపు రెట్టింపవడం గమనార్హం. ఇక్కడ కౌంటింగ్ పూర్తి కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 87 శాతం ఓట్లను మాత్రమే లెక్కించారు.
అలస్కాలో మొత్తం మూడు ఎలక్టోరల్ కాలేజీ ఓట్లున్నాయి. ఇప్పటి వరకు 50 శాతం ఓట్లు లెక్కించారు. ప్రస్తుతం ట్రంప్ 54,610 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇక్కడా పూర్తి ఫలితాలు తేలడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది.
ఇక కౌంటింగ్ కొనసాగుతున్న మరో రాష్ట్రం అరిజోనాలోనూ బైడెన్ ఆధిక్యం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఇక్కడ 93శాతం కౌంటింగ్ పూర్తయినట్లు కొన్ని మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం బైడెన్ 1.3శాతం ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. కానీ, బైడెన్ ఆధిక్యం నిన్నటితో పోలిస్తే తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి.
బైడెన్ ముందుగా ప్రకటించరు...
ఫలితాలు పూర్తిగా తనకు అనుకూలంగా మారినప్పటికీ బైడెన్ తాను గెలిచినట్లుగా ముందస్తుగా ప్రకటించుకునే అవకాశం లేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే, ఆయా రాష్ట్రాల్లో కౌంటింగ్ సరళిని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉందని సమాచారం.
ఇద్దరు అభ్యర్థులకు ఉన్న గెలుపు అవకాశాలు..
బైడెన్..
కౌంటింగ్ కొనసాగుతున్న అరిజోనా, నార్త్ కరోలినా, నెవాడా, జార్జియాలో ఏవైనా రెండు గెలవాలి.. లేదా పెన్సిల్వేనియా ఒక్కటి గెలిస్తే సరిపోతుంది.
ట్రంప్..
అరిజోనా, నార్త్ కరోలినా, నెవాడా, జార్జియాలో ఏవైనా మూడింటితో పాటు పెన్సిల్వేనియాలో కచ్చితంగా గెలవాలి.
* ఒకవేళ ట్రంప్ అరిజోనా, నెవాడా, నార్త్‌కరోలినా, పెన్సిల్వేనియాలో గెలిస్తే ఫలితాలు టై అయ్యే అవకాశమూ ఉంది.
* అయితే, ఇప్పటికే కొన్ని కీలక మీడియా సంస్థలు అరిజోనాను బైడెన్ ఖాతాలో వేసి ఆయన సాధించిన ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను 264గా పేర్కొంటున్న విషయం తెలిసిందే. లేదంటే బైడెన్ సాధించిన ఓట్లు 253గానే ఉంటాయి. ఇక ట్రంప్ ఇప్పటి వరకు 214 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు సాధించారు.
ఇవీ చదవండి..
ట్రంప్‌పై 40లక్షల ఓట్ల తేడాతో గెలుస్తున్నాం..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.