ఏపీ హోంమంత్రి ఎవరో సగం మంది వైకాపా ఎమ్మెల్యేలకు తెలియదు: అచ్చెన్న

సీఎం జగన్‌కు తన ఆర్థిక భద్రతపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంలోని శాంతి భద్రతలపై లేకపోవటం సిగ్గుచేటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.

Updated : 03 Feb 2024 13:06 IST

అమరావతి: సీఎం జగన్‌కు తన ఆర్థిక భద్రతపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంలోని శాంతి భద్రతలపై లేకపోవటం సిగ్గుచేటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. విశాఖ జిల్లాలో తహసీల్దార్ రమణయ్య హత్య దుర్మార్గమన్నారు. మండల మేజిస్ట్రేట్‌ను ఇంటికి వెళ్లి హత్య చేశారంటే రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి లేదన్నారు. వైకాపా వచ్చాక రాష్ట్రమంతా రాజారెడ్డి రాజ్యాంగం, పులివెందుల పంచాగం అమలవుతోందని విమర్శించారు. జగన్‌ పాలనలో ప్రజల ఆస్తులకే కాదు ప్రాణాలకూ రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. ఇంతటి నేరాలు జరుగుతుంటే రాష్ట్ర హోంమంత్రి, పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. హోంమంత్రి ఎవరో వైకాపా ఎమ్మెల్యేల్లో సగం మందికి తెలియదన్నారు. తహసీల్దార్ రమణయ్య హత్యపై వెంటనే విచారణ చేపట్టి దోషుల్ని కఠినంగా శిక్షించాలని అచ్చెన్న డిమాండ్‌ చేశారు. 

భూ వివాదాలు ఉన్న చోట ప్రత్యేక రక్షణ కల్పించాలి

రమణయ్య హత్యను ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్ నేతలు బొప్పరాజు, చేబ్రోలు కృష్ణమూర్తి తీవ్రంగా ఖండించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. హత్యకు కారకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. అధిక భూ వివాదాలు ఉన్న మండలాల తహసీల్దార్లకు ప్రభుత్వం ప్రత్యేక రక్షణ కల్పించాలన్నారు. విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగిపై దాడులకు సంబంధించి దోషులపై చర్యలు తీసుకోవడానికి కఠినమైన చట్టం తీసుకురావాలన్నారు. తహసీల్దార్ దారుణ హత్యకు నిరసనగా ఇవాళ 26 జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని