Published : 17 Sep 2020 23:19 IST

భారత సంతతి వ్యక్తికి జీవిత ఖైదు

భార్య హత్య కేసులో బ్రిటన్‌ కోర్టు తీర్పు

లండన్‌: భార్యను దారుణంగా హత్య చేసిన 23 ఏళ్ల భారత సంతతి వ్యక్తికి బ్రిటన్‌ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. గుజరాత్‌కు చెందిన జిగుకుమార్‌ సోర్థి అనే యువకుడికి కనీసం 28 సంవత్సరాలు జైలులో గడపాల్సిందిగా బ్రిటన్‌ న్యాయస్థానం ఆదేశించింది. తదనంతరం మాత్రమే పెరోల్‌ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని లైసెస్టర్‌ షైర్‌ క్రౌన్‌ కోర్టు స్పష్టం చేసింది. కుమార్‌ భార్య భావినీ ప్రవీణ్‌ (21) లైసెస్టర్‌ పట్టణంలోని తన ఇంటిలో కత్తిపోట్లకు గురై మరణించారు. ‘‘ఇది జాలి, దయ లేకుండా చేసిన దారుణ హత్య. ఎంతో భవిష్యత్తున్న ఓ యువతి ప్రాణాలు తీశావు. ఆమె తల్లిదండ్రులకు ప్రియమైన కుమార్తెను దూరం చేసి, తీరని దుఃఖం కలిగించావు.’’ అని న్యాయమూర్తి జస్టిస్‌ టిమోతీ స్పెన్సర్‌ బుధవారం నాటి తీర్పు సందర్భంగా కుమార్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

జిగుకుమార్‌, భావినిల వివాహం 2017లో జరిగింది. 2018లో కుమార్‌ ఆమెను తనతో బ్రిటన్‌కు తీసుకెళ్లాడు. అయితే ఆ తర్వాత దంపతుల మధ్య విభేదాలు రావడంతో వారు విడివిడిగా నివశిస్తున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా మార్చి 2 మధ్యాహ్నం 12:30 గంటలకు జిగుకుమార్‌ ఆమె ఇంటికి వెళ్లాడు. కొద్ది నిముషాలు మాట్లాడిన అనంతరం ఆమెపై కత్తితో పలుమార్లు దాడిచేసి, అక్కడి నుంచి పారిపోయాడు. వైద్య సహాయం అందించేందుకు వచ్చిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినట్టు నిర్ధారించారు.

భావిని తనను నిర్లక్ష్యం చేసిందని, వివాహాన్ని రద్దు చేసుకోవాలనే ఆమె నిర్ణయం తనను ఎంతో బాధించిందని కుమార్ ఈ నెల ప్రారంభంలో జరిగిన విచారణలో వివరించాడు. అంతేకాకుండా ఆమె తన జీవితాన్ని నాశనం చేసిందని జిగుకుమార్‌ ఆరోపించాడు. తన క్లయింటు తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నట్టు ఆయన తరపు న్యాయవాది వాదించారు. అయితే నిందితుడు హత్య చేసే ఉద్దేశంతోనే తనతో కత్తిని తీసుకెళ్లినట్టు కోర్టు అభిప్రాయపడింది. తను ఆవేశంలో ఈ హత్య చేశానని న్యాయస్థానాన్ని నమ్మించే ప్రయత్నం చేయటాన్ని కోర్టు తప్పుపట్టింది.

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని