Published : 04/01/2021 10:47 IST

ఓట్లు కావాలంటూ ‘ట్రంప’రితనం

జార్జియా ఫలితాన్ని మార్చేలా అధికారిపై ఒత్తిడి

అట్లాంటా: మరికొద్దిరోజుల్లో అధికార పీఠాన్ని వీడబోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విపరీత చర్యలకు పాల్పడుతున్నారు. చివరి రోజుల్లో ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటూ అభాసుపాలవుతున్నారు. తాజాగా ట్రంప్‌ చేసిన ఓ పని అగ్రరాజ్యం నోరెళ్లబెట్టేలా ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటమిని ఇంతవరకూ అంగీకరించని ట్రంప్‌.. జార్జియా ఫలితాన్ని మార్చేలా అధికారిపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 

నవంబరు 3న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్లకు మంచి పట్టున్న జార్జియాలో ట్రంప్‌ ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. ఈ రాష్ట్రంలో ట్రంప్‌పై డెమొక్రాటిక్‌ నేత జో బైడెన్ 11,779 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో జార్జియాలోని 16 ఎలక్టోరల్‌ ఓట్లు బైడెన్‌ ఖాతాలోకి వెళ్లాయి. అయితే, ఈ ఓట్లన్నీ తనవేనని, అక్రమంగా డెమొక్రాటిక్‌ నేతకు కేటాయించారని ట్రంప్‌ మొదట్నుంచీ విమర్శలు చేస్తూనే ఉన్నారు. దీనిపై జార్జియాలో ఎన్నికలు నిర్వహించిన అక్కడి సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌, రిపబ్లిక్‌ నేత బ్రాడ్‌ రఫెన్స్‌పెర్జర్‌పై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. 

తాజాగా ఇదే విషయమై ట్రంప్‌ మరోసారి బ్రాడ్‌తో ఫోన్లో మాట్లాడారు. ‘నా నుంచి అక్రమంగా తీసుకున్న 11,780 ఓట్లు ఎలాగైనా సరే నాకు కావాలి. అప్పుడు జార్జియాలో మేం గెలవొచ్చు’ అని ట్రంప్‌ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ ఆడియో సంభాషణలను వాషింగ్టన్‌ పోస్ట్‌ ఆన్‌లైన్‌లో పోస్ట్‌చేసింది. దీనిపై అటు శ్వేతసౌధం కానీ, ఇటు బ్రాడ్‌ ఆఫీస్‌ గానీ స్పందించలేదు.

కాగా.. బ్రాడ్‌తో మాట్లాడినట్లు ట్రంప్‌ ఆదివారం ట్వీట్‌ చేశారు. ‘జార్జియాలో 17,000పైగా ఓట్లు ట్రంప్‌ నుంచి అక్రమంగా బైడెన్‌కు వెళ్లినట్లు తాజాగా వెలువడిన ఎన్నికల డేటాలో తెలిసింది. ఈ ఓట్లు చాలు జార్జియా ట్రంప్‌కు మారడానికి..! దీనిపై నేడు బ్రాడ్‌ రఫెన్స్‌పెర్జర్‌తో మాట్లాడాను. ఎన్నికల్లో మోసాలు జరిగాయి. చనిపోయిన వారి ఓట్లు, బయటి వ్యక్తుల ఓట్లు పోలయ్యాయి. అయితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు బ్రాడ్‌ ఆసక్తిగా లేరు. లేదా అయనకు కూడా తెలియకపోవచ్చు’ అని ట్రంప్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. అయితే దీనికి బ్రాడ్‌ స్పందిస్తూ.. ‘ప్రెసిడెంట్‌ ట్రంప్‌: మీరు చెబుతున్నది నిజం కాదు. వాస్తవం ఎప్పటికైనా బయటపడుతుంది’ అని సమాధానమిచ్చారు. 

అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ట్రంప్‌ పదేపదే ఆరోపిస్తున్నప్పటికీ.. ఆయన సొంత పార్టీ నేతలు, ప్రభుత్వ అధికారులే వీటికి తోసిపుచ్చడం గమనార్హం. ఎన్నికలు పారదర్శకంగా జరిగాయంటూ ట్రంప్‌ మాజీ అటార్నీ జనరల్‌ విలియం బార్‌ కూడా ధ్రువీకరించారు. జార్జియా, అరిజోనాల్లోని రిపబ్లికన్‌ గవర్నర్లు కూడా ఎన్నికల కచ్చితత్వాన్ని ధ్రువీకరించారు. మరోవైపు ఫలితాలపై ట్రంప్‌కు న్యాయస్థానాల్లోనూ చుక్కెదురైంది. అయినప్పటి ఆయనింకా ఓటమిని అంగీకరించట్లేదు. ఎన్నికల్లో జో బైడెన్‌కు 306 ఎలక్టోరల్‌ ఓట్లు రాగా.. ట్రంప్‌నకు 232 ఓట్లు పోలయ్యాయి. బైడెన్‌ గెలుపును ఎలక్టోరల్‌ కాలేజీ కూడా ధ్రువీకరించింది. జనవరి 20న ఆయన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 

ఇదీ చదవండి..

పోతూ.. పోతూ.. నిషేధం విధిస్తూ

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని