
అమెరికాలో హైదరాబాద్ వ్యక్తి దారుణ హత్య
హైదరాబాద్: అమెరికాలోని జార్జియాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన మొహమ్మద్ ఆరిఫ్ మొహియుద్దీన్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. చంచల్‌గూడకి చెందిన 37 ఏళ్ల ఆరిఫ్.. గత పదేళ్లుగా అమెరికాలో ఉంటున్నాడు. జార్జియా రాష్ట్రంలోని థామస్టన్ పట్టణంలో కిరాణా దుకాణం నడుపుతున్నాడు. కాగా అతడిని గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం కత్తితో పొడిచి చంపారు. మృతుడు ఆరిఫ్‌కు భార్య మెహనాజ్ ఫాతిమా, పది నెలల పాప ఉన్నారు. కుమార్తె జన్మించిన సందర్భంగా అతడు పది నెలల క్రితమే నగరానికి వచ్చివెళ్లారు.
విభేదాలే కారణమా?
తనకు వ్యాపార భాగస్వామితో విభేదాలు తలెత్తినట్టు ఆరిఫ్ ఆదివారం తన భార్యకు ఫోన్లో తెలిపాడు. షాపు మూసివేసి అరగంటలో ఇంటికి చేరిన అనంతరం మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పాడు. అయితే చాలాసేపటి వరకు ఆయన నుంచి ఫోన్ రాలేదని.. తాను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని మృతుని భార్య ఫాతిమా తెలిపారు. తన భర్త హత్యకు గురైనట్టు ఆయన స్నేహితుల ద్వారా తెలిసిందని ఆమె వెల్లడించారు. భాగస్వాములతో విభేదాలే హత్యకు కారణంగా అనుమానిస్తున్నారు.
కాగా ఎంబీటీ పార్టీ అధికార ప్రతినిధి అంజేదుల్లా ఖాన్.., చంచల్గూడలోని మృతుని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భార్య, మామలకు అత్యవసర వీసా ఇప్పించాల్సిందిగా హైదరాబాద్‌లోని అమెరికన్ రాయబార కార్యాలయం, తెలంగాణా ప్రభుత్వాలకు ఖాన్ విజ్ఞప్తి చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.