‘అధికారి’ లేకుండా దీదీ హ్యాట్రిక్‌ కొట్టగలరా?

వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ బెంగాల్‌ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలో హ్యాట్రిక్‌ కొట్టాలని తృణమూల్‌ కాంగ్రెస్‌.. పాగా వేయాలని భాజపా తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ఈ తరుణంలో నందిగ్రామ్‌ పోరాటంలో కీలకంగా వ్యవహరించి బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన సువేందు అధికారి వ్యవహారం చర్చనీయాంశంగా............

Published : 15 Dec 2020 01:36 IST

సువేందు నిర్ణయంపై ఉత్కంఠ

ఇంటర్నెట్‌ డెస్క్‌: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బెంగాల్‌ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలో హ్యాట్రిక్‌ కొట్టాలని తృణమూల్‌ కాంగ్రెస్‌.. పాగా వేయాలని భాజపా తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ఈ తరుణంలో నందిగ్రామ్‌ పోరాటంలో కీలకంగా వ్యవహరించి, బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించిన సువేందు అధికారి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో అంతర్గత కలహాలు, అసమ్మతి సెగలతో నందిగ్రామ్‌ ఎమ్మెల్యే సువేందు అధికారి పార్టీ వ్యవహారాలకు గత కొంత కాలంగా దూరంగా ఉండటం, ఇటీవల మంత్రి పదవికి సైతం రాజీనామా చేయడం తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి తలనొప్పిగా మారింది. తాజా పరిణాలతో సువేందు తృణమూల్‌ కాంగ్రెస్‌ను వీడతారనే ప్రచారం కూడా జోరందుకుంది. కొన్ని నెలలుగా ఆయన తిరుగుబాటు నేతగానే కొనసాగుతున్నారు. దీంతో మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ మమతా బెనర్జీపై పోరాడేందుకు ఆయన భాజపాలో చేరతారనే ఊహాగానాలు కూడా వినబడుతున్నాయి. జంగల్‌ మహల్‌ ప్రాంతంలో గట్టి పట్టున్న అధికారి కుటుంబం గనక తృణమూల్‌ను వీడితే బెంగాల్‌లో దీదీ హ్యాట్రిక్‌ కొట్టడం అంత సులభమేమీ కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ పరిణామాల నేపథ్యంలో సువేందు అధికారి ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశం బెంగాల్‌ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.

ఇటీవల పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు/ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయోత్సాహంతో భాజపా ముందుకు దూసుకుపోతుండగా.. అంతర్గత కలహాలు, అసమ్మతి సెగలు తృణమూల్‌ కాంగ్రెస్‌ను కుంగదీస్తున్నాయి. ఇదే ఛాన్స్‌గా.. అధికార పార్టీలో ప్రతికూల అంశాలను తమకు అనుకూలంగా మలచుకొని బెంగాల్‌ పీఠంపై కాషాయ జెండా ఎగురవేసేందుకు కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బెంగాల్‌లో రాజకీయాల్లో, ముఖ్యంగా జంగల్‌ మహల్‌ ప్రాంతంలో గట్టి పట్టున్న అధికారి కుటుంబాన్ని తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో మమత మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ ఆధిపత్యాన్ని ఇష్టపడని సువేందు అధికారి మంత్రి పదవి సహా పలు పదవులకు రాజీనామా చేశారు. తాజాగా ఆయన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 

ఎవరీ సువేందు అధికారి?
బెంగాల్‌లోని మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌లో సువేందు అధికారి రవాణా శాఖ, నీటిపారుదల శాఖల మాజీ మంత్రి. ప్రస్తుతం నందిగ్రామ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో రెండు పర్యాయాలు (2009, 2014) తమ్లుక్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. అయితే, పార్టీలో నెలకొన్న వ్యవస్థాగతమైన నిర్ణయాలు, దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఆధిపత్యం నచ్చకపోవడంతో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. నవంబర్‌ 27న  తన మంత్రి పదవికి రాజీనామా చేస్తూ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్‌ ధన్కర్‌కు లేఖలు పంపారు. అంతకముందే హూగ్లీ రివర్‌ బ్రిడ్జి కమిషనర్స్‌ ఛైర్మన్‌గా, హల్దియా డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌ పదవులకు సైతం రాజీనామా చేయడం స్థానికంగా కలకలం రేపింది. 2007లో నందిగ్రామ్‌ ఉద్యమాన్ని ముందుకు నడిపించింది అధికారి కుటుంబమే. ఒకరకంగా ఆ ఉద్యమం వల్లే 2011లో వామపక్ష ప్రభుత్వం కుప్పకూలిపోయింది. సీపీఎంకు కంచుకోటగా ఉన్న జంగల్‌మహల్‌ ప్రాంతాన్ని తృణమూల్‌ వైపు తిప్పడంలో అధికారి కుటుంబానిదే కీలక పాత్ర. తూర్పు మిడ్నాపూర్‌ జిల్లాకు చెందిన సువేందు అధికారి.. ముర్షిదాబాద్‌, మాల్దా, పురూలియా, బంకురాలలో రాజకీయంగా అధిక ప్రభావం చూపగలిగిన నాయకుడు. ఈ జిల్లాల్లోనే తృణమూల్‌ కాంగ్రెస్‌కు గట్టి పునాదులు ఏర్పడేందుకు ఆయన క్షేత్రస్థాయిలో విశేషంగా పనిచేశారు. జంగల్‌ మహల్‌ ప్రాంతంలో అధికారి కుటుంబం దాదాపు 40 స్థానాలకు పైగా (మొత్తం అసెంబ్లీ స్థానాలు 294) ప్రభావం చూపే అవకాశముంది.

ఎందుకంత ప్రభావం?
జంగల్‌మహల్‌ ప్రాంతంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి అత్యంత ప్రజాదారణ కలిగిన నేతల్లో ఒకరిగా సువేందు ఉన్నారు. తూర్పు మిడ్నాపూర్‌ జిల్లాల్లో శక్తివంతమైన అధికారి కుటుంబానికి చెందడం ఆయనకు మరింత అదనపు బలం. ఆయన తండ్రి శిశిర్‌ అధికారి, పెద్ద అన్నయ్య దివ్యేందు అధికారి కూడా కాంటి, తమ్లుక్‌ ఎంపీలుగా ఉన్నారు. శిశిర్‌ అధికారి మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి మంత్రిగానూ పనిచేశారు. సువేందు తూర్పు మిడ్నాపూర్‌లో బలమైన నేత కావడంతో పాటు పశ్చిమ మిడ్నాపూర్‌, బంకురా, పురూలియా, ఝార్‌గ్రామ్‌, బిర్భుంలోని కొన్ని ప్రాంతాల్లో దాదాపు 40 అసెంబ్లీ స్థానాల్లో వీరికి మంచి బలముంది. తానెంతో కష్టపడే ఈ స్థాయికి వచ్చాను తప్ప ఎవరి సహకారం వల్లో రాలేదంటారు సువేందు. తనద్వారా పార్టీలోకి ప్రవేశించిన వారు తనపై కుట్రలు చేస్తున్నారంటూ అక్టోబర్‌ 31న ఓ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించడం కలకలం రేపింది. అయితే, ఆయన రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండేవారని, కొన్ని ముఖ్యమైన సమావేశాలకు సైతం హాజరు కాలేదని పార్టీ వర్గాల సమాచారం. 

తలుపులు తెరిచే ఉంచాం: భాజపా
అధికార పార్టీలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్న భాజపా తొలుత దీనిపై స్పందించేందుకు నిరాకరించినప్పటికీ.. ప్రస్తుత పరిణామాలతో రంగంలోకి దూకింది. కమల దళంలోకి సువేందును ఆహ్వానించింది. ఆయన వస్తే తమ పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేసింది. ఈ జనాకర్షక నేతను తమ వైపు తిప్పుకొనేలా పావులు కదుపుతోంది. ఇప్పటికే రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షుడు సౌమిత్ర ఖాన్‌ కూడా ఆయన్ను తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అలాగే, తృణమూల్‌ కాంగ్రెస్‌లో నిజాయతీతో, కష్టపడిపనిచేసేవారికి చోటు దక్కడంలేదని, సువేందు లాంటి మాస్‌ లీడర్లకు స్వేచ్ఛగా పనిచేసే అవకాశం కూడా లేదని ఖాన్‌ అన్నారు.  గతంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ కూడా అధికారి ప్రజలతో ఎంతో బలమైన సంబంధాలు కలిగి ఉన్నారంటూ పలు సందర్భాల్లో ప్రశంసించారు. మంత్రి పదవికి అధికారి రాజీనామా చేసిన నేపథ్యంలో భాజపా జాతీయ కార్యదర్శి అనుపం హజ్రా స్పందిస్తూ.. దీన్ని ఆహ్వానించదగిన పరిణామమంటూ ట్వీట్‌ చేశారు. 

తృణమూల్‌ రియాక్షన్‌ ఏంటి?
భాజపా ప్రయత్నాలను తృణమూల్‌ కాంగ్రెస్‌ గట్టిగానే ప్రతిఘటిస్తోంది. కమలనాథులు తమ పార్టీని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడుతోంది. అధికారి తమ పార్టీకి ఆస్తి అని తృణమూల్‌ నేతలు చెబుతున్నారు. తమ పార్టీలో ఫిరాయింపులు జరిగేలా భాజపా ప్రయత్నిస్తోందని తృణమూల్‌ ఎంపీ సౌగత్‌ రాయ్‌ ఆరోపించారు. మరోవైపు, అధికారితో సయోధ్యకు, బుజ్జగించేలా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఆయనతోను, ఆయన సన్నిహితులతో చర్చలు కొనసాగిస్తోందని పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు, సువేందు అధికారి కొత్తగా పార్టీ ఏర్పాటు చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తూర్పు మిడ్నాపూర్‌లోని పలు ప్రాంతాల్లో గత రెండు నెలలుగా దాదా ఫాలోవర్స్‌ అనే బ్యానర్లు హల్‌చల్‌ చేస్తున్నాయి. దీంతో ఆయన 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీ పెడతారంటూ ఊహాగానాలు చెలరేగాయి. నవంబర్‌లో తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సువేందు అధికారి.. పార్టీలో సంస్థాగత నిర్ణయాలపై అసంతృప్తికి తోడు అభిషేక్‌ బెనర్జీ, ప్రశాంత్‌ భూషణ్‌ జోక్యం వల్లే రాజీనామా చేసినట్టు చెప్పారు. తాను ఎక్కడికీ వెళ్లడంలేదని స్పష్టంచేశారు. ఈ తరుణంలో ఆయన పార్టీ మారతారా? కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారా? అనే చర్చ ఊపందుకొంది.

ఇవీ చదవండి

బెంగాల్‌లో రస‌వత్తర రాజకీయం

1975 ఎమర్జెన్సీ: కేంద్రానికి సుప్రీం నోటీసులు!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని