బెంగాల్‌ ‘షేక్‌’లా మారిన అభిషేక్‌: అనురాగ్‌

పశ్చిమబెంగాల్‌ అభివృద్ధి చెందాలంటే కేవలం ప్రధాని నరేంద్రమోదీతోనే సాధ్యమని భాజపా నేత, కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. బెంగాల్‌ అభివృద్ధి కాకపోవడానికి ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిజిత్‌లే కారణమని ఆరోపిస్తూ..

Updated : 06 Jan 2021 04:15 IST

కోల్‌కతా: పశ్చిమ్‌ బెంగాల్‌ అభివృద్ధి చెందాలంటే కేవలం ప్రధాని నరేంద్రమోదీతోనే సాధ్యమని భాజపా నేత, కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. బెంగాల్‌ అభివృద్ధి కాకపోవడానికి ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్‌‌లే కారణమని ఆరోపిస్తూ.. వారిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం బెంగాల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. 

‘సాధారణంగా మనకు గల్ఫ్‌ దేశాల్లో షేక్‌లు కనిపిస్తుంటారు. కానీ ఇక్కడ అభిషేక్‌ అనే వ్యక్తే.. ‘షేక్‌’ లా మారిపోయారు. ఇక్కడి అభిషేక్‌ ఇప్పుడు ఎంత పెద్ద షేక్‌ అయ్యాడో ప్రపంచానికి తెలుసు’ అని ఠాకూర్‌ తీవ్రంగా విమర్శించారు. ‘పశ్చిమ్‌ బెంగాల్‌ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే అది కేవలం ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోనే సాధ్యమవుతుంది. బెంగాల్‌ను అభివృద్ధి చేయడమనేది కష్టతరమైన పని అని కొందరు చెబుతున్నారు. అవును అభివృద్ధి చేయడం ఇష్టం లేని వారికి అది కష్టమైన పనే. కానీ  మోదీ తల్చుకుంటే  సాధ్యం కానిది ఏదీ లేదు’ అని ఠాకూర్‌ అన్నారు. 

పశ్చిమ్‌బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. సీఎం మమతా బెనర్జీపై విమర్శలతో భాజపా దూకుడు పెంచుతోంది. మమత తన మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీకి పగ్గాలు అప్పగించి కుటుంబ రాజకీయాలకు తెరలేపే ప్రయత్నం చేస్తున్నారని భాజపా ఘాటు విమర్శలు సంధిస్తోంది. కాగా ఇప్పటికే గతనెలలో టీఎంసీ ఆ రాష్ట్రంలో ఎన్నడూ లేని పరాభవాన్ని మూటగట్టుకుంది.

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాష్ట్ర పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఆరుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ సహా 60 మంది టీఎంసీ నాయకులు భాజపాలో చేరడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. పార్టీ మారిన వారిలో కీలకమైన సువేందు అధికారి ఉండటం గమనార్హం. మమత తన మేనల్లుడికి అధికార పగ్గాలు అప్పగించే ప్రక్రియ చేపట్టడమే.. ఆయా నేతలు ఆ పార్టీకి రాజీనామా చేయడానికి కారణాలుగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇదీ చదవండి

ఆ దేశాలన్నీ మళ్లీ ‘లాక్‌’డౌన్‌లోకే!
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని